Holiday Loans : కార్ లోన్, హోమ్ లోన్ కాదు… ఇప్పుడు ట్రెండ్ అంతా హాలిడే లోన్దే
Holiday Loans : పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ, ఇప్పుడు ట్రావెల్ లోన్ లేదా హాలిడే లోన్ అనేది కొత్త ట్రెండ్‌గా మారుతోంది. పండుగల సీజన్ మొదలైంది. వరుస సెలవులు ఉండటం వల్ల చాలా మంది టూర్లు, ట్రిప్‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరగడం, ఆకర్షణీయమైన ట్రావెల్ ప్యాకేజీలు, ఈజీ ఫైనాన్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో… చాలా మంది సెలవుల కోసం కూడా అప్పులు తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
2025లో పైసాబజార్ నిర్వహించిన కన్స్యూమర్ ఇన్సైట్స్ సర్వే ప్రకారం.. భారతీయులు ఇప్పుడు ప్రయాణాల కోసం క్రెడిట్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 27 శాతం మంది సెలవుల ఖర్చుల కోసం పర్సనల్ లోన్ తీసుకున్నట్లు వెల్లడించారు. అంటే, విలాసవంతమైన ప్రయాణాల కోసం కూడా అప్పులు తీసుకోవడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా 30ల నుంచి 40ల వయస్సు వారు 47 శాతం వాటాతో ఈ ట్రెండ్‌లో ముందున్నారు. ఇక 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సున్న జెన్-జడ్ లో కూడా లోన్ తీసుకునే వారి సంఖ్య 2023లో 14 శాతం ఉండగా, 2025 నాటికి అది 29 శాతానికి పెరిగింది.

తీసుకునే లోన్ మొత్తాలలో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 2023లో మొత్తం హాలిడే లోన్లలో రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మధ్య లోన్లు కేవలం 13 శాతం మాత్రమే ఉండగా, 2025లో ఇది 30 శాతానికి చేరుకుంది. అంటే, చిన్న మొత్తాలకే కాకుండా, భారీ ట్రిప్‌ల కోసం కూడా ప్రజలు అప్పులు తీసుకుంటున్నారని అర్థమవుతోంది. అలాగే, రూ.50,000 నుంచి రూ.లక్ష మధ్య తీసుకునే లోన్లు 12 శాతం నుంచి 20 శాతానికి, రూ.50,000 కంటే తక్కువ లోన్లు 2 శాతం నుంచి 15 శాతానికి పెరిగాయి. ఈ లోన్లు ఎక్కువగా స్థిరమైన జీతాలు, క్రెడిట్ సదుపాయం ఉన్న ప్రైవేట్ ఉద్యోగులే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక సలహాదారులు మాత్రం ఈ హాలిడే లోన్లపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాలిడే లోన్లు సాధారణంగా పర్సనల్ లోన్ రూపంలో ఉంటాయి కాబట్టి, వాటి వడ్డీ రేట్లు 10 శాతం నుంచి 20 శాతం వరకు ఉంటాయి. ఉదాహరణకు, మీరు రూ.లక్ష లోన్ తీసుకుంటే, 15 శాతం వడ్డీతో మూడేళ్లలో సుమారు రూ.1.3 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇప్పటికే హోమ్ లోన్ లేదా కారు లోన్ వంటి ఇతర ఈఎంఐలు చెల్లిస్తుంటే, ఈ కొత్త హాలిడే లోన్ మీ నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, కుటుంబాలు పెన్షన్, పిల్లల విద్య, ఆరోగ్యం వంటి అత్యవసర అవసరాల కోసం దాచుకున్న డబ్బును, ఈ లోన్ల ఈఎంఐల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
హాలిడే లోన్ తీసుకోవడం వలన తాత్కాలిక సంతోషం లభించినా, దీర్ఘకాలంలో ఇది ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. లోన్ ఈఎంఐ చెల్లించడంలో ఆలస్యం జరిగితే, అది మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. భవిష్యత్తులో మీకు అత్యవసర పరిస్థితుల్లో లోన్ దొరకకపోవచ్చు లేదా అధిక వడ్డీకి తీసుకోవాల్సి రావొచ్చు. కాబట్టి, అప్పు చేయకుండా హాలిడే బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. నెలకు రూ.10,000 వంటి చిన్న మొత్తాన్ని క్రమంగా పొదుపు చేసుకుంటే, ఒక సంవత్సరం తర్వాత మీకు రూ.1.2 లక్షలు సమకూరుతాయి. ఈ డబ్బుతో దేశీయంగా లేదా సరిగ్గా ప్లాన్ చేస్తే అంతర్జాతీయంగా కూడా ట్రిప్‌కు వెళ్లవచ్చు. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు లేదా రెగ్యులర్ డిపాజిట్ల ద్వారా కూడా పెట్టుబడి పెట్టి, లాభాలతో పాటు ప్రయాణం చేయవచ్చు.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
హాలిడే కోసం లోన్ తీసుకోవడం అనేది క్రమంగా మిమ్మల్ని ఆర్థికంగా బలహీనపరుస్తుంది. ఇలా విలాసవంతమైన ఖర్చుల కోసం అప్పులపై ఆధారపడటం అలవాటుగా మారితే, భవిష్యత్తులో ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చు. కాబట్టి, ట్రిప్ కన్నా ముందు మనం ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుల ఊబిలో పడకుండా, సొంత డబ్బుతో, చిన్న ట్రిప్ అయినా ప్లాన్ చేసుకోవడం మీ ఆర్థిక ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.