Alluri Sitarama Raju : బ్రిటిష్ గుండెల్లో దడ పుట్టించిన అల్లూరి  పోరాడిన ఆ ప్రాంతాలను చూసేద్దామా?

షేర్ చేయండి

Alluri Sitarama Raju : తెలుగు నేల మీద పుట్టిన గొప్ప వీరుడు, మన్యం వీరుడిగా పేర్గాంచిన అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారెవరూ ఉండరు. బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంలా మారిన ఈ విప్లవ వీరుడి పుట్టిన రోజు(జూలై 4) సందర్భంగా.. ఆయన గురించి.. తను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగించిన పోరాటాన్ని, ఆయన అడుగుపెట్టిన ప్రదేశాల గురించి వివరంగా తెలుసుకుందాం.

కేవలం పుస్తకాల్లో చదువుకున్న విషయాలే కాకుండా, ఆయన పోరాటానికి సాక్ష్యాలుగా నిలిచిన కొండలు, అడవులు, గ్రామాలు, ఆయనెందుకు అంత గొప్ప వీరుడయ్యారో కూడా తెలుసుకుందాం.

చిన్నప్పటి నుంచే ఆధ్మాతిక చింతన…

అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లాలోని పాండ్రంగి గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు సీతారామరాజు కానీ ప్రజలు ఆయన్ను ప్రేమగా అల్లూరి అని పిలుచుకునేవారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆధ్యాత్మిక విషయాల మీద మక్కువ ఎక్కువ.

కేవలం 18 సంవత్సరాల వయసులోనే కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసిగా మారారు. ప్రజలు ఆయన్ను సీతారామ స్వామి అని పిలిచేవారు. ఆయనకు జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యా శాస్త్రం, హస్తసాముద్రికం వంటి వాటిలో మంచి పరిజ్ఞానం ఉండేదని తెలుస్తోంది.

అన్యాయాన్ని చూసి కదిలి… ఎదురించే నాయకుడిగా ఎదిగి…

ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం గిరిజనులపై చాలా అన్యాయమైన చట్టాలను అమలు చేసేది. ముఖ్యంగా పోడు వ్యవసాయం పై నిషేధం విధించింది. దీంతో గిరిజనులు తమ జీవనోపాధిని కోల్పోయారు. అడవుల్లో కట్టెలు, పండ్లు, ఇతర ఉత్పత్తులను సేకరించడానికి కూడా అనుమతించేవారు కాదు.

ఇవికాక బ్రిటిష్ అధికారులు గిరిజన కూలీలను నిర్బంధంగా రోడ్లు, భవనాల నిర్మాణానికి తీసుకువెళ్లి, కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించేవారు. ఈ అన్యాయాలను చూసి చలించిపోయిన అల్లూరి గిరిజనులకు అండగా నిలబడాలని, నాయకుడిగా మారిపోయారు.

అణచివేత అధికం అయితే…తిరుగుబాటు తీవ్రం అవుతుంది…

1922లో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో రంప తిరుగుబాటు మొదలైంది. ఇది కేవలం ఒక తిరుగుబాటు కాదు, బ్రిటిష్ పాలకులకు ఒక పీడకల. అల్లూరి తన అనుచరులైన గిరిజన యోధులకు యుద్ధ శిక్షణ ఇచ్చి, బ్రిటిష్ వారిపై గెరిల్లా యుద్ధ తంత్రాలతో పోరాడారు.

అల్లూరి తన అనుచరులతో కలిసి చింతపల్లి, రాజవొమ్మంగి, కృష్ణదేవిపేట వంటి పోలీస్ స్టేషన్లపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల లక్ష్యం బ్రిటిష్ అధికారులను చంపడం కాదు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను దోచుకోవడం. దోచుకున్న ఆయుధాలతో తన సైన్యాన్ని బలోపేతం చేసుకున్నారు.

మన్యం అడవులు అల్లూరికి పెట్టని కోట. దట్టమైన పొదలు, కొండలు, లోయలు, రహస్య మార్గాలను ఆయన బాగా ఉపయోగించుకున్నారు. బ్రిటిష్ సైన్యానికి అడవుల్లో ఎలా పోరాడాలో తెలియదు. అల్లూరి ఎక్కడున్నాడో తెలుసుకోవడం వారికి చాలా కష్టమయ్యేది. ఒకచోట దాడి చేసి, వెంటనే అడవుల్లోకి అదృశ్యమవడం ఆయన వ్యూహం.

