Mysuru Dasara 2025 : మైసూర్ ప్యాలెస్‌లో మొదలైన దసరా సందడి.. జంబూ సవారికి గజరాజుల శిక్షణ!
Mysuru Dasara 2025 : కర్ణాటక సంస్కృతికి ప్రతీకగా, దేశంలోనే అత్యంత వైభవంగా జరిగే పండుగ మైసూర్ దసరా. ఈ పండుగను నాడ హబ్బా(రాష్ట్ర పండుగ) అని పిలుస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు కేవలం పండుగ మాత్రమే కాదు, ఒక గొప్ప చరిత్ర, సాంస్కృతిక వారసత్వం. మైసూర్ నగరం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించబడి, ఉత్సవాల వైభవాన్ని చాటి చెబుతుంది. ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా చారిత్రక మైసూర్ ప్యాలెస్‌లో సందడి మొదలైంది.
మైసూర్ దసరా 2025 ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమై, అక్టోబర్ 2న ముగుస్తాయి. ఈ పది రోజుల పండుగలో భాగంగా సెప్టెంబర్ 23, 2025న ఉత్సవాలు మొదలవుతాయి. ఈసారి దసరా ఉత్సవాలను రచయిత, సామాజిక కార్యకర్త భాను ముష్తాక్ ప్రారంభిస్తారని అధికారికంగా ప్రకటించారు. ఈ ఉత్సవాల ముఖ్య ఘట్టం విజయదశమి రోజున జరిగే ప్రసిద్ధ జంబూ సవారి (ఏనుగుల ఊరేగింపు), టార్చ్‌లైట్ పరేడ్.

దసరా వేడుకల కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్యాలెస్ ప్రాంగణంలో సాంప్రదాయ రత్నఖచిత సింహాసనం (గోల్డెన్ థ్రోన్)ను ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. ఇది ప్రైవేట్ దర్బార్ కోసం ఉపయోగించబడుతుంది. అలాగే, ఉత్సవాలకు ముందుగానే ఫిరంగుల శిక్షణ కూడా సెప్టెంబర్ 15, 2025న జరిగింది.
మైసూర్ దసరాలో అత్యంత ముఖ్యమైన ఘట్టం జంబూ సవారి. ఇందులో పాల్గొనే ఏనుగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ ఊరేగింపులో ప్రధాన ఆకర్షణ అభిమన్యు అనే ఏనుగు. ఇది సుమారు 750 కిలోల బరువు గల అంబారీని మోస్తుంది. దీని కోసం శిక్షణ సమయంలో అభిమన్యు వెనుక ఒక చెక్క అంబారీ, దానిపై 400 కిలోల ఇసుక బస్తా, 100 కిలోల నమ్దాను కట్టి శిక్షణ ఇస్తున్నారు.

అభిమన్యుతో పాటు, ఇతర ఏనుగులు కూడా శిక్షణలో పాల్గొంటున్నాయి. హేమావతి, కావేరి, భీమ్, గోపి, ప్రశాంత్, కంజన్, మహేంద్ర, లక్ష్మి, ఏకలవ్య, శ్రీకాంత్, రూప వంటి మొత్తం 14 ఏనుగులు ఈ శిక్షణలో పాలుపంచుకున్నాయి. ఈ ఏనుగులు ప్యాలెస్ ఫోర్ట్ ఆంజనేయస్వామి గేట్, చామరాజేంద్ర సర్కిల్, కేఆర్ సర్కిల్, సయాజీరావు రోడ్, తిలక్ నగర్, బంబు బజార్, బన్నీ మండపంలోని పంజీనా పరేడ్ గ్రౌండ్స్ మీదుగా జంబూ సవారిని రిహార్సల్ చేశాయి.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
మైసూర్ దసరా ఉత్సవాలకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తొలుత ఈ వేడుకలను విజయనగర రాజులు ప్రారంభించారు. ఆ తర్వాత ఒడయార్ రాజవంశం ఈ సంప్రదాయాన్ని కొనసాగించింది. ప్రతి సంవత్సరం ఉత్సవాల ప్రారంభానికి ముందు, మైసూర్ ప్యాలెస్‌లో రాణి, రాజు కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు కేవలం మతపరమైనవి మాత్రమే కాకుండా, కళలు, సంస్కృతి, చరిత్రల కలయికగా కూడా ప్రసిద్ధి చెందాయి.
ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
అక్టోబర్ 2న జరిగే జంబూ సవారి, దసరా ఉత్సవాలకు ముగింపు పలుకుతుంది. ఈ ఊరేగింపులో అంబారీపై చాముండేశ్వరి దేవి విగ్రహాన్ని ఉంచి, దానిని అభిమన్యు అనే ఏనుగుపై ఉంచి ఊరేగిస్తారు. రాత్రి సమయంలో, బన్నీ మండపంలో జరిగే టార్చ్‌లైట్ పరేడ్‌తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. మైసూర్ దసరా ఉత్సవాలు దేశవిదేశాల నుండి వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.