Kakatiya Secret Stepwell : కాకతీయుల సీక్రెట్ మెట్ల బావి.. ఎక్కడ ఉంది ఎలా వెళ్లాలో తెలుసా ?
Kakatiya Secret Stepwell : వరంగల్ శివనగర్‌లో ఉన్న మూడు అంతస్తుల రహస్య మెట్ల బావి కాకతీయ వాస్తుశిల్ప కళకు, చరిత్రకు ఒక గొప్ప ప్రతీక. వేయి స్తంభాల గుడి లాగే, ఇది కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కాకతీయ సామ్రాజ్యం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వారి అద్భుతమైన నిర్మాణ శైలి. ఎన్నో దేవాలయాలు, ప్రత్యేక భవనాలు ఈ కళా వైభవానికి చిహ్నంగా వెలుగొందుతున్నాయి. కాకతీయ రాజులు వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఎన్నో చెరువులు, బావులు తవ్వించి రాజ్యాన్ని సుసంపన్నం చేశారు. ఆ చెరువులు, బావులు ఇప్పటికీ ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి.
వరంగల్ శివనగర్‌లోని రహస్య బావి
కాకతీయ రాజులు నిర్మించిన మెట్ల బావులు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వరంగల్ నగరంలోని శివనగర్ ప్రాంతంలో ఉన్నది. ఈ బావిని చాలా పేర్లతో పిలుస్తారు. దీనిని మెట్ల బావి, అడుగుల బావి, రొమాంటిక్ బావి, రహస్య బావి అని అంటారు.

బావి చరిత్ర, నిర్మాణం
కాకతీయులు ఈ బావిని 11వ శతాబ్దంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ బావిని మొత్తం మూడు అంతస్తులలో నిర్మించారు. మొదటి అంతస్తు స్నానాల కోసం, రెండో అంతస్తు దుస్తులు మార్చుకునే గదిగా, మూడో అంతస్తు దేవతా విగ్రహాలను పూజించడానికి ఉపయోగపడేలా కాకతీయులు ఈ బావిని నిర్మించారు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
రాణి రుద్రమదేవి శత్రువుల ఆట కట్టించిన వ్యూహం
రాణి రుద్రమదేవి ఒక సొరంగం ద్వారా ఈ బావి వద్దకు వచ్చి స్నానం చేసేవారని చరిత్ర చెబుతోంది. ఈ రహస్య బావి నుండి వేయి స్తంభాల గుడికి నేరుగా సొరంగ మార్గం ఉండేది. ఈ మూడు అంతస్తుల బావిలోకి శత్రువులు ప్రవేశిస్తే, కింది అంతస్తులోని యోధులు, నీటిలోని వారి ముఖాల ప్రతిబింబాన్ని చూసి పై అంతస్తులోని శత్రువులను హతమార్చేవారని చెబుతారు. ఈ మెట్ల బావి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ గోడలపై ఉన్న శిల్పాలు, నాట్య భంగిమలు ఆకట్టుకుంటాయి.
బావి ఆధునికీకరణ, పర్యాటకుల ఆకర్షణ
ఈ బావి ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ బహుళ అంతస్తుల బావిని ప్రభుత్వం ఆధునీకరించింది. బావి చుట్టూ గ్రిల్స్ అమర్చారు. చుట్టూ గోడలు నిర్మించి అందంగా రంగులు వేసి అలంకరించారు. లోపల గోడలకు మరమ్మతులు చేశారు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
రాత్రిపూట అందంగా కనిపించేలా లైట్లు కూడా అమర్చారు. ఇప్పుడు ఈ బావి కొత్త అందాలతో పర్యాటకులకు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల నుండి కూడా అనేక మంది పర్యాటకులు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బహుళ అంతస్తుల బావిని చూసేందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ బావి కొత్త అందాలతో తీర్చిదిద్దబడటంతో, వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు ఆసక్తితో ఇక్కడికి వస్తున్నారు.
గొప్ప అనుభూతిని పంచుతున్న చరిత్ర సాక్షి
ఈ వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బావిని చూడటం ఒక గొప్ప అనుభవమని పర్యాటకులు చెబుతున్నారు. కాకతీయుల చరిత్రకు, నాగరికతకు, ఇది ఒక గొప్ప నిదర్శనమని వారు పేర్కొన్నారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.