TGSRTC : పండుగ పూట ఆర్టీసీకి టెన్షన్.. దసరాకి చార్జీలు పెరగడం నిజమేనా? ఆర్టీసీ ఎండీ సంచలన ప్రకటన
TGSRTC : దసరా, ఇతర పండుగల సందర్భంగా టీఎస్ఆర్టీసీ (TSRTC) బస్సు టికెట్ ధరలను పెంచిందని వస్తున్న వార్తలపై సంస్థ యాజమాన్యం స్పందించింది. టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. అయితే, ఏ పరిస్థితుల్లో టికెట్ ధరలు మారుతాయో కూడా వివరించింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రచారంలో నిజం లేదు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు టికెట్ ధరలను పెంచిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సంస్థ స్పష్టం చేసింది. అయితే, పండుగల సమయంలో నడిపే స్పెషల్ బస్సుల విషయంలో మాత్రం కొన్ని సవరణలు ఉంటాయని వివరించింది.

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
జీవో నంబర్ 16 ప్రకారం..
ఆర్టీసీ యాజమాన్యం చెప్పిన వివరాల ప్రకారం, ప్రధాన పండుగలైన దసరా, సంక్రాంతి, రాఖీ, వినాయక చవితి వంటి సందర్భాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు స్పెషల్ బస్సులను నడుపుతారు. ఈ స్పెషల్ బస్సులు సొంతూళ్లకు వెళ్లేటప్పుడు నిండా ప్రయాణికులతో ఉంటాయి. కానీ, తిరిగి వచ్చేటప్పుడు చాలా వరకు ఖాళీగా వస్తుంటాయి. అలా ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చును భర్తీ చేసుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం 2003లో జీవో నంబర్ 16ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం, స్పెషల్ బస్సుల సాధారణ చార్జీలలో 50 శాతం వరకు మాత్రమే ధరలను పెంచుకోవచ్చని ఆర్టీసీకి అధికారం ఇచ్చింది. ఈ పద్ధతి 2003 నుంచి కొనసాగుతోందని, ఇప్పుడే కొత్తగా చార్జీలు పెంచుతున్నట్టుగా జరుగుతున్న దుష్ప్రచారం మానుకోవాలని ఆర్టీసీ హితవు పలికింది.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
రెగ్యులర్ సర్వీసులకు వర్తించదు
ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీకి దాదాపు 10 వేల బస్సులు ఉన్నాయి. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని బట్టి రోజుకు సగటున 500 నుంచి 1000 వరకు స్పెషల్ బస్సులను మాత్రమే నడుపుతుంది. ఈ స్పెషల్ బస్సులకు మాత్రమే ఈ ధరల సవరణ వర్తిస్తుంది. మిగతా రెగ్యులర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని సంస్థ తెలిపింది.
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6 తేదీలలో కూడా స్పెషల్ బస్సులను నడుపుతారు. ఈ బస్సులకు మాత్రమే చార్జీల సవరణ ఉంటుంది. ఆయా తేదీలలో నడిచే రెగ్యులర్ సర్వీసుల టికెట్ ధరలలో ఎలాంటి మార్పు ఉండదని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. పండుగల సమయంలో నడిచే అన్ని బస్సుల్లో చార్జీలు పెరిగాయని కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.