Dasara : దసరాకి దేశం మొత్తం పండగే.. కానీ ఇక్కడ మాత్రం ఒక రేంజ్లో జరుగుతాయి
Dasara : దసరా పండుగ అంటే దేశం మొత్తం ఒకే రకమైన పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం, ఒక్కో పద్ధతిని పాటిస్తారు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు.
మైసూరు దసరా
కర్ణాటకలోని మైసూరులో జరిగే దసరా వేడుకలు దేశంలోనే ప్రసిద్ధి. ఇక్కడ ఈ పండుగ మహారాజుల కాలం నుంచి చాలా వైభవంగా జరుగుతోంది. మైసూరు మహారాజులు చాముండేశ్వరి దేవిని పూజించి, ఏనుగులపై ఊరేగింపులో పాల్గొంటారు. ఈ వేడుక కనుల పండుగగా ఉంటుంది. నవరాత్రులలో తొమ్మిదవ రోజున రాజ ఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ ఊరేగింపు మైసూరు ప్యాలెస్ నుండి బన్నీ మండపం వరకు జరుగుతుంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్యాలెస్‌ను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఫ్లోటింగ్ కార్ ఫెస్టివల్స్ కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యత పొందుతాయి. రోడ్లపై డ్యాన్స్, సంగీతం, కళా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ వేడుకలను చూడటానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు వస్తారు.

కోల్‌కతా దుర్గా పూజ
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దుర్గామాత పూజలు చాలా ప్రసిద్ధి. బెంగాలీ ప్రజలు కాళీ మాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సప్తమి, అష్టమి, నవమి రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. తొమ్మిదవ రోజున లక్షల మంది దుర్గా మాతను దర్శించుకుంటారు. తొమ్మిది రోజుల పాటు హరికథలు, పురాణ శ్రవణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున, నది ఒడ్డున కుమారి పూజ నిర్వహించి, దుర్గామాత విగ్రహాలను నదిలో నిమజ్జనం చేస్తారు. నవరాత్రుల సమయంలో కోల్‌కతా వీధులు ఒక సాంస్కృతిక కేంద్రంగా మారతాయి. ఆధునిక ట్రెండ్‌కు అనుగుణంగా థీమ్ లైటింగ్స్‌తో మండపాలు డిజైన్ చేస్తారు. ఈ మండపాలు సినిమా సెట్టింగ్‌లను పోలి ఉంటాయి. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ మండపాలను చూడటానికి వస్తారు. అత్యుత్తమ మండపాలకు బహుమతులు ఇచ్చే సంప్రదాయం కూడా ఇక్కడ ఉంది.
ఇది కూడా చదవండి : Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూపిస్తారు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips
ఒడిశాలో దసరా
ఒడిశాలో కూడా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రజలు దుర్గా మాతను పూజిస్తారు. కటక్‌కు చెందిన కళాకారులు తయారు చేసిన విగ్రహాలను వీధుల్లో ఏర్పాటు చేస్తారు. మహిళలు మట్టితో మణిక్ తయారు చేసి లక్ష్మీదేవిని పూజిస్తారు. విజయదశమి రోజున పూజిస్తే విజయం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. చివరి రోజున, 15 అడుగుల రావణుడి విగ్రహాన్ని కాల్చివేస్తారు. బాణాసంచాతో ఈ కార్యక్రమం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
గుజరాత్లో దసరా
గుజరాత్లో దసరా సమయంలో పార్వతీ దేవిని పూజిస్తారు. ప్రతి ఇంట్లో శక్తి పూజ చేయడం గుజరాతీల సంప్రదాయం. ఇక్కడ శ్రీ చక్రం, త్రిశూలం, శక్తి ఆయుధాలను పసుపుతో వేస్తారు. పొలంలో ఉన్న మట్టితో ఒక వేదికను తయారు చేసి, దానిపై మట్టి కుండలో నీరు నింపి దేవతగా భావిస్తారు. దీనిని కుంభి ప్రతిష్ట అంటారు. అష్టమి రోజున యజ్ఞం చేసి, దశమి రోజున నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత పౌర్ణమి వరకు గర్బా ఉత్సవం, డోలు భజనలు మరియు రంగుల దుస్తులతో గర్బా నృత్యాలు నిర్వహిస్తారు. గుజరాతీ ఆర్తి నృత్యం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.