Bathukamma : బతుకమ్మ అంటే కేవలం పాటలు, ఆటలు కాదు.. ఈ సారి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాలట
Bathukamma : బతుకమ్మ పండుగ అంటేనే పూల పండుగ, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ. ఈసారి ఈ పండుగకు మరింత ప్రాధాన్యత వచ్చింది. ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో బతుకమ్మ సంబరాలు, గిన్నిస్ బుక్ రికార్డు కోసం 63 అడుగుల బతుకమ్మ ఏర్పాటు చేయనున్నారు. ఈ పండుగ విశేషాలు, దాని ప్రత్యేకతలు పూర్తిగా తెలుసుకుందాం.
బతుకమ్మ గిన్నిస్ బుక్ రికార్డ్
బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం ఈసారి మరింత ఘనంగా నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో దాదాపు 10,000 మందితో బతుకమ్మ సంబరాలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా 63 అడుగుల ఎత్తైన బతుకమ్మను ఏర్పాటు చేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పండుగ సంబరాలు ఎక్కడెక్కడ?
ఈ నెల 21 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. ఈ పండుగ వరంగల్‌లోని వేయి స్తంభాల గుడిలో ఈ నెల 21న మొదలవుతుంది. తంగేడు పువ్వులతో మొదలయ్యే బతుకమ్మ సంబరాల్లో అందరూ పాల్గొనాలని మంత్రి జూపల్లి ప్రజలకు పిలుపునిచ్చారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రభుత్వ అధికారులతో కలిసి ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.
ఇది కూడా చదవండి : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
బతుకమ్మ పాటలు, సంస్కృతి
బతుకమ్మ అంటేనే పూలతో చేసే పండుగ. ప్రకృతిలో సహజంగా లభించే పూలను సేకరించి, వాటిని రంగులద్దిన పూల బతుకమ్మగా పేర్చి అద్భుతంగా అలంకరిస్తారు. ఈ పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలవుతుంది. ఈ పండుగ తెలంగాణలోని ప్రతి ఊరు, వాడలో కళను నింపుతుంది. సాయంత్రం వేళల్లో అమ్మాయిలు గుండ్రంగా నిలబడి, నెమ్మదిగా కదులుతూ, పాటలు పాడుతూ, నృత్యం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, తంగేడు పువ్వా తల్లో, గోరింటాకు గోరుముద్దలో వంటి బతుకమ్మ పాటలు తెలంగాణ జానపద సంస్కృతిలో భాగమయ్యాయి. ఈ పాటలలో మహిళల మనసులు, ప్రకృతి, పంటల పట్ల ప్రేమ ప్రతిధ్వనిస్తాయి.
ఇది కూడా చదవండి : Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా…
తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా, బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. వారి జానపద కళలు, పాటలు తెలంగాణ యాసతో ఆయా దేశాలలో ప్రతిధ్వనిస్తాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ సంబరాలు మరింత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, కంభంపాడు, కారంపూడి గ్రామాల్లో బతుకమ్మ పండుగను మహిళలు జరుపుకుంటారు. అయితే, ఈ పండుగను కొంతమంది రాజకీయాలు చేస్తున్నారనే అభిప్రాయం ఉంది.
నేల, నీటి బంధం
బతుకమ్మ పండుగ ప్రకృతితో మనకున్న సంబంధాన్ని చూపిస్తుంది. ఈ పండుగలో వాడే ముఖ్యమైన పూలలో తంగేడు పువ్వు శక్తికి, గుమ్మడి పువ్వు అందానికి చిహ్నాలు. ఈ పండుగలో గౌరమ్మను పసుపు పూలతో అలంకరించి, తొమ్మిది రోజుల పాటు ఆటలు, పాటలు ఆడి, చివరికి ఆ బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది నేల మరియు నీటితో మనిషికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఈ పండుగ పూలు వికసించే సమయంలో, నీటి వనరులు నిండి ఉన్నప్పుడు వస్తుంది. ఈ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెరుగుతుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.