Dasara Navaratri : నవరాత్రులలో ఏ రోజు ఏ అమ్మవారిని ఎలా పూజించాలి? ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసా ?
Dasara Navaratri : నవరాత్రులు అంటే అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో పూజించుకునే పండుగ. ప్రతి రోజు ఒక్కో అమ్మవారిని అలంకరించి, ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నవరాత్రులలో ఏ రోజు ఏ దేవతను ఎలా పూజించాలో ఇప్పుడు చూద్దాం.
మొదటి రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం
బాలా త్రిపుర సుందరి దేవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శాసించే శక్తిగా భావిస్తారు. ఈ రూపంలో అమ్మవారు 16 ఏళ్ల బాలికగా కనిపిస్తారు. అమ్మవారి ఈ రూపం జ్ఞానం, అభయాన్ని సూచిస్తుంది. అమ్మవారికి పులిహోర, పల్లి లడ్డూలు నైవేద్యంగా సమర్పిస్తారు.
రెండవ రోజు: శ్రీ గాయత్రీ దేవి అలంకారం
గాయత్రీ దేవిని వేదమాతగా, పంచముఖిగా, సప్తముఖిగా పూజిస్తారు. ఈ రూపంలో అమ్మవారు జ్ఞానం, సంపద, శాంతికి ప్రతీక. ఈమెకు బెల్లం, పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే పాలు, తేనె, నెయ్యితో చేసిన పదార్థాలను కూడా సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి అన్నం నైవేద్యంగా పెడతారు.

మూడవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం
అన్నపూర్ణా దేవి అంటే ఆహారాన్ని ప్రసాదించే తల్లి. ఈ రూపంలో అమ్మవారు శక్తి, సంపద, ఆహారానికి ప్రతీక. అన్నపూర్ణా దేవిని పూజిస్తే ఆకలి, పేదరికం, దుఃఖం తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అమ్మవారికి కొబ్బరి అన్నం, లడ్డూలు, గారెలు, పులిహోర నైవేద్యంగా పెడతారు.
నాల్గవ రోజు: శ్రీ కాత్యాయనీ దేవి అలంకారం
దసరా నవరాత్రులలో అమ్మవారిని శ్రీ కాత్యాయనీ దేవిగా అలంకరించి పూజిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అమ్మవారికి బెల్లం పొంగలి, దద్దోజనం, గారెలు, లడ్డూలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.
ఐదవ రోజు: శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం
శ్రీ మహాలక్ష్మి దేవి సంపద, శ్రేయస్సు, శాంతి, శుభాలకు ప్రతీక. ఈమెను పూజిస్తే ఆర్థికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందుతారని నమ్ముతారు. అమ్మవారికి గారెలు, క్షీరాన్నం, పాయసం, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.
ఆరవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం
లలితా త్రిపుర సుందరి దేవిని సకల శక్తి స్వరూపిణిగా భావిస్తారు. లలిత అంటే అందమైనది, త్రిపుర సుందరి అంటే మూడు లోకాలలో అత్యంత అందమైనది. ఈమెను పూజిస్తే శక్తి, సంపద, జ్ఞానం, సంతోషం, సంతానం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారికి దద్దోజనం, పాయసం, లడ్డూలు, గారెలు, బెల్లం పొంగలి, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు.
ఇది కూడా చదవండి : Thailand 2024 : థాయ్లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ఏడవ రోజు: శ్రీ మహా చండీ దేవి అలంకారం
మహా చండీ దేవి దుర్గాదేవి యొక్క ఉగ్ర రూపాలలో ఒకటి. ఈమెను పూజిస్తే శత్రువుల నుండి రక్షణ, విజయం లభిస్తాయని నమ్ముతారు. ఈ రూపంలో అమ్మవారు దుష్ట శక్తులను, అహంకారాన్ని నాశనం చేయడానికి అవతరించారని భావిస్తారు. అమ్మవారికి బెల్లం పొంగలి, దద్దోజనం, వడపప్పు నైవేద్యంగా పెడతారు.
ఎనిమిదవ రోజు: శ్రీ సరస్వతీ దేవి అలంకారం
సరస్వతీ దేవిని జ్ఞానం, విద్య, సంగీతం, కళలకు అధిదేవతగా భావిస్తారు. ఈమెను శారద, వాగ్దేవి, శారదాంబ, భారతి, వాణి వంటి అనేక రూపాల్లో పూజిస్తారు. ఈమెను భక్తి శ్రద్ధలతో పూజిస్తే జ్ఞానం, విద్య, కళలు, సంగీతంలో అభివృద్ధి చెందుతారని నమ్ముతారు. అమ్మవారికి పాయసం, పెసరట్టు, వడపప్పు, దద్దోజనం, బెల్లం పొంగలి వంటివి నైవేద్యంగా పెడతారు.
తొమ్మిదవ రోజు: శ్రీ దుర్గా దేవి అలంకారం
దుర్గా దేవి దుష్ట శక్తులను నాశనం చేసే శక్తికి ప్రతీక. ఈమెను పూజిస్తే బలం, జ్ఞానం, సంపద, శాంతి, ధైర్యం, సంతానం కలుగుతాయని నమ్ముతారు. దుఃఖం, పేదరికం నుండి రక్షిస్తారని భక్తుల నమ్మకం. ఈ రూపంలో అమ్మవారికి కదంబం, పులిహోర, దద్దోజనం, పాయసం, వడపప్పు నైవేద్యంగా పెడతారు.
ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
పదవ రోజు: శ్రీ మహిషాసురమర్దినీ దేవి అలంకారం
మహిషాసురమర్దినీ దేవి దుర్గాదేవి మరో రూపం. మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఈమె లోకాన్ని రక్షించింది. ఈమెను పూజిస్తే ధైర్యం, జ్ఞానం, విజయం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారికి చలిమిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు.
పదకొండవ రోజు: శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం
రాజరాజేశ్వరీ దేవిని జగన్మాతగా, విశ్వానికి పాలకురాలిగా భావిస్తారు. ఈమెను పూజిస్తే జ్ఞానం, శక్తి, సంపద, ఆనందం, సంతానం లభిస్తాయని నమ్ముతారు. అమ్మవారికి పూర్ణాలు నైవేద్యంగా పెడతారు. పాయసం, పులిహోర, వడపప్పు, దద్దోజనం, బెల్లం పొంగలి వంటివి కూడా సమర్పిస్తారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.