Diwali 2025 : జీవితంలో ఒక్కసారైనా ఆ ప్రదేశాల్లో జరుపుకునే దీపావళి వేడుకలను చూడాల్సిందే
Diwali 2025 : మన దేశంలో దీపావళి పండుగ అంటే ఒక ప్రత్యేకమైన సందడి ఉంటుంది. అంతటా దీపాలు వెలిగించడం, లక్ష్మీదేవి, గణపతికి పూజలు చేయడం, బాణసంచా కాల్చడం కనిపిస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ, అమావాస్య చీకటిని తొలగించి వెలుగును తీసుకొచ్చే ఈ దీపాల పండుగను దేశంలో ప్రతిచోటా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. అయితే, కొన్ని ప్రదేశాలలో దీపావళి వేడుకలు మరింత ప్రత్యేకంగా, అద్భుతంగా జరుగుతాయి. ఆ ప్రదేశాలలో జరిగే దీపావళి వేడుకలను జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే. అలాంటి కొన్ని ప్రాంతాలను ఇప్పుడు చూద్దాం.
గోవా: నరకాసురుడి దహనం
గోవా అంటే మనకు బీచ్‌లు, పార్టీలే గుర్తొస్తాయి. కానీ దీపావళి సమయంలో గోవాలోని సాంప్రదాయాన్ని, సంస్కృతిని అనుభవించడం ఒక మంచి అనుభూతి. గోవాలో దీపావళిని ముఖ్యంగా నరక చతుర్దశిగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడిని వధించిన విజయానికి ప్రతీకగా ఇక్కడ నరకాసురుడి భారీ దిష్టిబొమ్మలను తయారు చేసి దహనం చేస్తారు. ఈ వేడుక చెడుపై మంచి విజయాన్ని, సమాజ ఐక్యతను సూచిస్తుంది.

జైపూర్: వెలుగు జిలుగుల పింక్ సిటీ
రాజస్థాన్‌లోని జైపూర్‌ను దీపావళి సమయంలో సందర్శించడం ఒక అందమైన అనుభవం. పండుగ సందర్భంగా ఇక్కడి వీధులు, ఇళ్లు, దుకాణాలు అన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించబడతాయి. దీపాలతో మెరిసిపోయే ఈ పింక్ సిటీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. దీపావళి సమయంలో ఇక్కడ లభించే స్వీట్లు చాలా ప్రసిద్ధి. అనేక సాంప్రదాయ, ప్రత్యేకమైన ఆచారాలను చూడాలంటే జైపూర్‌ను తప్పక సందర్శించాలి.
ఇది కూడా చదవండి : Sabarimala Facts : 1902 లో కర్పూరం వల్ల అగ్నికి ఆహూతి అయిన శబరిమల ఆలయం… శమరిమలై ఆలయం గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
అయోధ్య: దీపాల రికార్డు
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో దీపావళి వేడుకలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ సమయంలో నగరమంతా దీపాల అద్భుత దృశ్యాన్ని చూడవచ్చు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, లక్ష్మీదేవికి స్వాగతం పలికేందుకు, నగరమంతా రికార్డు స్థాయిలో దీపాలతో, లక్షలాది మట్టి ప్రమిదలతో వెలిగిపోతుంది. దీపావళి రోజున దేవుళ్ల విగ్రహాలను అలంకరించి నగరంలో ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. అయోధ్యలోని సరయూ నది ఒడ్డున దీపాల ప్రదర్శన కనువిందు చేస్తుంది.
ఉదయ్‌పూర్: సరస్సుల్లో దీపాల ప్రతిబింబం
సరస్సుల నగరంగా పేరు పొందిన ఉదయ్‌పూర్‌లో దీపావళి వేడుకలు ఒక అద్భుతం. ప్రాచీన రాజభవనాల గొప్పదనంతో కూడిన ఈ నగరంలో దీపావళి సందర్భంగా జరిగే లాంతర్ల పండుగను చూడటానికి రెండు కళ్లు చాలవు. సరస్సులలో దీపాల ఆకర్షణీయమైన ప్రతిబింబం, మెరిసే లాంతర్లు, ప్రకాశవంతమైన రాజభవనాలు మరియు రాజరిక హవేలీలు దీపాల వెలుగులో మెరిసిపోవడం మంచి మధుర జ్ఞాపకంగా మిగులుతుంది. దీపావళి రోజున బంగారు రంగులో మెరిసిపోయే రాజస్థానీ తరహా రాజభవనం పైన బాణసంచా ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
వారణాసి: నిద్రలేని దీపావళి
వారణాసిలో దీపావళి రాత్రి దీపాల దృశ్యం చాలా అందంగా ఉంటుంది. ఈ రోజున, వారణాసి ప్రజలు రేయింబవళ్లు తేడా లేకుండా దీపావళిని జరుపుకుంటారు. రంగురంగుల బాణసంచా కాల్చడం ఈ వేడుకకు మరింత అందాన్ని ఇస్తుంది. పండుగ రోజున, వారణాసి నది ఒడ్డున ప్రత్యేక దృశ్యాలను చూడవచ్చు. దీపావళి వేడుకల కోసం వారణాసి తప్పకుండా సందర్శించదగిన గొప్ప ప్రదేశం.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.