Sita Samahit Sthal: సీతమ్మ భూమిలో లీనమైన పవిత్ర స్థలం ఎక్కడ ఉందో తెలుసా? దాని విశేషాలివే
Sita Samahit Sthal: సీతమ్మ తల్లి తన అవతారం చాలించి భూమిలో లీనమైంది అని అందరికీ తెలుసు. కానీ ఆ పవిత్ర స్థలం ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకతలు ఏంటి? అని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఆ అద్భుతమైన, పవిత్రమైన ప్రదేశం గురించి పూర్తి వివరాలు, దాని చరిత్ర, అక్కడి విశేషాల గురించి ఇప్పుడు చూద్దాం.
ఆ పవిత్ర ప్రదేశం మరెక్కడో కాదు… అలహాబాద్, వారణాసిని కలిపే జాతీయ రహదారికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉంది. జాతీయ రహదారిపై జంగీగంజ్ నుండి 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని సీతా సమహిత్ స్థల్ లేదా సీతా మణి అని పిలుస్తారు. సీతా సమహిత్ స్థల్లో చూడటానికి ఒకే ఒక ప్రధాన ఆలయం ఉంది. ఈ ప్రదేశం ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో, గంగా నది ఒడ్డున ఉంది. పురాణాల ప్రకారం ఇక్కడే సీతమ్మ తల్లి భూమిలో లీనమైంది.

ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
చూస్తే ఇది ఆలయంలా కనిపించకపోవచ్చు, ఒక స్మారక చిహ్నంలా ఉంటుంది. తమసా నది ఒడ్డున ఒక ప్రశాంతమైన వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన ఒక అందమైన స్మారక చిహ్నం ఇది. ఈ స్మారక చిహ్నం నిర్మించడానికి ముందు, అక్కడ అమ్మవారి జుట్టు పోలిన ఒక కేశ వాటిక ఉండేదని స్థానికులు చెబుతారు. అక్కడ మొలిచే గడ్డిని కనీసం పశువులు కూడా తినేవట కావు. స్మారక చిహ్నాన్ని నిర్మించేటప్పుడు, ఈ సీతా కేశ వాటికకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తగా వదిలేశారు.
ఈ స్మారక చిహ్నం ఉన్న ప్రదేశానికి దగ్గరలోనే వాల్మీకి ఆశ్రమం ఉంది. శ్రీరాముడు సీతాదేవిని అడవుల్లో వదిలిపెట్టినప్పుడు, జానకి దేవి ఈ ఆశ్రమంలోనే నివసించింది. ఆశ్రమం పక్కన సీతా వటవృక్షం కూడా ఉంది, ఇది లవకుశలు జన్మించిన ప్రదేశమని నమ్ముతారు. రాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు, లవకుశలు యాగం గుర్రాన్ని ఇక్కడే పట్టుకుని కట్టేసి, ఆ తర్వాత హనుమంతుడిని కూడా బంధించారని ప్రసిద్ధి.
ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు
స్మారక చిహ్నమైన ఈ ఆలయం ఒక మనోహరమైన రెండంతస్తుల నిర్మాణం. పై అంతస్తులోని గ్లాస్ పెవిలియన్‌లో, అమ్మవారి పాలరాతి విగ్రహం ఉంది. అంతేకాకుండా, జీవశక్తి భూమిలోకి వెళుతున్నట్లుగా చూపబడిన అమ్మవారి విగ్రహం చూసేవారికి చాలా బాధ కలిగిస్తుంది. వెనుక గోడలపై, ఆ సంఘటనలను చూపించే రాతి చిత్రాలు కనిపిస్తాయి. ఈ ఆలయం లేదా స్మారక చిహ్నం స్వామి జితేంద్రానంద తీర్థ ఆదేశాల మేరకు నిర్మించబడింది. సత్య నారాయణ్ ప్రకాష్ పుంజ్ అనే భక్తుడి ప్రోత్సాహంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో శివాలయం కూడా ఉంది. ఇక్కడ 110 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం కూడా ఒక ఆకర్షణ.
సీతా సమహిత్ స్థల్‌కు మంచి బస్సు మార్గం ఉంది. ఈ పుణ్యక్షేత్రం అలహాబాద్ నుండి 55 కిలోమీటర్లు, వారణాసి నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలులో వచ్చేవారు అలహాబాద్ లేదా వారణాసి రైల్వే స్టేషన్లో దిగి, అక్కడి నుండి సీతా సమహిత్ స్థల్‌కు చేరుకోవచ్చు. విమానంలో వచ్చేవారు అలహాబాద్ లేదా వారణాసి విమానాశ్రయాలకు చేరుకుని, అక్కడి నుండి క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ ప్రదేశం ఆధ్యాత్మిక చింతనతో పాటు, అద్భుతమైన ప్రకృతి అందాలను కూడా తిలకించవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.