Travel Insurance : ప్రయాణికులకు అదిరిపోయే వార్త.. కేవలం 45పైసలకే రూ.10లక్షల ఇన్సూరెన్స్
Travel Insurance : రైలులో ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లవచ్చు. అయితే, ప్రయాణంలో అనుకోని ప్రమాదాలు జరిగితే? ఇలాంటి ఆందోళనల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా భారతీయ రైల్వే ఒక గొప్ప సదుపాయాన్ని అందిస్తోంది. కేవలం 45 పైసలకే రైలు ప్రయాణికులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లభిస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ సౌకర్యం గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
రైల్వేలో ప్రయాణించే వారికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక కీలక సమాచారాన్ని అందించారు. ఆన్లైన్లో రైలు టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు కేవలం 45 పైసల ప్రీమియంతో ట్రావెల్ ఇన్సూరెన్స్ లభిస్తుందని ఆయన తెలిపారు. పార్లమెంటులో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ ఇన్సూరెన్స్ పథకం టికెట్ బుక్ చేసేటప్పుడు ఐచ్ఛికంగా ఎంచుకోవచ్చు. ఆన్లైన్లో కన్ఫర్మ్ లేదా ఆర్ఏసీ టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే ఆ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు
ఈ ఇన్సూరెన్స్ ఎంచుకున్న వారికి టికెట్ ధరతో పాటు అదనంగా 45 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ వివరాలు ప్రయాణికుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి వస్తాయి. దీంతో పాటు, నామినీ వివరాలు నమోదు చేయడానికి ఒక లింక్ కూడా పంపుతారు. ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగితే, క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ప్రయాణికుడు, ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య జరుగుతుంది. రైల్వేకు దీనితో ఎలాంటి సంబంధం ఉండదు. క్లెయిమ్ ఎలా చేసుకోవాలో వివరాలు ఇన్సూరెన్స్ కంపెనీ పంపిన ఈ-మెయిల్లో ఉంటాయి.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా గత ఐదేళ్లలో మొత్తం 333 క్లెయిమ్‌లు పరిష్కరించబడ్డాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ క్లెయిమ్‌ల ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రయాణికులకు లేదా వారి కుటుంబ సభ్యులకు మొత్తం రూ.27.22 కోట్లు చెల్లించాయి. ఈ పథకం చాలా తక్కువ ఖర్చుతో గరిష్ట ప్రయోజనాలు అందించేలా రూపొందించబడిందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా, ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఆప్షన్ డిఫాల్ట్‌గా వస్తుంది. ఈ సదుపాయం వద్దనుకుంటే టిక్ మార్క్ తీసివేయవచ్చని ఆయన చెప్పారు. దీనికోసం ఎలాంటి అదనపు అప్లికేషన్లు, డాక్యుమెంట్లు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.