Indian Railways : రైలులో అనవసరంగా చైన్ లాగితే అంతే సంగతులు.. జైలు, జరిమానా తప్పదు
Indian Railways : మీరు రైలులో తరచుగా ప్రయాణిస్తుంటారా? రైలులోని ఎమర్జెన్సీ చైన్ (Alarm Chain) గురించి మీకు తెలుసా? ఏదైనా అత్యవసర పరిస్థితి (Emergency) ఏర్పడినప్పుడు మాత్రమే దీనిని ఉపయోగించాలి. సరైన కారణం లేకుండా రైలులో అలారం చైన్‌ను లాగితే, రైల్వే భద్రతా దళం (Railway Security) వెంటనే స్పందిస్తుంది. అంతేకాదు అనవసరంగా చైన్ లాగినందుకు మీకు కేవలం జరిమానా విధించడమే కాకుండా, జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. రైల్వే చైన్ ఎప్పుడు ఉపయోగించాలి, దాని వెనుక ఉన్న టెక్నాలజీ ఏమిటి, శిక్షల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అలారం చైన్ చరిత్ర, ఉద్దేశం
రైలులోని అలారం చైన్ సిస్టమ్‌ను సుమారు 150 సంవత్సరాల క్రితం బ్రిటీష్ ఇంజనీర్ జార్జ్ వెస్టింగ్‌హౌస్ అభివృద్ధి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు సురక్షితంగా రైలును ఆపడానికి ఇది ఉపయోగపడుతుంది. రైలు కదులుతున్నప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే, లోకో పైలట్‌కు (Loco Pilot) లేదా గార్డుకు తెలియజేయడం ప్రయాణికులకు సాధ్యం కాదు. అందుకే ఈ అలారం చైన్‌ను ఏర్పాటు చేశారు. కోచ్‌లో వైద్య అత్యవసర పరిస్థితి, మంటలు/పొగ, ట్రాక్‌పై ప్రమాదాలు లేదా అడ్డంకులు, తక్షణమే రైలును ఆపాల్సిన పరిస్థితుల్లో మాత్రమే దీనిని ఉపయోగించాలి.
- ఇది కూడా చదవండి : Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు

అలారం చైన్ టెక్నాలజీ, ప్రక్రియ
అలారం చైన్‌ను లాగినప్పుడు రైలు బ్రేకింగ్ సిస్టమ్ చాలా క్లిష్టమైన పద్ధతిలో పనిచేస్తుంది. ఈ చైన్ కోచ్‌లోని బ్రేక్ ఎయిర్ పైప్‌కు అనుసంధానించబడి ఉంటుంది. ఈ పైప్ రైలులోని గాలి ఒత్తిడిని (Air Pressure) నియంత్రిస్తుంది. చైన్‌ను లాగినప్పుడు, కోచ్‌లోని బ్రేక్ ఎయిర్ పైప్‌లో ఉన్న వాల్వ్ ఓపెన్ అవుతుంది. గాలి ఒత్తిడి విడుదలవుతుంది. పైలట్‌కు మీటర్లో ఒత్తిడి తగ్గినట్టు సిగ్నల్ అందుతుంది. పైలట్ మూడుసార్లు హారన్ మోగించి గార్డ్‌కు సంకేతం ఇస్తారు. రైలు ఆగిన తర్వాత, అధికారులు ఏ కోచ్‌లో చైన్ లాగారో తనిఖీ చేస్తారు. ఆధునిక రైళ్లలో, ఏ చైన్ లాగిందో చూపించడానికి ఎమర్జెన్సీ ఫ్లాషర్లు ఉంటాయి. పాత కోచ్‌లలో, గార్డు ప్రతి కోచ్‌ను తనిఖీ చేసి, ఎయిర్ వాల్వ్‌ను చూసి గుర్తిస్తారు.
ఇది కూడా చదవండి : Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
అనవసరంగా చైన్ లాగితే శిక్షలు
ఎలాంటి అత్యవసర పరిస్థితి లేకుండా సరదాకోసం లేదా అనవసరమైన కారణాల కోసం అలారం చైన్‌ను లాగడం రైల్వే చట్టం ప్రకారం నేరం. ఈ చర్య రైలు షెడ్యూల్‌ను అనవసరంగా ప్రభావితం చేస్తుంది. వెనుక వచ్చే రైళ్లకు కూడా ఆటంకం కలిగిస్తుంది. భారత రైల్వేల చట్టం, 1989లోని సెక్షన్ 141 ప్రకారం, అనవసరంగా అలారం చైన్ లాగిన వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా రూ. 1,000 వరకు జరిమానా లేదా కొన్ని సందర్భాలలో ఈ రెండూ విధించబడతాయి. అనవసరంగా ఎవరైనా చైన్ లాగారని అనుమానం వచ్చిన వెంటనే రైల్వే భద్రతా దళం (Railway Security) స్పందించి నిందితులను పట్టుకుంటుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
