Indian Railways : ఈ రైలు ఎక్కితే టిక్కెట్ అవసరం లేదు.. 75 ఏళ్లుగా ఉచిత సేవలు అందిస్తున్న రైలు గురించి తెలుసా?
Indian Railways : భారతదేశంలో రైలు ప్రయాణం చేయాలంటే తప్పకుండా టికెట్ తీసుకోవాలి. అలా కాకుండా, టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాతో పాటు శిక్ష కూడా పడుతుంది. కానీ, మన దేశంలో ఒక ప్రత్యేకమైన రైలు ఉంది. అందులో మీరు ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ రైలులో టికెట్ చెక్ చేసేవారు ఉండరు. స్టేషన్లో దిగిన తర్వాత కూడా ఎవరూ మిమ్మల్ని టికెట్ చూపించమని అడగరు. మరి ఈ వింతైన, అద్భుతమైన రైలు ఏంటి? అది ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకతలు ఏంటి? తెలుసుకుందాం.
భారతీయ రైల్వేస్ ప్రజలకు తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణాలు చేసేందుకు ఎంతో ఉపకరిస్తుంది. అందుకే చాలా మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అయితే, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య నడిచే ఒక ప్రత్యేక రైలు గత 75 సంవత్సరాలుగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ రైలు పేరు బాక్రా నంగల్ రైలు. ఈ రైలులో ప్రయాణించడానికి మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యేకమైన రైలులో ప్రయాణించడానికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా, బాక్రా నంగల్ డ్యామ్‌ను చూడటానికి వచ్చే పర్యాటకులు ఈ ఉచిత రైలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు.

ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
బాక్రా నంగల్ రైలు 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ మార్గం సట్లెజ్ నది, శివాలిక్ కొండల మధ్య సాగుతుంది. ఇక్కడి అద్భుతమైన ప్రకృతి అందాలను చూడటానికి చాలా మంది పర్యాటకులు ఈ రైలులో ప్రయాణిస్తుంటారు. అంతేకాదు, ఈ ప్రాంతంలో పలు సినిమాల షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. ఈ రైలు తన ప్రయాణంలో మూడు టన్నెల్స్ మరియు ఆరు స్టేషన్ల గుండా వెళ్తుంది. ఇది డీజిల్ ఇంజిన్‌తో నడిచే రైలు. దీనిలోని అన్ని బోగీలు చెక్కతో తయారు చేయబడ్డాయి, ఇది దీనికి ఒక ప్రత్యేకమైన, పాతకాలపు రూపాన్ని ఇస్తుంది. మూడు కోచ్‌లు ఉన్న ఈ రైలును మొదటిసారిగా 1948లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
ఈ రైలు మొదట ఆవిరి ఇంజిన్‌తో నడిచేది. ఆ తర్వాత 1953లో దీనికి డీజిల్ ఇంజిన్లను అమర్చారు. ఈ రైలును బాక్రా బోర్డు పర్యవేక్షణలో నడుపుతున్నారు. దీని చరిత్రను చూస్తే, భక్రా నంగల్ డ్యామ్ నిర్మాణ సమయంలో, కార్మికులు, ఉద్యోగుల కోసం, అలాగే నిర్మాణ వస్తువులను రవాణా చేయడానికి ఈ రైలును ఉపయోగించారు. డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత, ఈ రైలును పర్యాటకుల కోసం ఉచితంగా నడపాలని నిర్ణయించారు. అదే విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు సుమారు 800 మంది ఈ రైలులో ప్రయాణించవచ్చు. టికెట్ లేని ఈ ప్రయాణం పర్యాటకులకు ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుంది. అదే సమయంలో, దేశంలోని ఒక ముఖ్యమైన చరిత్రను, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన కృషిని కూడా ఇది గుర్తు చేస్తుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.