Hare Krishna Golden Temple : కార్తీక దీపోత్సవంతో వెలిగిన దేవాలయం.. గోవర్ధనగిరి లీలలను తలచుకున్న భక్తులు
Hare Krishna Golden Temple : హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. బుధవారం (అక్టోబర్ 22, 2025) నాడు గోవర్ధన పూజ, కార్తీక దీపోత్సవ వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భజనలు, కీర్తనలు, దీపాల కాంతులతో దేవాలయం మొత్తం ఉత్సాహభరితమైన వాతావరణంలో నిండిపోయింది. ఈ అపురూప వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ వేడుకల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్భుతమైన గోవర్ధన పర్వత నమూనా భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. పర్వతం చుట్టూ అలంకరణలు, లైట్ల వెలుగులు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. స్వామివారికి 56 రకాల రుచికరమైన ఫలహారాలు, మిఠాయిలు, వంటకాలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలతో కూడిన భారీ అన్నకూట సమర్పణ చేశారు. భక్తితో నివేదించిన ఈ నైవేద్యాలు చూడముచ్చటగా ఉన్నాయి.

ఉదయం కార్యక్రమాలు ఆలయం గోశాలలో గోపూజతో మొదలయ్యాయి. ఆవులు, దూడలకు శ్రీకృష్ణ ప్రసాదాన్ని ప్రేమతో సమర్పించారు. మధ్యాహ్నం గోవర్ధన పర్వత నమూనాను ఆవిష్కరించారు. ఆ తర్వాత అన్నకూట మహోత్సవంలో భాగంగా అనేక రకాల నైవేద్యాలు సమర్పించి, భక్తులందరూ గోవర్ధన పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సాయంత్రం వేళ ఆలయంలో భక్తి కీర్తనలు, పల్లకి ఉత్సవం, దేవుడికి ఆరతులు మహోత్సవంగా జరిగాయి. ఈ దృశ్యాలు భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలను నింపాయి.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు

హరేకృష్ణ మూవ్మెంట్, హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ సత్య గౌర చంద్రదాస ప్రభూజీ ఈ సందర్భంగా గోవర్ధన లీలల గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి ప్రసంగించారు. ఇంద్రుడి ఆగ్రహం నుంచి బృందావన ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన సంఘటన, భక్తుల పట్ల భగవంతుడికి ఉన్న అపారమైన కరుణకు గొప్ప ఉదాహరణ అని ఆయన వివరించారు. గోవర్ధనగిరిని ఆరాధించిన వారికి ఆరోగ్యం, సంపద, శాంతి, శ్రేయస్సు తప్పక లభిస్తాయని ప్రభూజీ అన్నారు. కులం, మతం, వర్ణం, ప్రాంతం, దేశం వంటి భేదాలు లేకుండా, భక్తితో హరినామ సంకీర్తన చేయడం ద్వారా కృష్ణుడి దివ్యకరుణ అందరికీ అందుతుందని ప్రభూజీ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు

కార్తీక దీపోత్సవంలో భాగంగా భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాన్ని వెలిగించారు. యశోదా దామోదరునికి దామోదర ఆరతిని సమర్పించారు. దామోదరాష్టకం శ్లోకాలతో ఆలయ వాతావరణం మొత్తం భక్తిమయంగా మారిపోయింది. ప్రతి భక్తుడికి నెయ్యితో దీపారాధన చేసే అద్భుతమైన అవకాశం కల్పించారు. అనంతరం భగవాన్ శ్రీకృష్ణుడి గోవర్ధన లీలలను వివరించే ప్రత్యేక వీడియో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇది భక్తులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. చివరగా, హాజరైన భక్తులందరికీ రుచికరమైన అన్నకూట ప్రసాదాన్ని వడ్డించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.