Railways Luggage Limit: రైలులో లగేజీ తీసుకెళ్లే వారికి షాక్.. ఈ కొత్త రూల్స్ తెలియకపోతే జరిమానా పక్కా
Railways Luggage Limit: భారతదేశంలో రోజూ లక్షలాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తుంటారు. తమ ప్రయాణంలో బ్యాగులు, ఇతర పెద్ద వస్తువులను వెంట తీసుకెళ్తుంటారు. అయితే, రైల్వే ప్రయాణాలను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసేందుకు భారతీయ రైల్వే కొన్ని కఠినమైన నిబంధనలను అమలు చేస్తుంది. వీటిలో లగేజీకి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి. కానీ చాలామందికి ఈ నియమాల గురించి సరైన అవగాహన ఉండదు. రైలులో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు? పరిమితికి మించి తీసుకెళ్తే ఏం జరుగుతుంది? లగేజీ చెకింగ్ ఎక్కడ చేస్తారు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మీ టికెట్ క్లాస్‌ను బట్టి లగేజీ పరిమితి
ప్రయాణికుడు కొనుగోలు చేసిన టికెట్ క్లాస్ ఆధారంగా నిర్దిష్ట బరువు వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. ఈ పరిమితి కంటే ఎక్కువ బరువు ఉన్న లగేజీకి అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
స్లీపర్ క్లాస్ : ఒక్కో ప్రయాణికుడు గరిష్టంగా 40 కిలోల వరకు లగేజీని వెంట తీసుకెళ్లవచ్చు.
ఏసీ కోచ్‌లు : ఏసీ బోగీలలో ప్రయాణించేవారు తమ టికెట్ రకాన్ని బట్టి 50 నుండి 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లడానికి అనుమతి ఉంది.
జనరల్ క్లాస్ : జనరల్ బోగీలలో ప్రయాణించేవారు 35 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు.

ఎక్కడ లగేజీ తనిఖీ చేస్తారు?
సాధారణంగా రైల్వే స్టేషన్లోనే మీ లగేజీని తనిఖీ చేస్తారు. రైల్వే స్టేషన్లలో లగేజీ చెక్ పాయింట్లు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, టీటీఈలు లేదా ఇతర రైల్వే అధికారులు కూడా రైలులో ప్రయాణించేటప్పుడు మీ లగేజీని తనిఖీ చేయవచ్చు. లగేజీ పరిమితికి మించి ఉంటే, అదనపు రుసుము చెల్లించవలసి వస్తుంది. అదనపు రుసుమును లెక్కించేందుకు రైల్వే స్టేషన్లలో లగేజీ కొలత, బరువును చూసేందుకు యంత్రాలు కూడా ఉంటాయి.
పరిమితికి మించి లగేజీ ఉంటే ఏం జరుగుతుంది?
మీ లగేజీ నిర్దేశించిన పరిమితిని మించి ఉంటే, దానికి అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ రుసుము చెల్లించడానికి నిరాకరిస్తే, రైల్వే అధికారులు మీపై జరిమానా విధించవచ్చు. కొన్ని సందర్భాలలో, మీ లగేజీని రైలు నుండి బయటకు పంపే అధికారం కూడా వారికి ఉంటుంది. ఒకవేళ మీ లగేజీలో నిషేధిత వస్తువులు ఉంటే, అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
ఈ విషయాలను గుర్తుంచుకోండి
ప్రయాణానికి ముందు మీ లగేజీ బరువును తూకం వేసుకోవడం మంచిది. ఒకవేళ బరువు ఎక్కువగా ఉంటే, స్టేషన్లోనే లగేజీ టికెట్ తీసుకోవాలి. దాని ద్వారా మీరు ప్రయాణం సాఫీగా సాగించవచ్చు. రైలు ఎక్కడానికి ముందు రైల్వే లగేజీ నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం. ఇది మీకు అనవసరమైన ఇబ్బందులను నివారిస్తుంది.
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
రైలులో ప్రయాణించేటప్పుడు నిషేధించిన వస్తువులు
రైలులో కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్లడం నిషేధం. ముఖ్యంగా అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే పేలుడు పదార్థాలు, మండే వస్తువులు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు, చనిపోయిన జంతువులు, 100 సెంటీమీటర్ల కంటే పెద్ద పెట్టెలు, 4 అంగుళాల కంటే పొడవైన బ్లేడ్ ఉన్న కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాలను వెంట తీసుకెళ్లకూడదు. అలాగే, పెద్ద మొత్తంలో ఆహార పదార్థాలు (ఎక్కువ మొత్తంలో నెయ్యి, మాంసం అనుమతించబడవు) తీసుకువెళ్లడం కూడా నిషేధం. ఈ నియమాలు మీ సేఫ్టీ కోసమే అని గుర్తుంచుకోవాలి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.