Holiday Spots : దసరా సెలవుల్లో ఎంజాయ్ చేయాలని చూస్తున్నారా.. హైదరాబాద్ దగ్గర్లో అద్భుతమైన హాలిడే స్పాట్స్ ఇవే
Holiday Spots : దసరా పండుగ సమీపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ సంబరాలు అంబరాన్ని అంటబోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో దసరాను చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రభుత్వం విద్యాసంస్థలకు ముందే సెలవులు ప్రకటించడంతో పాటు, ఉద్యోగులకు కూడా సెలవులు రావడంతో చాలామంది ట్రిప్‌లు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి వెళ్ళడానికి చాలా అనువుగా ఉంటాయి. కొండలు, సరస్సులు, కోటలు, జలపాతాలు వంటి ఎన్నో అందమైన ప్రదేశాలు హైదరాబాద్‌కు దగ్గర్లోనే ఉన్నాయి.
లక్నవరం సరస్సు
హైదరాబాద్‌కు సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నవరం సరస్సు చాలా అందమైన ప్రదేశం. ఇది వరంగల్ జిల్లాలో ఉంది. ఈ సరస్సు ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఉన్న వేలాడే వంతెన (హ్యాంగింగ్ బ్రిడ్జ్), చుట్టూ ఉన్న కొండలు, పచ్చని ప్రకృతి మధ్య ప్రయాణించడం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. లక్నవరం సరస్సులో దాదాపు 13 చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ చేస్తూ చుట్టూ ఉన్న అందాలను ఆస్వాదించవచ్చు. అలాగే, అడ్వెంచర్ ఇష్టపడేవారికి ఇక్కడ జిప్ లైనింగ్ వంటి యాక్టివిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక రోజులో ట్రిప్ ముగించుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్.

బీదర్ కోట
చరిత్రను, నిర్మాణ కళను ఇష్టపడేవారికి బీదర్ కోట అద్భుతమైన ప్రదేశం. ఇది హైదరాబాద్‌కు కేవలం 145 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ కోటను 1428లో అహ్మద్ షా బహామణి ఎర్ర లాటరైట్ రాళ్లతో నిర్మించాడు. ఈ కోటలో ఉన్న చెరువులు, మసీదులు, పూల తోటలు చాలా ఆకట్టుకుంటాయి. దీని పటిష్టమైన నిర్మాణం, అప్పటి ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. ఈ కోట చరిత్ర గురించి తెలుసుకోవడం, దానిలోని రహస్యాలను అన్వేషించడం ఒక ఆసక్తికరమైన అనుభూతిని ఇస్తుంది. రెండు రోజులలో ఈ ప్రదేశాన్ని ప్రశాంతంగా చూడవచ్చు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు

తిర్యాణి జలపాతాలు
కోమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న తిర్యాణి జలపాతాలు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంలాంటివి. హైదరాబాద్ నుంచి సుమారు 310 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయితే, ఈ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు పారే సెలయేళ్ల మధ్య ఈ జలపాతాలు ఉన్నాయి. సెలవు రోజుల్లో బిజీ జీవితానికి దూరంగా, ప్రశాంతంగా గడపడానికి ఇది సరైన ప్రదేశం. జలపాతాల శబ్దాలు, చల్లటి వాతావరణం మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. అడ్వెంచర్ ప్రియులకు ఈ ప్రదేశం నచ్చుతుంది.
ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
నాగార్జునసాగర్
హైదరాబాద్‌కు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇక్కడ ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడమైన నాగార్జునసాగర్ డ్యామ్‌ను చూడవచ్చు. డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు నీటి ప్రవాహం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ చేస్తూ నది అందాలను ఆస్వాదించవచ్చు. అలాగే, సమీపంలో ఉన్న బుద్ధవనం సందర్శకులను చాలా ఆకట్టుకుంటుంది. బౌద్ధ సంస్కృతి, చరిత్రను తెలుసుకోవడానికి ఇదొక మంచి ప్రదేశం.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.