Trekking : సాహస యాత్రకు సిద్ధమా? తెలంగాణలో ఈ 6 అద్భుతమైన ట్రెక్కింగ్ స్పాట్లు, కోటలు తప్పక చూడాల్సిందే
Trekking : తెలంగాణ రాష్ట్రం కేవలం ఐటీ హబ్‌లకు, చారిత్రక కట్టడాలకే పరిమితం కాదు. దక్కన్ పీఠభూమి, దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, ప్రాచీన కోటలతో కూడిన ఈ ప్రాంతం సాహస ప్రియులకు ఒక అద్భుతమైన గమ్యస్థానం. కొండ ప్రాంతాలు, అడవుల్లో ట్రెక్కింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ట్రెక్కింగ్‌కు అనుకూలంగా, ప్రసిద్ధి చెందిన తెలంగాణలోని ప్రముఖ 6 ప్రాంతాల గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అనంతగిరి హిల్స్
హైదరాబాద్‌కు అత్యంత దగ్గరగా (దాదాపు 75-90 కి.మీ.) వికారాబాద్ జిల్లాలో ఉన్న అనంతగిరి కొండలు దట్టమైన పచ్చదనం, అడవులకు ప్రసిద్ధి. ఇది మూసీ నది జన్మస్థలం కూడా. ఇక్కడ ట్రెక్కింగ్ అనుభవం లేని వారు ఫస్ట్ టైం మొదలు పెట్టేందుకు అనువుగా ఉంటుంది. కాబట్టి, బిగినర్స్ దీనిని ఎంచుకోవచ్చు. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం లేదా కేరెల్లి వైపు నుంచి రెండు ప్రధాన ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. ట్రెక్ మార్గంలో అందమైన వ్యూ పాయింట్లు, చారిత్రక ఆలయం, స్వచ్ఛమైన నీటి ప్రవాహాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ క్యాంపింగ్, సమీపంలోని కోటిపల్లి రిజర్వాయర్ వద్ద కయాకింగ్ వంటి ఇతర కార్యకలాపాలు కూడా చేయవచ్చు.

భువనగిరి కోట : హైదరాబాద్‌కు 48 కి.మీ. దూరంలో ఉన్న ఈ కోట, ఒకే పెద్ద బండరాయి పై నిర్మించబడింది. దాదాపు 500 అడుగుల ఎత్తు ఉన్న ఈ గుట్టపైకి ఎక్కడం సులభమైన ట్రెక్కింగ్ అవుతుంది. పైనుంచి చుట్టూ ఉన్న గ్రామాల దృశ్యం అద్భుతంగా ఉంటుంది. రాక్ క్లైంబింగ్, రాపెల్లింగ్కు కూడా ఈ కోట ప్రసిద్ధి.
రాచకొండ కోట : హైదరాబాద్‌కు 60 కి.మీ. దూరంలో ఉన్న ఈ చారిత్రక కోట కొండల మధ్య దట్టమైన అడవుల్లో ఉంది. ఇక్కడ ట్రెక్కింగ్ కొంచెం సాహసోపేతంగా ఉంటుంది, ఇక్కడ కోట శిథిలాలతో పాటు ప్రాచీన గుహలను కూడా అన్వేషించవచ్చు.
కోయిల్ కొండ కోట : మహబూబ్‌నగర్‌లో (హైదరాబాద్ నుండి 134 కి.మీ.) ఉన్న ఈ గిరి దుర్గంపైకి ట్రెక్కింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. లోతైన లోయలు దాటుకుంటూ మెట్లు, రాతి మార్గాల గుండా పైకి ఎక్కాలి. కోయిల్ సాగర్ డ్యామ్ అందాలను పైన నుంచి వీక్షించవచ్చు.
ఇది కూడా చదవండి : Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
మేడ్చల్ కోట : 12వ శతాబ్దానికి చెందిన ఈ కోటపైకి దాదాపు 500 మెట్లు ఎక్కి చేరుకోవచ్చు. ఈ చిన్నపాటి ట్రెక్ ద్వారా కొండపైన ఉన్న అద్భుతమైన నిర్మాణాలను, మేడ్చల్ పట్టణ దృశ్యాన్ని చూడవచ్చు.
జలపాతాల గుండా కనకాయి ట్రెక్కింగ్
హైదరాబాద్‌కు కొంచెం దూరంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కనకాయి జలపాతం ట్రెక్కింగ్‌కు మరొక అద్భుతమైన ప్రదేశం. ఈ ప్రాంతంలో కనకాయి, బండ్రేవ్ జలపాతాలు, చీకటి గుండం వంటి ప్రాంతాలను కలుపుకుని 4-5 కి.మీ. నడక దారి ఉంటుంది. వర్షాకాలం తర్వాత ఈ ప్రాంతం మరింత పచ్చగా, సాహసభరితంగా మారుతుంది.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ట్రెక్కింగ్‌కు సరైన సమయం, భద్రతా చిట్కాలు
తెలంగాణలో ట్రెక్కింగ్ చేయడానికి అక్టోబర్ నుండి మార్చి వరకు ఉండే చలికాలం అత్యుత్తమ సమయం. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉండి ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉన్న వర్షాకాలంలో దారులు బురదగా, జారే ప్రమాదం ఉండవచ్చు. భద్రత కోసం, నల్లమల అడవుల వంటి కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి అటవీ శాఖ అనుమతి అవసరం. ప్రథమ చికిత్స కిట్, తగినంత నీరు, టోపీ, నాణ్యమైన ట్రెక్కింగ్ బూట్లు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. తెలియని కొత్త ట్రయల్స్‌లో స్థానిక గైడ్ సహాయం తీసుకోవడం సురక్షితం.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.