Tourist Police : తెలంగాణలో ఇక టూరిస్ట్ పోలీసు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక వ్యవస్థ!
Tourist Police : తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో పర్యాటకుల కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీసులు అందుబాటులోకి రానున్నారు. ఈ వ్యవస్థను త్వరలోనే అమలు చేయడానికి పర్యాటక శాఖ, పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఒక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పర్యాటక పోలీసుల విధివిధానాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మొదటి దశలో 80 మంది టూరిస్ట్ పోలీసులు
జీడీపీ డా. జితేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి దశలో పర్యాటక శాఖకు 80 మంది పోలీసు సిబ్బందిని కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక వ్యవస్థ సెప్టెంబర్ 27న వచ్చే ప్రపంచ పర్యాటక దినోత్సవం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పర్యాటక పోలీసుల బృందాలు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన అనంతగిరి, సోమశిల, రామప్ప, యాదగిరిగుట్ట, పోచంపల్లి, నాగార్జునసాగర్, బుద్ధవనం, భద్రాచలం, అమ్రాబాద్ వంటి ప్రదేశాల్లో పనిచేస్తాయి. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, పర్యాటకుల భద్రత కోసం పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని డీజీపీ భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
షూటింగ్ పర్మిషన్లకు, ఈవెంట్లకు ప్రత్యేక మార్గదర్శకాలు
ఈ సమావేశంలో డీజీపీ డా. జితేందర్ ఒక ముఖ్యమైన సూచన చేశారు. ఫిల్మ్ షూటింగ్లు, ప్రత్యేక ఈవెంట్ల నిర్వహణ కోసం ప్రామాణిక కార్యాచరణ విధానాలను రూపొందించాలని పర్యాటక శాఖకు సూచించారు. దీనివల్ల షూటింగ్ పర్మిషన్లు, ఈవెంట్లకు ముందస్తుగా సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయడానికి పోలీసులకు సులభమవుతుందని ఆయన వివరించారు. చలనచిత్ర నిర్మాతలు, ఈవెంట్ నిర్వాహకులు ముందుగానే అధికారులకు సమాచారం అందించాలని, తద్వారా తగిన భద్రతా చర్యలు తీసుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు.
- ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
పర్యాటక రంగానికి కొత్త ఊపు
పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంచడానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక, వైద్య, వినోద పర్యాటక ప్రదేశాలను సందర్శించే దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీసులు అవసరం చాలా ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ టూరిస్ట్ పోలీసులు పర్యాటకులకు భద్రత కల్పించడమే కాకుండా, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, తెలంగాణ పర్యాటకానికి మంచి పేరు తీసుకొస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటక పోలీసుల వల్ల తెలంగాణ పర్యాటక రంగం మరింత ఆకర్షణీయంగా మారుతుందని, పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.