Banana Festival : కోరిక తీరాలంటే ఆ దేవుడికి అరటి గెల సమర్పించాల్సిందే.. 150ఏళ్లుగా విచిత్రమైన ఆచారం
Banana Festival : సాధారణంగా కోరికలు తీరడానికి దేవుడికి నైవేద్యాలు సమర్పించడం, లేదా మేక, గొర్రె, కోడి వంటి వాటిని బలిగా సమర్పించడం ఆచారం. కానీ శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం కేదల్ తాండ్ర గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఒక విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ భక్తులు తమ కోరికలు తీరడానికి అరటిపండ్ల గెలలను మొక్కుగా సమర్పిస్తారు. ఉద్యోగం రావాలన్నా, పెళ్లి కావాలన్నా, సంతానం కలగాలన్నా, ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా అరటిపండు గెల సమర్పిస్తే కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ భీష్మ ఏకాదశి రోజున ప్రారంభమై మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ ప్రత్యేకమైన ఆచారం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అరటిపండు పండుగగా ప్రసిద్ధి
గత 80 సంవత్సరాలుగా కేదల్ తాండ్ర గ్రామంలో ఈ ప్రత్యేకమైన ఆచారం కొనసాగుతోంది. భీష్మ ఏకాదశి రోజున స్థానికులు వేల సంఖ్యలో అరటిపండ్ల గెలలను ఆలయంలో కట్టి తమ భక్తిని చాటుకుంటారు. అందుకే ఈ జాతరను ‘అరటిపండు పండుగ’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా గుడికి వెళ్లినప్పుడు ఒక అరటిపండు లేదా అరడజను పండ్లను దేవుడికి సమర్పిస్తారు. కానీ ఇక్కడ భక్తులు అరటిపండ్ల గెలలను సమర్పించడం విశేషం. ఈ సంవత్సరం భీష్మ ఏకాదశి సందర్భంగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఆలయ పండుగ కమిటీ సభ్యులు వివిధ రకాల ప్రత్యేక పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ పండుగలకు తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తారు.

ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
అరటిపండ్ల గెలలతో మొక్కులు
భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత, తమ కోరికలు తీరాలని ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు అరటిపండ్ల గెలలను కడతారు. నిర్వాహకులు ఈ అరటిపండ్ల గెలలను కట్టడానికి రావిచెట్టు వద్ద ప్రత్యేక పందిళ్లను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మొక్కుల్లో భాగంగా పది వేలకు పైగా అరటిపండ్ల గెలలు వచ్చాయి. రెండు లేదా మూడు రోజుల తర్వాత, అదే భక్తులు తిరిగి వచ్చి తాము కట్టిన అరటిపండ్ల గెలలను ఇంటికి తీసుకెళ్ళి స్వామివారి ప్రసాదంగా పంచుకుంటారు. అయితే, కొంతమంది అరటిపండ్లను ఆలయంలోనే వదిలివేస్తారు.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
పండుగ వెనుక ఆసక్తికరమైన కథ
ఈ అరటిపండ్ల జాతర వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. సుమారు 150 సంవత్సరాల క్రితం, పరావస్తు అయ్యవారు అనే స్వామీజీ కేదల్ తాండ్ర గ్రామానికి వచ్చారు. ఆయన అందరితో సఖ్యతగా ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేవారు. ఆయన ఇక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించి లక్ష్మీ నరసింహ స్వామిని పూజించేవారు. కొంతకాలం తర్వాత పరావస్తు అయ్యవారు అక్కడే జీవ సమాధి అయ్యారు. ఆయనను సమాధి చేసిన ప్రాంతంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రావిచెట్టు మొలిచి, క్రమంగా పెద్ద వృక్షంగా ఎదిగింది. స్వామీజీ సమాధి అయ్యే ముందు కేవలం పండ్లను మాత్రమే తినేవారు. అందుకే ఆయన దగ్గరకు వచ్చే భక్తులు ఆయన కోసం అరటిపండ్లను తీసుకొచ్చేవారు. ఈ సంప్రదాయం క్రమంగా అరటిపండు జాతరగా మారింది. మూడు రోజులపాటు ఆలయం ప్రాంగణంలో వేలాడే వేలాది అరటిపండ్ల గెలలు భక్తులకు స్వాగతం పలుకుతాయి. అరటిపండ్ల సువాసన గ్రామంలో అంతటా వ్యాపిస్తుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.