Shiva Temple : చెవి నొప్పుల నుంచి ఉపశమనం కోసం పీతలను సమర్పించే శివాలయం.. ఎక్కడుందో తెలుసా ?
Shiva Temple : హిందూ సంప్రదాయంలో శివుడికి పువ్వులు, పండ్లు, పాలతో అభిషేకాలు చేయడం చూస్తుంటాం. కానీ ఒక ఆలయంలో శివుడికి సజీవంగా ఉన్న పీతలను సమర్పిస్తారు. ఇది వినడానికి వింతగా అనిపించినా, ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఒక సంప్రదాయం. గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఉన్న రంధనాథ్ మహాదేవ్ దేవాలయంలో ఈ వింత ఆచారం ఉంది. ఈ ఆలయం, దాని చరిత్ర, ప్రత్యేకతలు, అక్కడికి ఎలా వెళ్లాలో ఈ వార్తలో తెలుసుకుందాం.
సాధారణంగా మనం శివుడికి పువ్వులు, పండ్లు, పాలతో అభిషేకాలు సమర్పిస్తుంటాం. కానీ గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఒక అరుదైన ఆలయం ఉంది. ఇక్కడ శివ భక్తులు సజీవంగా ఉన్న పీతలను స్వామివారికి సమర్పిస్తారు. ఈ ప్రత్యేకమైన ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ ఆలయాన్ని రంధనాథ్ మహాదేవ్ దేవాలయం అని లేదా రామనాథ్ శివ్ ఘేలా మందిర్ అని కూడా పిలుస్తారు.

ఆలయ చరిత్ర, కథనం
ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. ఈ ఆలయాన్ని స్వయంగా శ్రీరాముడే నిర్మించారని భక్తులు నమ్ముతారు. వనవాస సమయంలో శ్రీరాముడు ఈ ప్రాంతంలో ఉండగా ఇక్కడ సముద్రం ఉండేదట. ఒకసారి ఒక పీత సముద్రం నుంచి వచ్చి పదేపదే రాముడి పాదాలను తాకడానికి ప్రయత్నించిందట. ఆ పీత భక్తికి మెచ్చిన రాముడు ఈ ఆలయంలో శివుడికి పీతలను సమర్పించిన వారికి వారి కోరికలు నెరవేరుతాయని ఆశీర్వదించారని చెబుతారు. అప్పటినుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ పీతలను సమర్పించడం వల్ల చెవి నొప్పులు, చెవికి సంబంధించిన వ్యాధులు నయమవుతాయని భక్తులు బలంగా విశ్వసిస్తారు.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
పీతలను ఎప్పుడు, ఎందుకు సమర్పిస్తారు?
ముఖ్యంగా పిల్లలకు చెవి నొప్పులు లేదా ఇతర చెవి సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు, భక్తులు ఇక్కడ పీతలను సమర్పిస్తే ఆ వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా కూడా పీతలను సమర్పిస్తారు. ఈ ప్రత్యేకమైన సంప్రదాయం సాధారణంగా మకర సంక్రాంతి రోజున జరుగుతుంది. ఈ రోజున భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి వచ్చి శివలింగానికి పీతలను సమర్పిస్తారు. పీతలను ఆలయంలో సమర్పించిన తర్వాత వాటిని అలాగే వదిలేయరు. ఆలయ నిర్వాహకులు ఆ పీతలను సేకరించి, తిరిగి సముద్రంలో లేదా నదిలో విడిచిపెడతారు. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు.
రంధనాథ్ మహాదేవ్ ఆలయానికి ఎలా వెళ్లాలి?
ఈ ప్రత్యేకమైన ఆలయం గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఉంది. ఈ ఆలయం దుమాస్ బీచ్‌కు దగ్గరగా తాపీ నది ఒడ్డున ఉంది.
ఇది కూడా చదవండి : Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
రోడ్డు మార్గం: రైలులో లేదా విమానంలో సూరత్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆటో లేదా టాక్సీలో సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు. సూరత్ నగరంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా ఉంది.
రైలు మార్గం: సూరత్ రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరగా ఉంది. రైల్వే స్టేషన్ నుంచి 10-15 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది.
విమాన మార్గం: సూరత్ విమానాశ్రయం నుంచి కూడా రోడ్డు మార్గంలో సులభంగా ఆలయానికి వెళ్లవచ్చు.
ఈ ఆలయం ఏడాది పొడవునా భక్తులతో నిండి ఉంటుంది. కానీ మకర సంక్రాంతి రోజున ప్రత్యేకంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు. ఈ పండుగ సమయంలో వెళ్లేవారు రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవడం మంచిది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.