Mahabubnagar : భక్తుల కొంగుబంగారం మన్యంకొండ ఆలయం.. తెలంగాణ తిరుపతిగా ఎలా ప్రసిద్ధి చెందిందంటే ?
Mahabubnagar : మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. దీన్ని కలియుగ వైకుంఠంగా, తెలంగాణ తిరుపతిగా భక్తులు భావిస్తారు. డబ్బులు లేని వాళ్లు తిరుపతి వెళ్లలేకపోతే, మన్యంకొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే, తిరుపతికి వెళ్లినంత పుణ్యం వస్తుందని నమ్ముతారు. తిరుపతిలో ఉన్నట్టే, ఇక్కడ కూడా స్వామివారు కొండపైన, అలమేలు మంగతాయారు అమ్మవారు కింద కొండపై ఉంటారు. ఈ గుడి దగ్గర పూర్వం మునులు తపస్సు చేశారట, అందుకే ఈ ప్రాంతానికి మునులకొండ అని పేరు వచ్చిందని తర్వాత అది మన్యంకొండగా మారిందని చెబుతారు. మహబూబ్నగర్ నుంచి 17 కి.మీ. దూరంలో రాయచూర్ రోడ్డు పక్కనే ఎత్తైన కొండల మీద ఈ గుడి ఉంది. 600 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గుడి రోజురోజుకు అభివృద్ధి చెందుతూ చాలా కాలంగా భక్తులతో నిండి ఉంటుంది.
సుమారు 600 ఏళ్ల కిందట, తమిళనాడులోని శ్రీరంగం దగ్గర అలహరి గ్రామానికి చెందిన అలహరి కేశవయ్యకు కలలో శ్రీనివాసుడు కనిపించాడట. తాను మన్యంకొండ మీద, కృష్ణా నది ఒడ్డున ఉన్నానని, వెంటనే అక్కడికి వెళ్లి తనకు రోజువారీ సేవలు చేయమని ఆదేశించి మాయమయ్యాడట. దాంతో, అలహరి కేశవయ్య తన తండ్రి అనంతయ్యతో కలిసి కుటుంబంతో సహా మన్యంకొండ దగ్గరలోని కోటకదిరలో స్థిరపడ్డాడు. అక్కడి నుంచి రోజూ కొండపైకి వెళ్లి సేవలు చేయడం మొదలుపెట్టాడు.

ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ఒకసారి కేశవయ్య కృష్ణా నదిలో స్నానం చేసి, సూర్య భగవానుడికి దణ్ణం పెట్టి పూజలు చేస్తున్నప్పుడు, ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహం ఆయన ఒడిలో ప్రత్యక్షమైందట. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై ఉన్న ఒక గుహలో శేషశాయి రూపంలో ప్రతిష్టించి, పూజలు చేయడం మొదలుపెట్టారు. స్వామివారితో పాటు, ఆంజనేయ స్వామి విగ్రహాలను కూడా గుడిలో ప్రతిష్టించారు. ఈ గుడికి ఎదురుగా ఉన్న కొండపై, పూర్వం మునులు తపస్సు చేసిన గుహ కూడా ఉందని చెబుతారు.
అలహరి వంశానికి చెందిన హనుమద్దాసు రాసిన కీర్తనలతో మన్యంకొండకు చాలా పేరు వచ్చింది. హనుమద్దాసు దాదాపు 300 కీర్తనలు రాశారు. ఈ కీర్తనలే గుడి చరిత్రను నలుదిశలా చాటాయి. హనుమద్దాసు తర్వాత, ఆయన వంశానికి చెందిన అలహరి రామయ్య గుడిలో పూజలు చేయడం ప్రారంభించారు. వంశపారంపర్యంగా ధర్మకర్తగా ఉంటూ ఆయన గుడి అభివృద్ధికి చాలా కృషి చేశారు. ముఖ్యమైన రోజుల్లో స్వామివారికి రకరకాల సేవలు చేస్తారు. ప్రతి శనివారం తిరుచి సేవ జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. నైవేద్యం స్వామివారికి చాలా ఇష్టం. భక్తులు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం వందలాది పెళ్లిళ్లు అమ్మవారి గుడిలో జరుగుతాయి.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
మన్యంకొండకు ఎలా వెళ్లాలి?
బస్సులో: హైదరాబాద్ నుంచి మన్యంకొండకు నేరుగా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కర్నూలు నుంచి వచ్చేవారు జడ్చర్ల వద్ద దిగి మహబూబ్నగర్ మీదుగా మన్యంకొండ చేరుకోవచ్చు. లేదంటే భూత్పూర్ వద్ద దిగి మహబూబ్నగర్ మీదుగా కూడా వెళ్లొచ్చు.
రైలులో: రైలులో రావాలంటే, హైదరాబాద్ లేదా కర్నూలు నుంచి రావచ్చు. మహబూబ్నగర్-దేవరకద్ర మార్గంలో ఉన్న కోటకదిర రైల్వే స్టేషన్ వద్ద దిగితే, గుడి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.