Kanaka Durga Temple : విజయవాడలో దసరా సందడి.. రెండో రోజు గాయత్రీ దేవిగా కనకదుర్గ
Kanaka Durga Temple :దసరా నవరాత్రులు అంటే అమ్మవారికి తొమ్మిది రూపాలలో పూజలు చేసే గొప్ప పండుగ. ఈ పండుగ మొదటి రోజు నుంచే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ పూలతో అర్చించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారు రెండో రోజు శ్రీ గాయత్రీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేదాలకు మూలమైన వేదమాత గాయత్రీ దేవిని ఈ రోజున భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయని నమ్మకం.

గాయత్రీ దేవి రూపం, పూజా విధానం
శ్రీ గాయత్రీ దేవి ఐదు ముఖాలతో, పది కళ్లతో, పది చేతులతో దర్శనమిస్తుంది. ఆమె చేతుల్లో శంఖం, చక్రం, గద, అంకుశం వంటి ఆయుధాలు ఉంటాయి. భూమి, ఆకాశం, సృష్టిని సూచించే ఐదు రంగుల కిరీటంతో (ముక్తా, హేమ, నీల, విద్రుమ, ధవళ వర్ణాలు) ఆమె ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ రూపం విశ్వంలోని సకల శక్తులకు ప్రతీక.
ఈ రోజున అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పించి, పసుపు రంగు పూలతో పూజించాలి. ప్రసాదంగా కొబ్బరి అన్నం, పులిహోర లేదా పాయసం నివేదించడం ఆనవాయితీ. ఈ పూజా విధానం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొంది, జీవితంలోని ఆటంకాలు తొలగిపోతాయని నమ్మకం.
ఇది కూడా చదవండి : Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
గాయత్రీ మంత్రం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు
గాయత్రీ మంత్రం వేదాలలోకెల్లా అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు.
మంత్రం: ‘ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి! ధియో యో నః ప్రచోదయాత్!!’ ఈ మఠం సూర్య భగవానుడిని ఉద్దేశించి చేసిన ప్రార్థన.
పఠన విధానం: తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో (సుమారు 4 గంటలకు) జపం చేయడం శ్రేష్ఠం. ఉత్తరం లేదా తూర్పు దిక్కున కూర్చొని శుచిగా, ఏకాగ్రతతో జపం చేయాలి.
మంత్ర పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు:
మానసిక ప్రశాంతత: ఒత్తిడి, ఆందోళన తగ్గి సంతోషం కలుగుతుంది.
జ్ఞాన వృద్ధి: జ్ఞానం, మేధస్సు, ఏకాగ్రత పెరుగుతాయి.
పాప పరిహారం: దుఃఖం, బాధలు, దారిద్ర్యం, పాపాలన్నీ తొలగిపోతాయి.
ఆధ్యాత్మిక వృద్ధి: ఆధ్యాత్మిక చింతన పెరిగి, మోక్ష మార్గం సుగమం అవుతుంది.
ఆరోగ్యం: శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇది కూడా చదవండి : 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
నవరాత్రుల మొదటి రోజు నుంచే కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ ఊహించని విధంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో మహిళలు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దసరా నవరాత్రులు 11 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ సమయంలో రూ.500 టికెట్లను రద్దు చేశారు. ప్రస్తుతం రూ.300, రూ.100 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మొదటి రోజున ఏకంగా 75,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ రోజున అమ్మవారిని దర్శిస్తే ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.