Yadagirigutta Temple: నయంకాని రోగాలు, గ్రహదోషాలు తొలగించే వైద్య నారసింహుడు ఎక్కడున్నాడో తెలుసా ?
Yadagirigutta Temple: తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. ఇక్కడ కొలువైన లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించింది. అయితే, ఈ ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈ కొండకు యాదగిరి అనే పేరు ఎలా వచ్చింది? స్వామివారు ఏ రూపంలో దర్శనమిచ్చారు? కొత్త, పాత ఆలయాల సంగమం ఎలా ఉంటుంది? స్వామి వారిని వైద్య నరసింహుడు అని ఎందుకు పిలుస్తారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న యాదగిరిగుట్ట ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. పురాణాల ప్రకారం యాదరుషి అనే మహర్షి ఈ కొండపై లక్ష్మీ నరసింహ స్వామి కోసం కఠోర తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చిన స్వామి, ఇక్కడ ఏకంగా ఐదు రూపాల్లో దర్శనమిచ్చారట. జ్వాల నరసింహ, యోగానంద నరసింహ, గండభేరుండ నరసింహ, నరసింహ, నంద నరసింహ. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రం అని పిలుస్తారు. యాదరుషి కోరిక మేరకు ఈ కొండకు యాదగిరి అనే పేరు వచ్చిందని చెబుతారు.

అద్భుతమైన ఆలయ పునర్నిర్మాణం
తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ స్థాయి ఆలయంగా తీర్చిదిద్దింది. ఈ నిర్మాణంలో అత్యంత నాణ్యమైన నల్లరాతిని విస్తృతంగా ఉపయోగించారు. ఆధునిక కాలంలో పూర్తిగా నల్లరాతితో నిర్మించిన ఆలయాల్లో ఇది ప్రత్యేకమైనది. ఈ ఆలయం పైన షడ్భుజి ఆకారంలో సుదర్శన చక్రం ఉంటుంది. ఇది యాదరుషిని రక్షించిందని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు, స్వామివారిని నాణేల దేవుడు అని ముద్దుగా పిలుస్తారు. చిన్న నాణేలు వేసి దండం పెట్టుకున్నా స్వామి కరుణిస్తారని వారి నమ్మకం.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
వైద్య నరసింహుడిగా స్వామివారి మహిమ
యాదగిరిగుట్టలోని స్వామివారిని వైద్య నరసింహుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం దగ్గరలో ఉన్న విష్ణు పుష్కరిణి అనే పవిత్ర కొలనులో స్నానం చేసి, స్వామిని దర్శించుకుంటే అనారోగ్యాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తులు బలంగా నమ్ముతారు. స్వామివారి పాదాల నుంచి వచ్చే పవిత్ర జలం ఈ పుష్కరిణిలోకి చేరుతుంది. ఈ పవిత్ర జలాల్లో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని, పితృ దేవతలకు శాంతి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారి దండాయుధాన్ని తమ కుడి భుజానికి తాకించుకుని ఆశీర్వాదం పొందుతారు.
శివాలయం ప్రత్యేకత
కొండపై ఆలయానికి వెళ్లే మెట్ల మార్గంలో ఒక శివాలయం ఉంది. ఇక్కడ శివయ్య లక్ష్మీ నరసింహ స్వామికి ఎదురుగా స్వయంభూగా వెలిశారని చెబుతారు. ఈ మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయని భక్తులు నమ్ముతారు. యాదగిరిగుట్ట ఒక ప్రశాంతమైన, విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడ స్వామి దర్శనం పొంది భక్తులు తమ కోర్కెలు తీర్చుకుంటారు.
ఇది కూడా చదవండి : Thailand 2024 : థాయ్లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ఎలా వెళ్లాలి అంటే..
హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట సుమారు 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సొంత కారులో వెళ్లినా లేదా టాక్సీ బుక్ చేసుకున్నా 1.5 నుంచి 2 గంటల్లో చేరుకోవచ్చు. తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి యాదగిరిగుట్టకు చాలా బస్సులను నడుపుతుది. ఈ బస్సులు సుమారు 2 నుంచి 3 గంటల్లో మిమ్మల్ని చేరుస్తాయి.
యాదగిరిగుట్టకు అత్యంత దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ రాయిగిరి. ఇది ఆలయానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాయిగిరికి రెగ్యులర్ రైళ్లు నడుస్తుంటాయి. రాయిగిరి స్టేషన్లో దిగి, అక్కడి నుంచి ఆటో లేదా టాక్సీలో ఆలయానికి చేరుకోవచ్చు. యాదగిరిగుట్టకు దగ్గరగా ఉన్న ఎయిర్ పోర్టు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు. విమానంలో హైదరాబాద్ చేరుకున్న తర్వాత, అక్కడి నుంచి బస్సు, టాక్సీ లేదా కారులో రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్ట వెళ్లాలి. ఎయిర్ పోర్టు నుంచి యాదగిరిగుట్ట సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.