AP Tourism : ఏపీలో టూరిజంలో సరికొత్త విప్లవం.. హోటల్ బుకింగులకు స్వస్తి.. ఇంటి వద్దకే క్యారవాన్
AP Tourism : ఏపీ పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పు రాబోతోంది. పర్యాటకుల ఇంటి వద్దకే చేరుకునే క్యారవాన్ టూరిస్ట్ వాహనాలు త్వరలోనే రాష్ట్రంలో కనిపించనున్నాయి. ఈ వినూత్న ప్రాజెక్ట్ ద్వారా, పర్యాటకులు తమ ఇంటి నుంచి నేరుగా పర్యాటక ప్రాంతాలకు సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతారు. ఈ నూతన ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక క్యారవాన్ పాలసీని సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు వసతి, ప్రయాణం కోసం విడిగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ క్యారవాన్ వాహనాల ద్వారా ప్రయాణం, వసతి, ఆహారం అన్నీ ఒకే చోట లభిస్తాయి. ఇవి ఆధునిక సౌకర్యాలతో కూడిన మొబైల్ హోటళ్ల లాంటివి.
ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం 2029 నాటికి మొత్తం 150 క్యారవాన్ వాహనాలను, 25 క్యారవాన్ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభంలో ఈ వాహనాలను ప్రైవేట్ ఆపరేటర్లు నడుపుతారు. ఇందుకోసం వారికి పన్ను మినహాయింపులు, ఎస్జీఎస్టీ రీఫండ్ వంటి అనేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోంది. క్యారవాన్ పాలసీ ప్రకారం, మొదటి 25 వాహనాలకు లైఫ్ ట్యాక్స్‌లో 100% మినహాయింపు (రూ. 3 లక్షల వరకు) లభిస్తుంది. తర్వాత 13 వాహనాలకు 50% మినహాయింపు, మరో 12 వాహనాలకు 25% మినహాయింపు ఇస్తున్నారు. అదనంగా, ఏడు సంవత్సరాల పాటు ఎస్జీఎస్టీ రీఫండ్ సదుపాయం కల్పించనున్నారు. ఈ ప్రోత్సాహకాలతో క్యారవాన్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ ఆపరేటర్లు ఆసక్తి చూపుతారని అధికారులు భావిస్తున్నారు.

క్యారవాన్ పార్కుల అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ క్యారవాన్ పార్కుల ఏర్పాటు కోసం భూమిని కేటాయించనుంది. ఈ పార్కులలో క్యారవాన్ వాహనాల కోసం పార్కింగ్ సౌకర్యాలు, పర్యాటకులకు వసతి, ఆహారం, ఇతర సౌకర్యాలు ఉంటాయి. మొదటి దశలో గండికోట, అరకు, సూర్యలంక బీచ్, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాలలో ఈ పార్కులను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ పార్కులు పర్యాటకులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
క్యారవాన్ వాహనాలలో ప్రత్యేక సౌకర్యాలు
ఈ క్యారవాన్ వాహనాలు ఒక చిన్న బస్సు పరిమాణంలో ఉంటాయి. ఇవి ఇద్దరు నుంచి ఆరుగురు వ్యక్తులకు సరిపోయేలా రూపొందించబడ్డాయి. లోపల మొబైల్ హోటల్ తరహాలో అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. బెడ్స్, డైనింగ్ ఏరియా, గ్యాస్ స్టవ్, ఇండక్షన్ కుక్కర్, రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్ ఓవెన్, తాగే నీటి ట్యాంక్, సింక్, బాత్రూమ్, టాయిలెట్, షవర్, వాష్‌బేసిన్, ఎయిర్ కండీషనర్, హీటర్, Wi-Fi, టవీ, GPS ట్రాకింగ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటి సేఫ్టీ ఏర్పాట్లు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూపిస్తారు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips
ప్రారంభ మార్గాలు, పర్యాటక అభివృద్ధి
క్యారవాన్లు నడిచేందుకు మొదట్లో గుర్తించిన మార్గాలు ఇవి.. విశాఖపట్నం – అరకు, విశాఖపట్నం – లంబసింగి, విజయవాడ – గండికోట, విజయవాడ – సూర్యలంక బీచ్, విజయవాడ – నాగార్జునసాగర్, విజయవాడ – శ్రీశైలం, విజయవాడ – తిరుపతి. ఈ మార్గాలలో క్యారవాన్ టూర్లు ప్రారంభమైతే, రాష్ట్ర పర్యాటక రంగంలో కొత్త శకం మొదలవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో స్వదేశ్ దర్శన్ 2.0, సాస్కి ప్రాజెక్ట్‌లు, డెస్టినేషన్ డెవలప్మెంట్ ప్లాన్లు అమలవుతున్నాయి. గండికోట, గోదావరి ప్రాంతాల అభివృద్ధికి రూ. 172.35 కోట్లు, అరకు, లంబసింగి, సూర్యలంక బీచ్‌ల అభివృద్ధికి రూ. 127.39 కోట్లు, అహోబిలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు రూ. 49.49 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుల పర్యాటక విలువను పెంచడంలో క్యారవాన్ వాహనాలు కీలకపాత్ర పోషించనున్నాయి. కేరళ, గోవా, కర్ణాటక రాష్ట్రాల మాదిరిగానే, ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో క్యారవాన్ టూరిజం మ్యాప్‌లో స్థానం సంపాదించనుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.