Telangana Tourism Police : తెలంగాణలో అమల్లోకి కొత్త టూరిజం పోలీస్ విభాగం.. పర్యాటక ప్రాంతాల్లో భద్రత మరింత పటిష్టం
Telangana Tourism Police : తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో పర్యాటకుల భద్రతను పెంచడానికి ఉద్దేశించిన తెలంగాణ టూరిజం పోలీస్ వ్యవస్థ సోమవారం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 27న జరిగిన టూరిజం కాంక్లేవ్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రకటించగా రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో మొత్తం 80 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఆగస్టులోనే అప్పటి డీజీపీ జితేందర్ ఈ వ్యవస్థ ఏర్పాటుకు తొలి రూపకల్పన చేశారు.
ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే 20 పర్యాటక ప్రాంతాలను గుర్తించి, ఈ టూరిజం పోలీసులను నియమించారు. వీరి బాధ్యతలు హైదరాబాద్, రాచకొండ, ములుగు, వికారాబాద్, నల్గొండ, నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల మధ్య విభజించారు. హైదరాబాద్ ఒక్క నగరంలోనే 10 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు. వీరిలో సాలార్ జంగ్ మ్యూజియంలో ముగ్గురు, గోల్కొండ కోట వద్ద ముగ్గురు, చార్మినార్ వద్ద నలుగురు సిబ్బంది ఉంటారు. ఈ 20 ప్రాంతాలలో పర్యాటకులు వచ్చే సమయాలను బట్టి పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. ఉదాహరణకు, గోల్కొండ కోటలో ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు విధులు ఉంటాయి.
ఇది కూడా చదవండి : సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?

తెలంగాణ పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి , ఎక్కువ మంది టూరిస్టులను ఆకర్షించడానికి భద్రత చాలా ముఖ్యమని అన్నారు. “టూరిజం పోలీసులు పర్యాటకులకు భద్రత కల్పించడంలో, వారికి సులభంగా చేరువగా ఉండటంలో, పర్యాటకులకు మొదటి సంప్రదింపు కేంద్రంగా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తారు” అని ఆమె తెలిపారు.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
టూరిజం పోలీస్ వ్యవస్థ కోసం సిబ్బందిని సిద్ధం చేయడంలో భాగంగా, అక్టోబర్ 9వ తేదీ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (NITHM)లో వారికి వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ ఓరియంటేషన్, సెన్సిటైజేషన్ శిక్షణలో పోలీసులకు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, సంక్షోభ నిర్వహణ, సాంస్కృతిక అవగాహన వంటి అంశాలపై దృష్టి సారించారు. పర్యాటక-స్నేహపూర్వక పోలీసు వాతావరణాన్ని నిర్మించడం, పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడం, భద్రతా చర్యలు తీసుకోవడంపైనా శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో భాగంగా భువనగిరి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఫీల్డ్ సందర్శనలు కూడా నిర్వహించారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.