Keesaragutta Temple : సాక్షాత్తూ ఆ రాముడే ప్రతిష్టించిన శివలింగం.. అక్కడికి ఎలా వెళ్లాలో తెలుసా ?
Keesaragutta Temple : రామాయణ కాలం నాటి చరిత్రతో, ప్రాచీన శివాలయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఒక దివ్యమైన క్షేత్రం కీసరగుట్ట. హైదరాబాద్కు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో మెదక్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్న ఈ ఆలయం, ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు నెలవు. రావణుడిని సంహరించిన తర్వాత బ్రహ్మణ హత్యా పాతకం నుంచి విముక్తి కోసం శ్రీరాముడు స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రం చరిత్ర, విశిష్టత, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
రాముడు ప్రతిష్టించిన శివలింగం
రావణుడిని వధించిన తర్వాత, ఆ బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటానికి శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని సంకల్పించాడు. శివలింగాలను తీసుకురావడానికి హనుమంతుడిని కాశీకి పంపించాడు. అయితే, హనుమంతుడు తిరిగి వచ్చే సమయానికి శుభ ముహూర్తం దగ్గరపడటంతో, రాముడు స్వయంగా ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్టించాడని పురాణం చెబుతుంది.

కీసరగుట్టకు ఆ పేరు ఎలా వచ్చింది?
హనుమంతుడు కాశీ నుంచి 101 శివలింగాలతో ఆలస్యంగా వచ్చాడు. అప్పటికే రాముడు లింగాన్ని ప్రతిష్టించడం చూసి నిరాశకు లోనై, ఆ కోపంతో తాను తెచ్చిన లింగాలను ఆ ప్రాంతం చుట్టూ విసిరేశాడు. అందుకే నేటికీ ఆలయ ప్రాంగణంలో అనేక శివలింగాలు కనిపిస్తాయి. హనుమంతుడి నిరాశను గమనించిన శ్రీరాముడు, అతని తండ్రి కేసరి పేరు మీద ఈ కొండకు కేసరిగిరి అని పేరు పెట్టాడు. కాలక్రమేణా ఆ పేరే కీసరగుట్టగా మారిందని చెబుతారు.
ఆలయం విశేషాలు, నిర్మాణం
ఇక్కడ ప్రధాన దైవం శ్రీ రామలింగేశ్వర స్వామి. ఈ శివలింగం స్వయంభువుగా వెలసిందని భక్తులు నమ్ముతారు. ప్రధాన ఆలయం పడమర ముఖంగా ఉంటుంది. ప్రధాన మండపంలో స్వామి వారికి కుడివైపు పార్వతీ దేవి, ఎడమ వైపు శివగంగ దేవి దర్శనం ఇస్తారు. ధ్వజస్తంభంతో పాటు కాలభైరవుడిని కూడా ఇక్కడ పూజిస్తారు. స్వామివారికి ఎదురుగా గంభీరంగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
చారిత్రక ఆధారాలు
ఈ ఆలయం సమీపంలో జరిపిన పురావస్తు తవ్వకాల్లో విష్ణుకుండిన రాజుల కాలం నాటి ఇటుక నిర్మాణాలు, బౌద్ధ స్తూపాల అవశేషాలు లభించాయి. అలాగే, క్రీ.శ. 430 నాటి తెలుగు లిపిలో తొలి శాసనాల్లో ఒకటైన తోలుచువంద్రు అనే పదం కూడా ఇక్కడ బయటపడింది. ఇవి ఈ ప్రాంతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని నిరూపిస్తున్నాయి.
ప్రధాన పండుగలు
మహాశివరాత్రి, కార్తీక మాసాల్లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు చూసేందుకు కేవలం తెలంగాణ నుంచే కాకుండా, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
కీసరగుట్ట దేవాలయానికి ఎలా వెళ్లాలి?
బస్సు ద్వారా: హైదరాబాద్లోని సికింద్రాబాద్ జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి కీసరగుట్టకు టీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే బస్సుల వివరాలు: 16ఏ/242, 211సి, 242జీ, 280బీ/కే, 3హెచ్/242.
కారు/బైక్ ద్వారా: హైదరాబాద్లోని ఉప్పల్, మేడిపల్లి మీదుగా ఘట్కేసర్ వైపు వెళ్లే రోడ్డు గుండా కీసరగుట్టకు చేరుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ ద్వారా మార్గాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.