Ammapalli Temple: హైదరాబాద్లో మినీ తిరుపతి .. ఈ గుడికి వెళ్తే కోరిన కోరికలు తీరుతాయట!
Ammapalli Temple:హైదరాబాద్కు దగ్గర్లో ఉన్న చారిత్రక ప్రదేశాలలో అమ్మాపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం ఒకటి. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల భక్తులను కూడా విశేషంగా ఆకర్షిస్తుంది. శంషాబాద్ మండలం, నర్కూడ సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో వెంగి చాళుక్యులు నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. సీతమ్మ నివాస స్థానం కావడంతో అమ్మాపల్లి అనే పేరు వచ్చిందని అంటారు. ఇక్కడ కొలువైన కల్యాణ రాముడు భక్తుల కోరికలను తీరుస్తాడని ప్రతీతి.
ఆలయ విశిష్టతలు..
రాజగోపురం: ఈ ఆలయం ప్రధాన ఆకర్షణ 30 అడుగుల ఎత్తైన రాజగోపురం. దీనితో పాటు, ఆలయ ప్రాంగణంలో రెండు కోనేరులు ఉన్నాయి. గతంలో రాజులు ఒక కోనేరులో స్నానం చేసేవారని, మరొకటి శ్రీరాముని చక్ర తీర్థంగా ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది.

ముఖ్యమండపం: ఇక్కడ కూర్మం ఉండటం భక్తులకు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ కూర్మాన్ని దర్శించుకోవడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ప్రధాన విగ్రహాలు: గర్భగుడిలో సీత, రామ, లక్ష్మణ సమేత శ్రీరాముడు కొలువై ఉన్నారు. ముఖమండపంలో హనుమంతుడు, గరుత్మంతుడు కూడా దర్శనమిస్తారు.
కళ్యాణ రాముడు: అమ్మాపల్లిలో కొలువైన శ్రీ కోదండ రాముడు కల్యాణ రాముడిగా ప్రసిద్ధి చెందాడు. ఇక్కడ కొలువైన దేవుడు వివాహం, సంతానం వంటి కోరికలను తీరుస్తాడని భక్తులు నమ్ముతారు.
పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలు..
ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, శివరాత్రి పండుగలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా, శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. నార్కట్పల్లి నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయానికి తీసుకువచ్చి, ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో సీతారాముల కళ్యాణం జరుపుతారు. ఈ వేడుకను చూడటానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
ఆలయానికి ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి: హైదరాబాద్ నగరం నుండి మెహదీపట్నం మీదుగా శంషాబాద్ బేగంపేట జంక్షన్ వద్దకు చేరుకొని, కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆలయం చేరుకోవచ్చు.
ఔటర్ రింగ్ రోడ్ మీదుగా: ఔటర్ రింగ్ రోడ్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్లి, శంషాబాద్ టౌన్ వైపు వెళ్లి, బస్ స్టాప్ జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగితే, ప్రధాన రహదారికి సమీపంలోనే ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం హైదరాబాద్ నగరం నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో, శంషాబాద్ బస్ స్టాప్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సినిమా షూటింగులకు నిలయం..
ఈ ఆలయం దాని అందమైన నిర్మాణ శైలి కారణంగా సినిమా షూటింగ్లకు కూడా ప్రసిద్ధి చెందింది. అనేక తెలుగు చిత్రాలలో ఈ ఆలయం సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.