Palitana : ఆ నగరంలో నాన్ వెజ్ తింటే జైలుకే.. టూరిస్టులు కూడా తినొద్దు.. ఎలా వెళ్లాలంటే
Palitana : ప్రపంచంలో ఆ నగరంలో ఎవరూ మాంసం తినరు. అలాంటి ఏకైక శాఖాహార నగరం ఎక్కడుందో తెలుసా. అదే గుజరాత్‌లోని పాలిటానా. ఈ పవిత్ర నగరంలో మాంసాహారం తినడం, అమ్మడం, నిల్వ చేయడం పూర్తిగా నిషేధం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. మరి ఇంత కఠినమైన నియమాలు ఎందుకు? అసలు ఈ నగరానికి ఎలా వెళ్లాలి? తెలుసుకుందాం.
పాలిటానా ప్రత్యేకతలు, చరిత్ర..
పాలిటానా నగరం గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఉంది. అహ్మదాబాద్‌కు ఇది సులభంగా చేరుకునే దూరంలోనే ఉంటుంది. పాలిటానా జైనులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఈ నగరాన్ని జైన్ దేవాలయాల పట్టణం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శత్రుంజయ కొండపై 900కు పైగా అత్యద్భుతమైన జైన దేవాలయాలు ఉన్నాయి. జైన మతం ప్రధాన సూత్రం అహింస (ఏ ప్రాణినీ హింసించకపోవడం). ఈ సూత్రానికి గౌరవం ఇచ్చే విధంగా 2014లో జైన మత పెద్దల అభ్యర్థన మేరకు గుజరాత్ ప్రభుత్వం పాలిటానాను మాంసం రహిత నగరంగా ప్రకటించింది. అప్పటినుంచి ఇక్కడ మాంసం, చేపలు, గుడ్లు వంటి వాటి అమ్మకాలు, వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. అంతేకాదు, ఇక్కడ ఏ విధమైన స్లాటర్ హౌస్‌లు (మాంసం దుకాణాలు) లేదా నాన్-వెజ్ రెస్టారెంట్లు ఉండటానికి అనుమతి లేదు. పాలిటానాలో నివసించే ముస్లింలు కూడా ఈ నియమాన్ని పాటిస్తారు.
ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts

శత్రుంజయ కొండపై అద్భుత దేవాలయాలు..
పాలిటానాలోని శత్రుంజయ దేవాలయాలు శ్వేతాంబర జైన సమాజానికి ప్రధాన పుణ్యక్షేత్రం. ఈ కొండపై అనేక తీర్థంకరులు మోక్షం పొందినట్లు జైనులు నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. 11వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించిన ఈ దేవాలయాలు అద్భుతమైన శిల్పకళ, పాలరాతి పనితనంతో పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ దేవాలయాలను చేరుకోవడానికి సుమారు 3,500 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది.
ఇది కూడా చదవండి : Best Food Cities : ఫుడ్ లవర్ల స్వర్గం.. ఇండియాలో ఈ 5 నగరాలను అస్సలు మిస్ అవ్వొద్దు
పాలిటానా ఎలా చేరుకోవాలి?
పాలిటానాకు విమాన, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.
విమాన మార్గం: పాలిటానాకు దగ్గరగా ఉన్న విమానాశ్రయం భావ్‌నగర్ విమానాశ్రయం (Bhavnagar Airport – 51 కిలోమీటర్లు). ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాల నుంచి విమానాలు లభిస్తాయి. ఎయిర్ పోర్టు నుంచి టాక్సీ లేదా బస్సులో పాలిటానా చేరుకోవచ్చు.
రైలు మార్గం: పాలిటానాకు సొంత రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడికి భావ్‌నగర్, అహ్మదాబాద్ వంటి నగరాల నుంచి రైళ్లు లభిస్తాయి.
రోడ్డు మార్గం: గుజరాత్‌లోని అన్ని ప్రధాన నగరాల నుంచి పాలిటానాకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. స్వంత వాహనంలో వెళ్లాలనుకునేవారికి రోడ్డు మార్గం చాలా అనువుగా ఉంటుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.