Bathukamma Festival : బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు.. ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
Bathukamma Festival : ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల ద్వారా పర్యాటక రంగానికి కూడా ప్రచారం కల్పించనున్నారు. 9 రోజుల పాటు 9 వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. సెప్టెంబర్ 21 నుండి 30 వరకు ఈ పూల పండుగ జరగనుంది. వేయి స్తంభాల గుడిలో తొలిరోజు వేడుకలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌లో ఫ్లోటింగ్ బతుకమ్మ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గిన్నిస్ బుక్ రికార్డును లక్ష్యంగా చేసుకుని 10 వేల కంటే ఎక్కువ మంది మహిళలతో బతుకమ్మ వేడుక నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఇతర రాష్ట్రాల ప్రజలను కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసే ప్రణాళికలు రూపొందించారు.
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు బతుకమ్మ పోస్టర్, సావనీర్‌ను ఆవిష్కరించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21 నుండి 30 వరకు 9 రోజుల పాటు 9 వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాల వివరాలను మంత్రి జూపల్లి వెల్లడించారు.

తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. పర్యాటకం – తెలంగాణ సంస్కృతి ఈ రెండింటి కలయికతో మిస్ వరల్డ్ ఈవెంట్‌ను సక్సెస్ ఫుల్‌గా నిర్వహించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించే పండుగల ప్రత్యేకత, మన సంస్కృతి అంతర్జాతీయ పర్యాటకులకు కూడా తెలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి, వారిని ఆకర్షించాలనే ప్రత్యేక కార్యాచరణను రూపొందించామని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహించి, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెబుతామని చెప్పారు. బ్రెజిల్లో ఏటా ఘనంగా నిర్వహించే రియో కార్నివాల్ తరహా కార్యక్రమాలను తెలంగాణలోనూ చేపట్టాలనే ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ పండుగను నిర్వహించబోతున్నామన్నారు.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
ఈ నెల 21న వరంగల్‌లోని వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. గిన్నిస్ బుక్ రికార్డులు సాధించే లక్ష్యంతో ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. హుస్సేన్‌సాగర్‌లో ఫ్లోటింగ్ బతుకమ్మ కార్యక్రమం ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పీపుల్స్ ప్లాజాలో మహిళా స్వయం సహాయక సంఘాలతో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఢిల్లీ, ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చే అన్ని విమానాలలో బతుకమ్మ వెల్కమ్ డ్యాన్స్ ప్రదర్శిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో విద్యార్థులంతా పాల్గొనేలా వేడుకలుంటాయని మంత్రి జూపల్లి వివరించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పూలతో దేవుడిని కొలిచే ఈ పండుగ ప్రపంచంలో మరెక్కడా లేని ప్రత్యేకత అని ఆమె చెప్పారు. బతుకమ్మ కేవలం ఒక పండుగ కాదని, ఇది తెలంగాణ ఆత్మగౌరవ వేడుక అని వివరించారు. మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండే, సమాజాన్ని, కుటుంబాలను కలిపే పండుగ అని తెలిపారు.
తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాల ప్రతీకగా, ప్రపంచ స్థాయి ఉత్సవంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు పర్యాటక శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళలందరూ కలిసి ఆటా పాటలతో జరుపుకునే గొప్ప పండుగ మన బతుకమ్మ అని చెప్పారు. ఈ పండుగ పువ్వులనే కాదు, చెరువులను కూడా పూజించే పండుగ అని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరు, భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు
కార్యక్రమాల వివరాలు:
సెప్టెంబర్ 21 – సెప్టెంబర్ 30 వరకు వేడుకలు: ఈవెంట్ సెప్టెంబర్ 21న వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి వద్ద ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 22 నుండి 24 వరకు, ప్రతి రోజు 3-4 జిల్లాల్లోని ముఖ్య ఆలయాలు, పర్యాటక, సాంస్కృతిక ప్రదేశాల్లో వేడుకలు ఉంటాయి.
హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాలు:
ట్యాంక్ బండ్ వద్ద సెప్టెంబర్ 27న – బతుకమ్మ కార్నివాల్ ఈవెనింగ్.
సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రయత్నం – 10,000 మంది కంటే ఎక్కువ మహిళలతో బతుకమ్మ ఆట.
సెప్టెంబర్ 29న – ఉత్తమ బతుకమ్మ పోటీ – పీపుల్స్ ప్లాజా వద్ద.
సెప్టెంబర్ 29న – ఐటీ రంగం ఉద్యోగులు, ఆర్‌డబ్ల్యూఏల పోటీ.
సెప్టెంబర్ 30న – ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోళి
ఇతర ప్రత్యేక కార్యక్రమాలు:
బతుకమ్మ సైకిల్ రైడ్ (సెప్టెంబర్ 28)
మహిళల బైకర్స్ రైడ్ (సెప్టెంబర్ 29)
వింటేజ్ కార్ ర్యాలీ (సెప్టెంబర్ 30)
సెప్టెంబర్ 25 నుండి 4 రోజుల పాటు మాదాపూర్‌లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ థీమ్‌తో ఆర్ట్ క్యాంప్.
హుస్సేన్ సాగర్‌లో బతుకమ్మ ఆకారంలో అలంకరించిన ఫ్లోట్స్.
ఢిల్లీ, ముంబై నుండి హైదరాబాద్‌కు వచ్చే అన్ని విమానాలలో బతుకమ్మ వెల్కమ్ డ్యాన్స్ (సెప్టెంబర్ 21 నుండి 30 వరకు).
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.