Tirumala : తిరుమలలో దీపావళి సందడి.. ఆరోజు కొన్ని ఆర్జిత సేవలు రద్దు
Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 20వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి సంవత్సరంలాగే, ఈసారి కూడా దీపావళి రోజున ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో ఈ ప్రత్యేక ఆస్థానం వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకలో భక్తులందరూ పాల్గొనవచ్చు.
ఆస్థానం జరిగే విధానం
దీపావళి ఆస్థానంలో భాగంగా, శ్రీ మలయప్ప స్వామివారు తమ దేవేరులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా ఘంటా మండపంలో కొలువుదీరుతారు. స్వామివారికి ఎడమ వైపున, దక్షిణ ముఖంగా మరో పీఠంపై సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు కూడా ఆసీనులవుతారు. ఆస్థానం సమయంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతి మరియు నైవేద్య సమర్పణ చేస్తారు.

ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
రద్దయిన ఆర్జిత సేవలు
దీపావళి ఆస్థానం కారణంగా ఆ రోజున (అక్టోబర్ 20) తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేసింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే, తోమాల, అర్చన సేవలు మాత్రం భక్తులకు అవకాశం లేకుండా ఏకాంతంగా నిర్వహిస్తారు.
సాయంత్రం సహస్ర దీపాలంకరణ
దీపావళి పండుగ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొంటారు. ఈ సేవ పూర్తయిన తర్వాత స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు ఈ వీధి ఉత్సవాన్ని వీక్షించవచ్చు.
ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ బాగా కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, భక్తులు శిలా తోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. శీఘ్ర దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు 4 గంటలు సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన వారికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 71,634 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.74 కోట్లుగా నమోదైంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.