గరుడధ్వజం ఎగిరింది.. తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు |Srivari Brahmotsavam 2026
Srivari Brahmotsavam 2026 : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6.21 గంటల నుంచి 6.35 గంటల మధ్య మీన లగ్నంలో నిర్వహించిన ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదపఠనం, మంగళవాయిద్యాల నడుమ అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలు, అష్టదిక్పాలకులను ఆహ్వానించే సంప్రదాయంలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
- ఇది కూడా చదవండి : తిరుమల బ్రహ్మోత్సవాలు 2026 – దర్శనం తర్వాత ఎక్కడికి వెళ్లాలి?
ధ్వజారోహణకు ముందు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి స్వామివారిని బంగారు తిరుచ్చిపై ఊరేగించారు. ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధుల్లో ఈ ఊరేగింపు నిర్వహించారు. ధ్వజపటాన్ని కూడా ఈ ఊరేగింపులో భాగంగా తీసుకెళ్లారు.
ధ్వజారోహణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో రానున్న రోజుల్లో స్వామివారికి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు. దీంతో తిరుమలలో బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక సందడి ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్దజీయర్, శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, కంకణ బట్టర్ వెంకట రాఘవ దీక్షితులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, భాను ప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
▶️ వీడియో చూడండి : భారత దేశంలో మొదటి గ్రామం
