Ganesh Chaturthi : వినాయక చవితికి ఈ ఆలయాలు దర్శించుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి
Ganesh Chaturthi : భారతదేశంలో గణపతి ఆలయాలకు కొదవ లేదు. దేశం నలుమూలలా గణపతి ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు వాటి నిర్మాణ శైలి లేదా స్థానిక కథల వల్ల ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. భక్తుల కోరికలను నెరవేరుస్తున్నాయని నమ్మే కొన్ని అద్భుతమైన గణపతి ఆలయాల గురించి ఈ వినాయక చవితి సందర్భంగా తెలుసుకుందాం. ఈ ఆలయాలు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా మంచి పేరు సంపాదించాయి. ఈ కథనంలో ఆ 5 ప్రత్యేక గణపతి ఆలయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖజ్రానా గణపతి దేవాలయం, ఇండోర్
మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఖజ్రానా అనే చిన్న పట్టణంలో ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందిన గణేశ దేవాలయం ఉంది. ఇక్కడ భక్తులు వినాయకుడి విగ్రహం వెనుక స్వస్తిక్ గుర్తు వేసి, ఒక మోదకం ప్రసాదంగా సమర్పిస్తే వారి కోరికలు తప్పకుండా నెరవేరతాయని బలంగా నమ్ముతారు. ఈ ఆలయాన్ని 1735లో హోల్కర్ వంశానికి చెందిన మహారాణి అహల్యాబాయి నిర్మించారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు మూడు సార్లు ప్రదక్షిణలు చేసి, ఆలయ గోడలకు దారాలను కట్టడం ఒక సంప్రదాయం. ఇలా చేస్తేనే ఆలయ దర్శనం పూర్తవుతుందని నమ్మకం. ఈ ఆలయం దేశంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రతి బుధవారం ఇక్కడ ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తారు.

మండాయి గణపతి దేవాలయం, పూణే
మహారాష్ట్రలోని పూణేలో ఉన్న మండాయి గణపతి ఆలయం ఆ ప్రాంతంలోనే అతిపెద్ద గణపతి ఆలయం. ఇక్కడ కొలువైన గణపతిని అఖిల్ గణపతి మండల్ అని పిలుస్తారు. ఈ ఆలయానికి దేశం నలుమూలల నుండి, విదేశాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రత్యేకంగా వినాయక చవితి ఉత్సవాల సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయం సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుంది.
ఇది కూడా చదవండి : Stree Shakthi : ఏపీలో స్త్రీ శక్తి పథకానికి భారీ స్పందన.. ఒక్కరోజే రూ.7 కోట్లు ఆదా
జునా చింతామణి గణేశ దేవాలయం, మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్లోని జునా ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం సుమారు 1200 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ కొలువైన గణేశుడు చాలా ప్రసిద్ధి చెందాడు. ఇక్కడి వినాయకుడు భక్తుల సమస్యలను ఫోన్, మొబైల్, ఉత్తరం ద్వారా విని పరిష్కరిస్తారని ప్రతీతి. ఒకసారి జర్మనీకి చెందిన ఒక భక్తుడు గణేశుడితో మాట్లాడాలని పట్టుబట్టగా, పూజారి ద్వారా వినాయకుడి చెవిలో తన సమస్య చెప్పుకున్నాడని, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అతని సమస్య పరిష్కారమైందని చెబుతారు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. పూజారి ద్వారా భక్తులు తమ కోరికలను గణేశుడికి చెప్పుకుని, వాటిని నెరవేర్చుకుంటున్నారు.
ఉచ్చి పిళ్లైయార్ దేవాలయం, తిరుచ్చి
తమిళనాడులోని తిరుచ్చి నగరంలో ఒక కొండపై ఉన్న ఉచ్చి పిళ్లైయార్ ఆలయం దేశ, విదేశాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని గణపతిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని ఛోళ రాజులు కొండను తొలిచి నిర్మించారు. కొండ శిఖరంపై ఉన్నందువల్ల ఈ గణేశ ఆలయాన్ని హై పిళ్లైయార్ అని పిలుస్తారు. ఇక్కడి నుంచి కిందికి చూస్తే కావేరీ నది, శ్రీరంగం ఆలయాల అందమైన దృశ్యం కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి : Travel Tips 14 : ప్రయాణంలో తక్కువ లగేజీ తీసుకెళ్లడం ఎలా? ఈ 6 చిట్కాలు పాటిస్తే హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు!
త్రినేత్ర గణేశ దేవాలయం, రాజస్థాన్
రాజస్థాన్లోని రణతంబోర్ కోటలో ఉన్న త్రినేత్ర గణేశ ఆలయం ఒక పురాతన ఆలయం. ఇక్కడ కొలువైన వినాయకుడు మూడు కళ్ళతో ఉంటారు. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనది. దీనిని మహారాజా హమ్మీర్ దేవ్ చౌహాన్ నిర్మించారు. యుద్ధంలో ఓటమి పాలైన హమ్మీర్ దేవ్ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, వినాయకుడు స్వయంగా ఆయనకు కనిపించారని ఇక్కడ ప్రతీతి. ఈ ఆలయానికి వచ్చే పెళ్లి ఆహ్వాన పత్రికలను గణేశుడి పాదాల వద్ద ఉంచి, పూజలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. త్రినేత్ర గణేశుడిని దర్శించుకుంటే పెళ్లి, ఇతర శుభకార్యాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.