Indrakeeladri : నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు.. తొలి రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం
Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం దసరా మహోత్సవాలకు ముస్తాబైంది. ఈ ఏడాది పండుగను 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల తొలి రోజైన సోమవారం (నేడు) అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.
నేటి నుంచి శరన్నవరాత్రులు!
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆలయం విద్యుత్ దీపాలు, రంగు రంగుల కాంతులతో ధగధగలాడుతూ భక్తులను ఆహ్వానిస్తోంది. ఉత్సవాల తొలి రోజైన సోమవారం (నేడు) అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.

ఉత్సవాల ఏర్పాట్లు
ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రధాన ఆలయం నుంచి మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొస్తారు. అక్కడ ఉత్సవమూర్తిని ప్రతిష్టించి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ప్రత్యేక కుంకుమార్చనలు, చండీయాగం, శ్రీచక్ర నవార్చనలు కూడా ప్రారంభమవుతాయి.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో సాయంత్రం సమయంలో అమ్మవారికి పంచహారతులు జరుగుతుండగానే భక్తులను క్యూలైన్లలో దర్శనానికి అనుమతిస్తారు. రూ.300, రూ.100 టికెట్ల క్యూలైన్‌తో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు యధావిధిగా నడుస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏర్పాట్లను పోలీసులు, రెవెన్యూ అధికారులు మరోసారి పరిశీలించారు.
11 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం
ఈ ఏడాది దసరా ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. తిథుల హెచ్చుతగ్గుల కారణంగా అమ్మవారు 11 రోజుల పాటు 11 విభిన్న అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ జాబితాలో శ్రీ కాత్యాయని దేవి అలంకారం అదనంగా చేరింది.
శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి
శ్రీ గాయత్రిదేవి
శ్రీ అన్నపూర్ణాదేవి
శ్రీ కాత్యాయనిదేవి (అదనం)
శ్రీ మహాలక్ష్మీదేవి
శ్రీ లలితా త్రిపురసుందరీదేవి
శ్రీ మహాచండీదేవి
శ్రీ సరస్వతిదేవి
శ్రీ దుర్గాదేవి
శ్రీ మహిషాసుర మర్దినీదేవి
శ్రీ రాజరాజేశ్వరి
ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
నేడు బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు
బాలా త్రిపుర సుందరీ దేవి హిందూ పురాణాలలో పార్వతి దేవి బాల్య రూపంగా పూజిస్తారు. ఆమె అన్ని దేవతలలో చిన్నది. అయినప్పటికీ, ఆమె అన్ని మంత్రాలకు, జ్ఞానానికి అధిష్టాన దేవత. అందుకే మొదట బాలా త్రిపుర సుందరీ దేవిని పూజిస్తారు. బాలా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం పొందిన తర్వాతే ఇతర దేవతల అనుగ్రహం పొందగలరు. దసరా ఉత్సవాలలో భక్తులకు సంపూర్ణ ఫలితాలను ఇచ్చే అమ్మవారి రూపం బాలా త్రిపుర సుందరీ దేవి. దసరా నవరాత్రులలో మొదటి రోజున బాలా త్రిపుర సుందరీ దేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు.
భక్తుల కోసం ప్రత్యేక సేవలు
దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌలభ్యం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొండ దిగువన కొత్తగా నిర్మించిన అన్నదాన భవనాన్ని ప్రారంభించారు. ఈ భవనంలో ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం నిరంతరంగా అందిస్తారు. ఒకేసారి వెయ్యి మంది భక్తులు ప్రసాదం స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, క్యూలైన్లలోని భక్తుల కోసం పిల్లలకు పాలు, పెద్దలకు బిస్కెట్లు, మంచినీటి బాటిల్స్‌ను అందజేస్తారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.