ఎవరెస్ట్ కన్నా చిన్నవే… కానీ ఈ 5 పర్వతాలను అధిరోహించలేరు! | Forbidden Mountains
Forbidden Mountains గురించి తెలుసుకుందాం. ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తున్నా అధిరోహణకు నిషేధం ఉన్న కైలాసం, కాంచనజంగా, నందాదేవి, గంఖర్ పుయెన్సమ్, మచ్ఛపుచ్ఛరే పర్వతాల కథ ఇదే.
పర్వతారోహణ అంటేనే సాహసం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని మనిషి అధిరోహించాడు. మరి ఎవరెస్ట్‌ను ఎక్కిన పర్వతారోహకులు ప్రపంచంలోని తమకు నచ్చిన ప్రతీ శిఖరాన్ని అధిరోహించగలడా ?…ఆన్సర్ వచ్చేసి నో..ప్రతీ పర్వతాన్ని ఎక్కడం అనేది సాధ్యం కాదు.
ప్రపంచంలో కొన్ని పర్వతాలు ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ వాటి శిఖరాలను అధిరోహించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇందులో కొన్ని పర్వతాలపై కాలు పెట్టడం నిషేధించారు.
ఇందులో కొన్ని పర్వతాలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. మరికొన్ని పర్వతాలను పర్యావరణ పరిరక్షణ కోసం రక్షించేందుకు నియమాలు పెట్టారు.
ఇంకొన్ని చోట్ల ప్రభుత్వ నిబంధనలే పర్వతారోహణకు అడ్డుగా నిలుస్తున్నాయి.
అయితే ఈ జాబితాలో ఉన్న ప్రతి పర్వతం ఎవరూ ఎక్కని పర్వతంచకాదు. ఉదాహరణకు ప్రపంచంలో మూడో ఎత్తైన కాంచెంజంగా శిఖరాన్ని 1955లో తొలిసారిగా అధిరోహించారు.
నేపాల్ వైపు నుంచి ఆ తర్వాత కూడా అనేక అధిరోహణలు జరిగాయి. కానీ సిక్కిం వైపు నుంచి శిఖరారోహణకు నిషేధం ఉంది. అంటే పర్వతం ఎత్తు కంటే… దాని వెనుక ఉన్న విశ్వాసాలు, ప్రకృతి, ప్రభుత్వ నిబంధనలే కొన్ని శిఖరాలను ప్రత్యేకంగా మార్చాయి.
అలాంటి ఐదు పర్వతాల కథ ఇది.
1. కైలాస పర్వతం (Mount Kailash)
దేవుని నివాసంగా భావించే శిఖరం
టిబెట్‌లోని కైలాస పర్వతం ఎత్తు సుమారు 6,638 మీటర్లు. అంటే 8,849 మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్ కంటే ఇది చాలా తక్కువ. అయితే కైలాసం ప్రత్యేకత దాని ఎత్తులో లేదు. దాని ఆధ్యాత్మిక ప్రాధాన్యతలో ఉంది.
హిందువులు కైలాసాన్ని పరమశివుడి నివాసంగా భావిస్తారు. బౌద్ధులు, జైనులు, బాన్ సంప్రదాయాల్లో కూడా ఈ పర్వతానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. కైలాసం చుట్టూ పరిక్రమ చేయడానికి యాత్రికులు వెళ్తారు. కానీ పర్వత శిఖరాన్ని అధిరోహించడం మాత్రం అనుమతించరు.
కైలాస శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినట్టు విశ్వసనీయమైన నమోదు కూడా లేదు. అందుకే ప్రపంచంలోని ఎన్నో ఎత్తైన శిఖరాలు పర్వతారోహకులను ఆకర్షిస్తుంటే… కైలాసం మాత్రం భిన్నంగా నిలిచింది.
ఇక్కడ లక్ష్యం శిఖరాన్ని జయించడం కాదు. దూరం నుంచి దర్శించి, దాని పవిత్రతను గౌరవించడం.
- ఇది కూడా చదవండి : Malana Village Mystery : హిమాలయాల్లో ఒక రహస్య గ్రామం..
