Travel Tips 22 : కొత్త ప్రదేశాలకు వెళ్తున్నారా? ఈ ట్రావెల్ టిప్స్ పాటిస్తే మోసపోకుండా ఉంటారు
Travel Tips 22 : కొత్త నగరాలు, ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ, తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ప్రయాణికులు మోసగాళ్ల బారిన సులభంగా పడతారు. కొద్దిపాటి అవగాహనతో ఒత్తిడి, డబ్బు నష్టం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ వార్తలో పర్యాటకులు ఎదుర్కొనే కొన్ని ప్రధాన మోసాలు, వాటిని ఎలా నివారించవచ్చో వివరంగా తెలుసుకుందాం.
టాక్సీ. ఆటో ఛార్జీల మోసాలు
కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ప్రయాణికులు తరచుగా టాక్సీ, ఆటో డ్రైవర్ల మోసాలకు గురవుతుంటారు. డ్రైవర్లు మీటర్లను ఉపయోగించడానికి నిరాకరించడం, ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం లేదా కావాలనే లాంగ్ రూట్లలో తీసుకెళ్లి డబ్బులు లాగుతారు. దీనిని నివారించడానికి ఎల్లప్పుడూ రైడ్ యాప్స్ (ఉదాహరణకు, ఉబర్, ఓలా) ఉపయోగించండి. ఒకవేళ మీరు ఆటో లేదా టాక్సీలో వెళ్ళాల్సి వస్తే, ప్రయాణం ప్రారంభించడానికి ముందే ఛార్జీలను క్లియర్‌గా అడగండి. వీలైతే మీటర్ వేయమని పట్టుబట్టండి. అలాగే, మీ గమ్యస్థానానికి వెళ్లే మార్గాన్ని గూగుల్ మ్యాప్స్‌లో చూసుకోవడం వల్ల డ్రైవర్లు మిమ్మల్ని తప్పుదారి పట్టించకుండా ఉంటారు.

మూసివేశారని మోసం చేస్తారు
కొన్ని ప్రదేశాలలో, కొందరు మోసగాళ్లు పర్యాటకుల దగ్గరికి వచ్చి, వారు వెళ్లాలనుకుంటున్న ఆలయం, మ్యూజియం లేదా షాప్ మూసేశారని అబద్ధం చెబుతారు. ఆ తర్వాత వారిని తమ స్నేహితుల దుకాణానికి లేదా ఇతర అనవసరమైన ప్రదేశాలకు దారి మళ్లిస్తారు. దీనివల్ల పర్యాటకుల సమయం వృథా అవడంతో పాటు, ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ మోసాన్ని నివారించడానికి, మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశం లేదా ఆలయం టైమింగ్స్‌ను అధికారిక వెబ్సైట్లో లేదా గూగుల్ ద్వారా ముందుగానే తెలుసుకోండి. అధికారిక ప్రవేశ ద్వారం వద్ద కూడా ఒకసారి విచారించడం మంచిది.
ఫోటోలు, దానాల ఉచ్చు
కొందరు మోసగాళ్లు పర్యాటకుల దగ్గరికి వచ్చి, జంతువులతో, విగ్రహాలతో లేదా సాంస్కృతిక వస్తువులతో ఫోటోలు తీసుకోవడానికి సహాయం చేస్తామని చెబుతారు. ఫోటో తీసుకున్న తర్వాత, దానికి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో మీకు ఆసక్తి లేకపోతే, మర్యాదగా తిరస్కరించండి. చాలామంది మోసగాళ్లు తమను గురువులుగా లేదా ఆధ్యాత్మిక వ్యక్తులుగా చెప్పుకొని, దానాలు ఇవ్వమని ఒత్తిడి చేస్తారు. ఇలాంటివారిని నమ్మకుండా జాగ్రత్త వహించండి.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
నకిలీ గైడ్స్, టూర్స్
కొంతమంది అపరిచితులు మీ దగ్గరకు వచ్చి లోకల్ గైడ్స్ అని చెప్పి.. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. వీరు మీకు సరైన సమాచారం ఇవ్వకపోవచ్చు. మిమ్మల్ని మోసం చేయవచ్చు. దీనిని నివారించడానికి, నమ్మకమైన ట్రావెల్ ఏజెన్సీల ద్వారా లేదా అధికారిక కౌంటర్ల ద్వారా మాత్రమే గైడ్స్, టూర్స్‌ను బుక్ చేసుకోండి. ముందుగానే ఆన్లైన్లో వారి రేటింగ్‌లు, రివ్యూలు చూడటం వల్ల మీరు మోసపోకుండా ఉంటారు.
రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలు
పండుగలు, ఆలయాలు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాలలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ప్రాంతాలలో మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. మీ విలువైన వస్తువులను ముందు జేబులో లేదా సురక్షితమైన ట్రావెల్ పౌచ్‌లో ఉంచుకోండి. బ్యాగులను వెనుక కాకుండా ముందు వైపు పెట్టుకోవడం సురక్షితం.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
షాపింగ్ మోసాలు
పర్యాటకులకు తరచుగా చౌకైన వస్తువులను నిజమైన హస్తకళలు అని చెప్పి అమ్ముతుంటారు. దీనిని నివారించడానికి, వస్తువులను కొనుగోలు చేయడానికి ముందు ధరలను పోల్చి చూడండి. ఆన్లైన్ రివ్యూలను తనిఖీ చేయండి. మీరు కచ్చితంగా కొనుగోలు చేయాలనుకుంటే, నమ్మకమైన దుకాణాలలోనే కొనుగోలు చేయడం మంచిది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.