Janmashtami : జన్మాష్టమి రోజు తప్పక సందర్శించాల్సిన శ్రీకృష్ణ దేవాలయాలు.. వీటిని అస్సలు మిస్సవద్దు
Janmashtami : “సంతోషం అనేది బయటి ప్రపంచానికి సంబంధం లేని ఒక మానసిక స్థితి” శ్రీకృష్ణుని బోధనలు కాలాతీతమైనవి. శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే కృష్ణుడు మధురలో జన్మించాడు. చిన్ననాటి అల్లర్లు, ప్రేమ, భక్తి కథలతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఆయన జన్మదినాన్ని జన్మాష్టమిగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ జన్మాష్టమి వేడుకల్లో మీరు కూడా పాల్గొనాలనుకుంటే భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ 7 శ్రీకృష్ణ దేవాలయాల్లో అద్భుతమైన జన్మాష్టమి వేడుకలు ఎలా జరుగుతాయో తెలుసుకోండి.
ద్వారకాధీష్ దేవాలయం, ద్వారక, భారతదేశం
గుజరాత్ మొదటి రాజధానిగా ఉన్న ద్వారకను మోక్షపురి, ద్వారకవతి అని పిలుస్తారు. ఇది శ్రీకృష్ణుడి ప్రాచీన రాజ్యమని నమ్ముతారు. సమీపంలోని ఒక ద్వీపం అయిన బెట్ ద్వారక, కృష్ణుడి అసలు నివాసమని చెబుతారు. శ్రీకృష్ణుని మునిమనుమడైన వజ్రనాభుడు నిర్మించిన ఈ శ్రీ ద్వారకాధీష్ దేవాలయం అరేబియా సముద్రం పైన ఉన్న ఒక కొండపై ఉంది. అద్భుతమైన శిల్పాలు, ఎత్తైన శిఖరం, అనేక చిన్న గుళ్ళతో ఈ ఆలయం హిందూ మతం నాలుగు పవిత్ర ధామాలలో ఒకటి. కృష్ణుని జన్మదినాన్ని జరుపుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం.

కృష్ణ-బలరాం మందిర్, బృందావనం, భారతదేశం
ఇస్కాన్ బృందావన్‌ను కృష్ణ-బలరాం మందిర్ అని కూడా పిలుస్తారు. ఇది కృష్ణ భక్తులకు ఒక ప్రధాన పుణ్యక్షేత్రం. జన్మాష్టమి రోజున, ఈ ఆలయం తాజా పువ్వులతో అలంకరిస్తారు. మార్బుల్ మందిరాలలో రోజంతా కీర్తనలు, భజనలు ప్రతిధ్వనిస్తాయి. భక్తులు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, నాటకాలు, భక్తి నృత్యాలలో పాల్గొంటారు. అర్ధరాత్రి జరిగే అభిషేకం (పవిత్ర స్నానం), హారతి ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. వేల మంది భక్తులు కృష్ణుడి జన్మ వేడుకలను చూడటానికి ఇక్కడికి వస్తారు.
కృష్ణ జన్మస్థాన్ ఆలయ సముదాయం, మధుర, భారతదేశం
శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఉన్న ఈ ఆలయ సముదాయంలో కేశవదేవ్, గర్భ గృహ, భాగవత భవన్ అనే మూడు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు రాధ, బలరాం, రాముడు, హనుమాన్, శివుడు వంటి వివిధ దేవతలకు అంకితం చేయబడ్డాయి. సంక్లిష్టమైన నిర్మాణశైలి, లోతైన ఆధ్యాత్మిక అనుభూతితో, కృష్ణ భక్తులకు ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
శ్రీ శ్రీ రుక్మిణి ద్వారకాధీష్ దేవాలయం, ఢిల్లీ, భారతదేశం
ఇస్కాన్ ద్వారక ఢిల్లీగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శ్రీ శ్రీ గౌర నితాయ్, శ్రీ శ్రీ రుక్మిణి ద్వారకాధీష్ మరియు శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి దేవతలు ఉన్నారు. ఈ ఢిల్లీ ఆలయం ఆధునికమైన, పవిత్రమైన ఇస్కాన్ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. మూడు రోజుల పండుగగా ఇక్కడ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రఖ్యాత చైల్డ్ సింగర్స్ నేతృత్వంలో జరిగే భక్తి సంగీత కచేరిలు, నృత్యాలు, నాటకాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు.
శ్రీనాథ్జీ దేవాలయం, నాథ్‌ద్వారా, భారతదేశం
రాజస్థాన్‌లోని నాథ్ద్వారాలో ఉన్న 17వ శతాబ్దపు శ్రీనాథ్జీ దేవాలయం శ్రీకృష్ణ భక్తికి గుండె వంటిది. జన్మాష్టమి రోజున, స్వామివారిని అత్యంత సుందరమైన, రాజసం ఉట్టిపడే వస్త్రాలతో అలంకరిస్తారు. ఆలయం హవేలీ సంగీతం, భజనలు మరియు సాంప్రదాయ పుష్టిమార్గం ఆచారాలతో కళకళలాడుతుంది. అర్ధరాత్రి జరిగే జన్మోత్సవ్ వేడుకలు ఆనందం, భక్తితో నిండి ఉంటాయి.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
జగన్నాథ్ దేవాలయం, పూరీ, భారతదేశం
ప్రసిద్ధ రథయాత్రకు పేరుగాంచిన పూరీ జగన్నాథ్ దేవాలయం జన్మాష్టమిని ప్రత్యేక ఆచారాలతో జరుపుకుంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడిని జగన్నాథుడిగా, అతని సోదరులైన బలభద్ర, సుభద్రతో కలిసి పూజిస్తారు. భక్తులు అభిషేకం, భక్తి గీతాలు, కృష్ణుడి జనన కథల పఠనంలో పాల్గొంటారు. ఇక్కడ అద్భుతమైన అలంకరణల కన్నా, లోతైన ఆధ్యాత్మిక భావనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ఇస్కాన్ దేవాలయం, సిడ్నీ, ఆస్ట్రేలియా
సిడ్నీలోని ఇస్కాన్ దేవాలయం ఆస్ట్రేలియాలోని కృష్ణ భక్తులకు ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ జన్మాష్టమి సందర్భంగా పిల్లల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, భజనలు, డ్రామాలు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. అర్ధరాత్రి అభిషేకం తరువాత, ఒక భారీ విందు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ భారతీయ సంప్రదాయాలు, ఆస్ట్రేలియన్ కమ్యూనిటీ స్ఫూర్తి కలిసిపోతాయి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.