2. కాంచెంజంగా (Kangchenjunga)
ఎక్కారు… కానీ సిక్కిం వైపు నుంచి ఎక్కలేరు
భారత్-నేపాల్ సరిహద్దులో ఉన్న కాంచెంజంగా ప్రపంచంలో మూడో ఎత్తైన పర్వతం. దీని ఎత్తు 8,586 మీటర్లు. కాంచెంజంగాను ఎవరూ అధిరోహించని పర్వతం అనుకోవద్దు.
1955 మే 25న జో బ్రౌన్, జార్జ్ బ్యాండ్ తొలిసారిగా కాంచెంజంగా శిఖరాన్ని అధిరోహించారు. ఆ తర్వాత నేపాల్ వైపు నుంచి అనేక పర్వతారోహణలు జరిగాయి.
అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. కాంచెంజంగా సిక్కిం వైపు నుంచి శిఖరారోహణకు అనుమతి లేదు. సిక్కిం ప్రజల సంప్రదాయాల్లో కాంచెంజంగాకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. స్థానిక విశ్వాసాల్లో ఇది రక్షక దేవతతో అనుబంధం కలిగిన పవిత్ర పర్వతంగా భావిస్తారు.
అందుకే ఒకే పర్వతం… ఒక వైపు నుంచి అధిరోహించబడుతుండగా, మరో వైపు నుంచి మాత్రం పవిత్రమైన శిఖరంగా గౌరవించబడుతోంది.ఇదే కాంచెంజంగా ప్రత్యేకత.
3. నందాదేవి (Nanda Devi)
ప్రకృతిని కాపాడేందుకు నిషేధం
ఉత్తరాఖండ్‌లోని నందాదేవి శిఖరం సుమారు 7,816 మీటర్ల ఎత్తులో ఉంటుంది. హిమాలయాల్లోని అత్యంత ముఖ్యమైన పర్వతాల్లో ఇది ఒకటి. నందాదేవిని స్థానిక సంప్రదాయాల్లో దేవతా స్వరూపంగా భావిస్తారు.
ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు అపారమైన పర్యావరణ ప్రాధాన్యత ఉంది. గతంలో నందాదేవి ప్రాంతంలో పర్వతారోహణ కార్యకలాపాలు పెరగడంతో చెత్త పేరుకుపోవడం, సహజ పర్యావరణానికి నష్టం కలగడం వంటి సమస్యలు ఎదురయ్యాయి.
దీంతో 1983 నుంచి నందాదేవి నేషనల్ పార్క్‌లో (Nandadevi National Park) పర్వతారోహణ, సాహస కార్యకలాపాలపై నిషేధం విధించారు. పర్యావరణాన్ని కాపాడటమే దీనిలో ప్రధాన ఉద్దేశం.
అంటే నందాదేవి విషయంలో మత విశ్వాసంతో పాటు ప్రకృతి పరిరక్షణ కూడా ముఖ్యమైన అంశం. ప్రతి శిఖరాన్ని అధిరోహించడం కంటే… కొన్ని శిఖరాలను అలాగే కాపాడటం కూడా అవసరమేనని నందాదేవి చెబుతోంది.
4. గంఖర్ పుయెన్సమ్ (Gangkhar Puensum)
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అధిరోహించని శిఖరం
భూటాన్, టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న గంఖర్ పుయెన్సమ్ ఎత్తు సుమారు 7,570 మీటర్లు. ఎవరెస్ట్ కంటే ఇది దాదాపు 1,300 మీటర్లు తక్కువ. అయినా ఇప్పటివరకు ఈ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించలేదు.
అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అధిరోహించని పర్వతంగా ప్రసిద్ధి చెందింది. దీనికి కారణం ఈ పర్వతాన్ని అధిరోహించడం కష్టం అని మాత్రమే కాదు.
నిజానికి భూటాన్‌లోని పర్వతాలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. 1994లో 6,000 మీటర్లకు పైబడిన పర్వతాలపై అధిరోహణకు నిషేధం విధించారు. 2003 నుంచి భూటాన్‌లో పర్వతారోహణపై మరింత కఠినమైన నిషేధం అమల్లోకి వచ్చింది.
