Travel Tips : టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ మోసాల గురించి జాగ్రత్తగా ఉండండి
Travel Tips : ప్రయాణం అనేది ఎప్పుడూ ఒక సరదా, కొత్త అనుభవం. కానీ ప్రయాణంలో కొన్ని అపాయాలు కూడా పొంచి ఉంటాయి. నకిలీ గైడ్లు, టాక్సీ మోసాలు, కరెన్సీ మార్పిడిలో మోసాలు వంటివి ప్రయాణికులకు తరచుగా ఎదురయ్యే సమస్యలు. మీరు ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇలాంటి మోసాలకు బలి కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. పర్యాటకులను మోసం చేసే కొన్ని సాధారణ మోసాలు, వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నకిలీ టూర్ గైడ్లు
పర్యాటకులను నకిలీ టూర్ గైడ్లు తరచుగా మోసం చేస్తుంటారు. వీరు అధికారిక గైడ్ల మాదిరిగా నటిస్తూ, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. మొదట తక్కువ ధర చెబతారు, కానీ చివరికి ఎక్కువ వసూలు చేస్తారు. కొన్నిసార్లు మీకు అనవసరమైన షాపింగ్ సెంటర్లకు లేదా ఇతర చోట్లకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి, ప్రయాణానికి ముందే ఒక మంచి గైడ్‌ను బుక్ చేసుకోండి. తెలియని, అనధికారిక వ్యక్తులను నమ్మవద్దు.

టాక్సీ మీటర్ మోసం
పర్యాటకులకు ఎదురయ్యే మోసాలలో ఇది చాలా సాధారణం. ముఖ్యంగా ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, పర్యాటక ప్రాంతాల్లో ఈ మోసం ఎక్కువగా జరుగుతుంది. టాక్సీ డ్రైవర్లు మీటర్‌ను ఆపేసి, అది పాడైపోయిందని చెబుతారు. ఆ తర్వాత వాస్తవ ఛార్జీ కన్నా రెండు, మూడు రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు. ఒకవేళ మీకు ఆ నగరం గురించి తెలియకపోతే, దగ్గరి దారి ఉన్నా కూడా కావాలనే పెద్ద రూట్లో తీసుకెళ్తారు. గూగుల్ మ్యాప్స్ వంటి యాప్‌లను ఉపయోగించని వారికి ఇది పెద్ద నష్టం. కాబట్టి, మోసపోకుండా ఉండటానికి, మీటర్ తప్పనిసరిగా ఉన్న టాక్సీలను ఎంచుకోండి. అలాగే, ఓలా, ఉబర్ వంటి యాప్‌లను ఉపయోగించండి లేదా ప్రీపెయిడ్ టాక్సీలను ఎంచుకోండి. మీ ప్రయాణ మార్గాన్ని ఎల్లప్పుడూ గూగుల్ మ్యాప్స్‌లో ట్రాక్ చేయండి. టాక్సీలను అధికారిక స్టాండ్ల నుంచే తీసుకోండి.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
నకిలీ బుకింగ్ వెబ్సైట్లు
ఈ డిజిటల్ యుగంలో ట్రావెల్ బుకింగ్స్ ఎక్కువగా ఆన్లైన్లో జరుగుతాయి. ఇదే అదునుగా నకిలీ వెబ్సైట్లు పర్యాటకులను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నాయి. అవి మొదట తక్కువ ధరను చూపిస్తాయి. కానీ బుకింగ్ చివరిలో అధిక సర్వీస్ ఫీజులు, పన్నులు మరియు ఇతర దాచిన ఛార్జీలను జోడిస్తాయి. డబ్బు చెల్లించిన తర్వాత, తిరిగి ఇవ్వరు, లేదా బుకింగ్ అయినట్లు మీకు ఒక మెసేజ్ వచ్చినా, అక్కడ నిజమైన రిజర్వేషన్ లేదని తెలుస్తుంది. అందుకే, ఏదైనా బుక్ చేసేటప్పుడు వెబ్సైట్ నమ్మదగినదిగా ఉందో లేదో సరిచూసుకోండి. వెబ్సైట్ పేరులో చిన్న అక్షరాలు మారి ఉన్నా, లేదా అసాధారణ డొమైన్ పేరు ఉన్నా జాగ్రత్త వహించండి.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
కరెన్సీ ఎక్స్చేంజ్ మోసం
విదేశాలకు వెళ్ళినప్పుడు కరెన్సీ మార్పిడి సమయంలో మోసాలు జరిగే అవకాశం ఉంది. నకిలీ నోట్లు, చిరిగిన నోట్లు లేదా తప్పుడు విదేశీ కరెన్సీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే, నోట్ల కట్టలలో కావాలని నకిలీ నోట్లను కలిపి ఇవ్వడం కూడా సాధారణం. హడావిడిగా కరెన్సీ మార్పిడి చేసే సమయంలో మీరు డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే, డబ్బు మార్పిడి కోసం బ్యాంకులు, ఎయిర్ పోర్టులో ఉన్న మార్పిడి కౌంటర్లు లేదా అధికారిక లైసెన్స్ ఉన్న ఫారెక్స్ ఏజెంట్లను మాత్రమే సంప్రదించండి. డబ్బు తీసుకునేటప్పుడు నిదానంగా లెక్కించుకోండి.
ఈ మోసాల గురించి తెలుసుకోవడం వల్ల మీ ప్రయాణం సురక్షితంగా, ఆనందదాయకంగా ఉంటుంది. తెలివిగా వ్యవహరించడం, డిజిటల్ టూల్స్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడం, అధికారిక సంస్థలను మాత్రమే నమ్మడం ద్వారా ఈ మోసాల నుండి మీరు సులభంగా బయటపడవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.