అల్లూరి పోరాటంతో బ్రిటిష్ ప్రభుత్వం చాలా కంగారు పడింది. అతడిని పట్టుకోవడానికి వేల మంది సైనికులను రంగంలోకి దించారు. అతని తలపైన భారీ మొత్తంలో బహుమతిని ప్రకటించారు. కానీ అల్లూరి మాత్రం బ్రిటిష్ వారికి చిక్కకుండా, రెండేళ్లపాటు (1922-1924) వారిని ముప్పు తిప్పలు పెట్టారు.

ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు

అల్లూరి వారసత్వాన్ని తెలుసుకోవాలంటే, ఆయన జీవితంతో ముడిపడి ఉన్న ఈ ప్రదేశాలను సందర్శించి తెలుసుకోవచ్చు.


పాండ్రంగి గ్రామం : విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం దగ్గర, సుమారు 40 కి.మీ. దూరంలో నేషనల్ హైవే16 మీదుగా వెళ్తే పాండ్రంగి గ్రామం (Pandrangi Village) చేరుకోవచ్చు. ఇక్కడ అల్లూరి 1897 జూలై 4న జన్మించారు. ఆయన పుట్టిన స్థలంలో ఒక చిన్న స్మారక శిల ఉంది.

ఈ ప్రశాంతమైన గ్రామంలో నడుస్తుంటే, ఒక గొప్ప పోరాటయోధుడు ఇక్కడే పుట్టాడని తెలిసి ఒళ్ళు పులకరిస్తుంది. ఆయన జయంతి రోజున ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.

చింతపల్లి, రంప ప్రాంతాలు : కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, చింతపల్లి (Chinta Palli) చుట్టూ ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాలే అల్లూరి పోరాటానికి ప్రధాన స్థావరాలు. ఇవి చాలా రిమోట్ ప్రాంతాలు. రోడ్డు మార్గంలో వెళ్తుంటే, అద్భుతమైన కొండలు, లోయలు, జలపాతాలు కనిపిస్తాయి.

స్వచ్ఛమైన గిరిజన జీవనం ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు స్థానిక గైడ్‌ను తప్పకుండా తీసుకెళ్ళండి. ఎందుకంటే కొన్ని ప్రాంతాలకు అటవీ అనుమతులు అవసరం కావచ్చు.

అల్లూరి ధ్యాన మందిరం : అల్లూరి సీతారామరాజు (Alluri Seetarama Raju) పేరుతో కొత్తగా ఏర్పడిన జిల్లాలోని కొయ్యూరు మండలంలో ఈ ధ్యాన మందిరం ఉంది. దీన్ని ఇటీవల ప్రారంభించారు. ఇది సాంప్రదాయ తెలుగు నిర్మాణ శైలిలో ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అల్లూరి విగ్రహం, రంప తిరుగుబాటుకు సంబంధించిన చిత్రాలు కూడా ఉంటాయి.

ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు

అరకు లోయ | Araku Valley

Araku valley (1)
అరకు లోయ

విశాఖపట్నం జిల్లాలోని అందమైన అరకు లోయలో ఉన్న ట్రైబల్ మ్యూజియంలో అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయి. గిరిజన సంస్కృతి, వారి జీవనం, గురించిన విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

అరకు వెళ్లినప్పుడు కాఫీ మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్‌తో పాటు దీన్ని కూడా సందర్శించవచ్చు.

అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికి బ్రిటిష్ సైన్యం చాలా ప్రయత్నించింది. చివరకు, కొయ్యూరు సమీపంలోని ఓ కొండ వాగు దగ్గర, 1924 మే 7న బ్రిటిష్ సైన్యానికి ఆయన పట్టుబడ్డారు. అక్కడ మేజర్ గుడ్డల్ అనే అధికారి అల్లూరిని ఒక చెట్టుకు కట్టేసి, అమానుషంగా కాల్చి చంపారు.

అల్లూరి నడిచిన దారుల్లో… | Alluri Seetharama Raju Heritage Walk

అల్లూరి సంచరించిన ప్రాంతాలను సందర్శించేందుకు రెండు రోజుల యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు
మొదటి రోజు: విశాఖపట్నంలో మీ ప్రయాణాన్ని ప్రారంభించాలి. మధ్యాహ్నానికల్లా పాండ్రంగిని సందర్శించొచ్చు. సాయంత్రం అరకు లోయకు బయలుదేరి, అక్కడ రాత్రి బస చేయవచ్చు.

araku tribal museum
అరకు ట్రైబల్ మ్యూజియం ముందు అల్లూరి శిలా విగ్రహం…(ప్రయాణికుడు)


రెండో రోజు: ఉదయం అరకులోని ట్రైబల్ మ్యూజియం చూడాలి. ఆ తర్వాత కొయ్యూరులోని అల్లూరి ధ్యాన మందిరానికి వెళ్లాలి. మీ ప్రయాణాన్ని చింతపల్లి గ్రామంలో ముగించవచ్చు.

 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!