దీంతో గంఖర్ పుయెన్సమ్ ఇప్పటికీ మనిషి అధిరోహించని అత్యంత ఎత్తైన శిఖరంగా నిలిచింది. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను జయించాలనే లక్ష్యంతో పర్వతారోహకులు ముందుకు వెళ్తుంటే… భూటాన్ మాత్రం తన పవిత్ర పర్వతాలను అధిరోహణ నుంచి దూరంగా ఉంచింది.
5. మచ్ఛపుచ్ఛరే (Machapuchare)
చేప తోకలా కనిపించే పవిత్ర పర్వతం
నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వత శ్రేణిలో ఉన్న మచ్ఛపుచ్ఛరే మరో అద్భుతమైన శిఖరం. దీని ఎత్తు సుమారు 6,993 మీటర్లు. పర్వతం పైభాగం రెండు కొమ్ముల్లా విడిపోయి చేప తోకను పోలి కనిపిస్తుంది. అందుకే దీనికి మచ్ఛపుచ్ఛరే అనే పేరు వచ్చింది.
- ఇది కూడా చదవండి : Rann Of Kutch : సూర్యకాంతిలో మెరిసిపోయే తెల్ల ఎడారి
స్థానిక గురుంగ్ సంప్రదాయాల్లో ఈ పర్వతానికి పవిత్రమైన స్థానం ఉంది. శివుడితో దీనికి ఆధ్యాత్మిక అనుబంధం ఉందనే స్థానిక విశ్వాసాలు కూడా ఉన్నాయి. 1950లలో ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ శిఖరాన్ని పూర్తిగా అధిరోహించలేదు.
ఆ తర్వాత నేపాల్ ప్రభుత్వం ఈ పర్వతాన్ని పవిత్రమైనదిగా పరిగణించి పర్వతారోహణకు అనుమతి ఇవ్వలేదు. అందుకే మచ్ఛపుచ్ఛరే నేటికీ పూర్తిగా అధిరోహించని అందమైన హిమాలయ శిఖరంగా నిలిచింది.
ప్రతి పర్వతాన్ని జయించాల్సిన అవసరం ఉందా?
ఈ ఐదు పర్వతాల కథలను చూస్తే ఒక విషయం అర్థమవుతుంది.మనిషి ప్రపంచంలోని ఎన్నో ఎత్తైన శిఖరాలను అధిరోహించాడు. కానీ ప్రతి పర్వతాన్ని జయించాల్సిన అవసరం లేదని ఈ పర్వతాలు గుర్తు చేస్తున్నాయి.
కైలాసం విశ్వాసానికి ప్రతీక.
కాంచెంజంగా స్థానిక సంప్రదాయాలకు ఉన్న గౌరవానికి ఉదాహరణ.
నందాదేవి ప్రకృతి పరిరక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుంది.
గంఖర్ పుయెన్సమ్ ఒక దేశం తన పర్వతాలను అధిరోహణ నుంచి రక్షించిన ప్రత్యేక ఉదాహరణ.
మచ్ఛపుచ్ఛరే ప్రకృతి అందాన్ని దూరం నుంచే ఆస్వాదించాల్సిన పవిత్ర శిఖరంగా నిలిచింది.
పర్వతారోహకుడికి శిఖరాన్ని చేరుకోవడం ఒక లక్ష్యం కావచ్చు. కానీ కొన్ని పర్వతాల విషయంలో స్థానిక విశ్వాసాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ నిబంధనలను గౌరవించడం కూడా ఆ పర్వతాల ప్రత్యేకతలో భాగమే.
ఎందుకంటే ప్రతి పర్వతం మనిషి జయించడానికి పుట్టలేదు. కొన్ని పర్వతాలు… మనిషి దూరం నుంచి చూసి, వాటి విశ్వాసాలను గౌరవించి, ప్రకృతిని కాపాడుతూ ఉండటానికే.
