Neelakurinji :12 ఏళ్ల నిరీక్షణను 12 సెకన్ల రీల్ కోసం నాశనం చేశారు – నీలకురింజి పూలు కోసిన ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు
Neelakurinji : 12 ఏళ్లకు ఒకసారి పూసే నీలకురింజి పూలను కోసి సోషల్ మీడియాలో వీడియోలు చేసిన ఇద్దరు యువకులపై మున్నార్ అటవీ శాఖ కేసు నమోదు చేసింది.
మున్నార్ కొండలు నీలం రంగులోకి మారాయి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ అద్భుతాన్ని చూడటానికి వేల మంది వెళుతున్నారు. కానీ కొందరు దాన్ని ఇన్స్టాగ్రామ్ లైకుల కోసం తుంచేస్తున్నారు.
అసలు ఏం జరిగింది?
సెప్టెంబర్ 5, 2026 న మున్నార్ అటవీ శాఖ ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసింది.చోక్రముడి, చిన్నకనల్, కొరందక్కాడ్ పర్వతాల్లో పూసే నీలకురింజి పూలను వారు పీకేసి, చేతిలో పట్టుకుని, తలపై కిరీటంలా పెట్టుకుని ఫోటోలు, వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలే ఇప్పుడు వారిని లీగల్ ఇష్యూస్‌లోకి నెట్టేసింది.ః
- ఇది కూడా చదవండి : Tbilisi : పురాతన వీధుల నుంచి నైట్ లైట్స్ వరకు మర్చిపోలేని యూరోప్ అనుభవం
మున్నార్ డిఎఫ్ఓ అభయ్ యాదవ్ ఆదేశాలతో దేవికులం, మున్నార్ ఫారెస్ట్ రేంజ్లో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ యువకులను గుర్తించే పనిలో ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.
నీలకురింజి అంటే మామూలు పువ్వు కాదు..
2023లో భారత ప్రభుత్వం నీలకురింజి మొక్కను వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 – షెడ్యూల్ III లో చేర్చింది. దీని ప్రకారం ఈ వూవులను కోయడం లేదా మొక్కను పీకేయడం, నాశనం చేయడం, ఇంట్లో పెంచడం, దగ్గర ఉంచుకోవడం కూడా నేరం.
ఇందులో ఏ పని చేసినా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25,000 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
WATCH-
— ANJALI ANKAD (@anjali_ankad) September 7, 2026
Rare #Neelakurinji Flowers Blanket #Munnar Hills After 12 Years #Kerala pic.twitter.com/ic6g7QKd21
విషయం సీరియస్ ఎందుకు అయింది ?
ఫస్ట్ థింగ్..నీలగిరి పర్వతాలకు ఈ పేరు నీలకురింజి పువ్వుల వల్లే వచ్చింది అంటారు. దీంతో పాటు వృక్ష శాస్త్రవేత్త జోమీ అగస్టిన్ ప్రకారం నీలకురింజి 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే పూస్తుంది. పూవులు పూసిన తర్వాత ఆ మొక్క చనిపోతుంది.
ఆ పూల నుండి రాలిన విత్తనాలే 12 ఏళ్ల తర్వాత మళ్లీ మొక్కలుగా మొలుస్తాయి. ఈ ప్రక్రియ పూర్తి అవ్వాలి అంటే ఎన్నో అంశాలు సహకరించాలి, దాంతో పాటు 12 ఏళ్లు వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది.
ఈ రోజు ఒక పువ్వును తుంచేస్తే, 2038లో రావాల్సిన పువ్వును చంపేసినట్లే కదా. అందుకే ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకున్నారు.
రీల్ కోసం ప్రకృతిని చంపవద్దు
మున్నార్‌లో ఇప్పుడు మెట్టుకురింజి పూలు కూడా పూస్తున్నాయి. చాలా మంది దాన్ని నీలకురింజి అనుకుని పీకుతున్నారు. పర్యాటకులు ఎవరూ పూలను తాకవద్దని, నాశనం చేయవద్దని అటవీ శాఖ హెచ్చరించింది.
నేను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార అయిన హేమ్ కుండ్ సాహిబ్ వెళ్లినప్పుడు అక్కడ అరుదైన బ్రహ్మ కమలాన్ని చూశాను. నాతో పాటు చాలా మంది వాటిని చూడటానికి వచ్చారు. అయితే ఎవరూ కూడా వాటిని పీకే ప్రయత్నం చేయలేదు. కేవలం వాటి సహజత్వాన్ని, గొప్పదనాన్ని ఫీలవ్వడానికి కొద్ది సేపు బ్రహ్మకమలం తోటలో కూర్చుని వీడియోలు ఫోటోలు తీశాను. వాటిని అంత దగ్గరగా చూడటమే లక్ అని హ్యాప్పీగా ఫీల్ అయ్యి టచ్ చేయకుండా వచ్చేశాను.
మీరు మున్నార్ కానీ ఇతర అరుదై పువ్వులు ఉండే ప్రదేశానికి వెళ్తే..
- 1. వాటిని చూసి తరించండి….కానీ టచ్ చేయవద్దు.
- 2. వాటిని తుంచి కిరీటాలు, బొకేల్లాంటివి చేయడం కరెక్టు కాదు.
- 3. అలాగే ఎవరైనా పీకుతుంటే వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్‌కు చెప్పండి.
- 12 ఏళ్లు ఓపిక పట్టిన ప్రకృతికి 12 లైకుల కంటే ఎక్కువ విలువ ఇద్దాం.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
