Ammapalli Temple : 1000 ఏళ్ల నాటి రామయ్య విగ్రహం.. హైదరాబాద్ దగ్గర తప్పక చూడాల్సిన దేవాలయం ఇదే!
Ammapalli Temple : హైదరాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో, శంషాబాద్ బస్టాప్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మాపల్లి శ్రీ రామచంద్ర స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా పురాతనమైనది. అద్భుతమైన నిర్మాణ శైలితో పర్యాటకులను ఆకర్షిస్తూ, ఇది టాలీవుడ్ సినీ షూటింగ్లకు కూడా కేంద్రంగా నిలిచింది. ఈ ఆలయంలోని రామయ్య విగ్రహానికి దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. మరి ఈ అమ్మాపల్లి రామాలయం విశేషాలు, చరిత్ర మరియు ఆకర్షణల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆలయ చరిత్ర, నిర్మాణం, సెంటిమెంట్
అమ్మాపల్లి రామాలయాన్ని వేంగి రాజులు 13వ శతాబ్దంలో నిర్మించారు. కానీ, ఇక్కడి మూలవిరాట్ అయిన శ్రీరాముడి విగ్రహం వయస్సు దాదాపు 1000 సంవత్సరాలు ఉంటుందని చెబుతారు. ఆలయం ముందు భాగంలో ఏడు అంతస్తుల భారీ గోపురం ఉంటుంది. ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గోపురం ప్రవేశ ద్వారం పైన శ్రీ మహావిష్ణువు పడుకున్న భంగిమలో ఉన్న పెద్ద విగ్రహం ఉంటుంది. తెలుగు సినీ అభిమానులకు ఈ ఆలయం ఒక సెంటిమెంట్ ప్రదేశం. ఇక్కడ చిత్రీకరించబడిన సినిమాలు శ్రీ సీతారామస్వామి ఆశీస్సులతో విజయవంతమవుతాయని టాలీవుడ్ సినీ పరిశ్రమ నమ్ముతుంది.

అద్భుతమైన విగ్రహాలు, హనుమంతుడి ప్రత్యేకత
గోపురం దాటి లోపలికి వెళ్లగానే ప్రధాన ఆలయం కనిపిస్తుంది. ఆలయం చుట్టూ పెద్ద కారిడార్ ఉంటుంది. ఈ ఆలయంలోని సీతారామ లక్ష్మణుల విగ్రహాలను మరియు మకర తోరణాన్ని ఒకే నల్లరాయిపై అద్భుతంగా చెక్కారు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా రాముడి పక్కన ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం గర్భగుడిలో కనిపించదు. బదులుగా, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వజస్తంభం దగ్గర శ్రీరాముడికి ఎదురుగా ప్రతిష్టించారు. ఇది ఈ ఆలయంలో కనిపించే అరుదైన అంశం.
ఇది కూడా చదవండి : Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
పురాతన కోనేరు, పరిసరాలు
ఈ ఆలయంలో చాలా పురాతనమైన పెద్ద కోనేరు ఉంది. ఈ కోనేరు చుట్టూ పోర్టికోలు ఉన్నాయి, ఇవి ఒకప్పుడు యాత్రికులకు ఆశ్రయం కల్పించేవి. కోనేరు చుట్టూ కొబ్బరి చెట్లు దట్టంగా పెరిగి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆలయానికి ఎదురుగా ఒక మండపం కూడా ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ఆలయానికి ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నగరం నుంచి ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మెహదీపట్నం నుంచి బయలుదేరినట్లయితే, శంషాబాద్ బేగంపేట జంక్షన్ వద్ద కుడివైపునకు తిరిగి, అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే పర్యాటకులు శంషాబాద్ విమానాశ్రయం ఎగ్జిట్ తీసుకుని, శంషాబాద్ టౌన్ వైపు వెళ్లి, బస్ స్టాప్ జంక్షన్ వద్ద ఎడమ వైపునకు తిరగాలి. ఆలయం ప్రధాన రహదారికి దగ్గరగా ఎడమ వైపున ఉంటుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.