Padmakshi Temple : రోజులో మూడు రూపాలు..ఉదయం బాలిక, మధ్యాహ్నం యువతి, సాయంత్రం వృద్ధురాలు..ఈ అమ్మవారు ఎక్కడంటే
Padmakshi Temple : తెలంగాణలోని హనుమకొండ నగరంలో ఒక అద్భుతమైన, చారిత్రక దేవాలయం ఉంది. అదే శ్రీ హనుమద్గిరి పద్మాక్షి అమ్మవారి దేవాలయం. ఈ ఆలయంలో కొలువైన అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే, ఆమె ఒకే రోజులో మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. ఉదయం బాలిక రూపంలో, మధ్యాహ్నం యువతి రూపంలో, సాయంత్రం వృద్ధురాలి రూపంలో భక్తులకు దర్శనమివ్వడం ఇక్కడి అద్భుతమైన విశేషం. కాకతీయ రాజులచే 10వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ పురాతన ఆలయ చరిత్ర, జైన సంబంధాలు, ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కాకతీయ రాజులు నిర్మించిన ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలలో హనుమద్గిరిలోని ఈ పద్మాక్షి అమ్మవారి ఆలయం (sri Padmakshi Ammavari Temple) ఒకటి. శ్రీ హనుమద్గిరి పద్మాక్షి అమ్మవారి దేవాలయం హనుమకొండ (Hanumakonda) నగరంలోని బస్టాండ్‌కు సమీపంలో ఉన్న ఒక చిన్న గుట్ట పై నెలకొని ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారు ఒకే రోజులో మూడు రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఉదయం ఆమె బాలిక రూపంలో, మధ్యాహ్నం యవ్వనంలో ఉన్న స్త్రీ రూపంలో, సాయంత్రం వృద్ధురాలి రూపంలో కనిపిస్తారని భక్తులు చెబుతారు. ఈ ఆలయం చరిత్ర కాకతీయుల కాలం నాటిదిగా చెబుతారు. ఈ ఆలయం వెయ్యి స్తంభాల గుడి కంటే ముందే నిర్మించబడింది.
చరిత్రకారుల ప్రకారం, కాకతీయ రాజులు (kakatiya Dynasty) ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో అంటే ప్రసిద్ధ వేయి స్తంభాల గుడి నిర్మాణానికి (Thousand Pillar Temple) ముందే నిర్మించారు. కాకతీయ రాజులు ఈ పద్మాక్షి అమ్మవారికి ఎంతో గౌరవం ఇచ్చేవారు. వారి పాలనా కాలంలో ఈ గుట్ట ప్రత్యక్ష శక్తి స్థలంగా విరాజిల్లింది. ఈ గుట్ట మొత్తం ఆకారం కూడా చాలా ప్రత్యేకమైనది. ఇది శ్రీచక్రం ఆకారంలో, షట్కోణ, త్రికోణ, బిందువు రూపంలో ఉండటం ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైంది. కాలక్రమేణా, ఈ పద్మాక్షి గుట్ట జైన మత ఆరాధనా కేంద్రంగా (Jain Temples In Telangana) కూడా మారిందని చరిత్ర చెబుతోంది.
ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
కాకతీయ రాజైన బేతరాజు మంత్రి ప్రెగ్గడ, ఒక జైన భక్తుడు. ఆయన ఈ పద్మాక్షి గుట్టను జైన ఆరాధన కేంద్రంగా మార్చాలని అనుకున్నారు. దీంతో, గుట్టపై అనేక జైన విగ్రహాలను చెక్కించారు. అంతేకాకుండా, గర్భగుడిలో పద్మాక్షి అమ్మవారి పక్కనే మహావీరుడి విగ్రహాన్ని (Mahaveer Statues in Telangana) కూడా ప్రతిష్టించారు. అదనంగా కుబేరుడి విగ్రహం కూడా ఇక్కడ కొలువై ఉంది. ఈ ఆలయం నిర్వహణ ఇప్పటికీ ఒకే కుటుంబం చేతుల్లో ఉంది. అలాగే ఇక్కడి జపానికి గొప్ప ఫలితం ఉంటుందని చెబుతారు. ఈ గుట్టపై జపం చేస్తే, ఇంట్లో చేసే జపం కంటే కోట్లాది రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందంటారు.
ఈ ఆలయం ఇప్పటికీ నాగిళ్ల కుటుంబం ఆధ్వర్యంలోనే కొనసాగుతోందని, శ్రీ పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ కింద బ్రహ్మశ్రీ నాగిళ్ల శంకర శర్మ గారి పర్యవేక్షణలో నడుస్తుందట. దీనికి దేవాదాయ శాఖతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. గతంలో కందుకూరి శివానందమూర్తి, వజ్జల సిద్ధాంతి వంటి ఎంతో మంది గొప్ప యోగులు ఇక్కడ యోగ సాధన చేసి జ్ఞానోదయం పొందారని చెబుతారు.
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
అమ్మవారు సంవత్సరంలో కూడా మూడు రుతువుల్లో మూడు రూపాల్లో దర్శనమిస్తారని పూజారి పేర్కొన్నారు. ఈ ఆలయం ప్రాముఖ్యత ఇటీవల మరింత పెరిగింది. గత రెండేళ్లలో ఈ ఆలయ ఖ్యాతి మరింత పెరిగిందని, నిత్యం భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ముందుకు రావాలని కోరారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
