Tirupati : బ్రహ్మోత్సవాలకు తిరుమల రెడీ.. రోజుకు 35 వేల మందికి దర్శనం, బస్సు, అన్నప్రసాదం ఫుల్ ప్లాన్
Tirupati : శ్రీవారి భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఎట్టకేలకు వచ్చేశాయి. ఈరోజు సాయంత్రం ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి వైభవాన్ని చూడటానికి తిరుమలకు చేరుకుంటారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా ఈసారి భక్తుల కోసం ప్రత్యేకంగా 16 రకాల వంటకాలు పంపిణీ చేయనున్నారు.
శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి సాయంత్రం లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కోసం తిరుమల పుణ్యక్షేత్రం పూర్తిగా ముస్తాబైంది. ఆలయ ప్రాంగణం సహా పరిసరాలన్నీ రకరకాల పువ్వులు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. వారి సౌకర్యార్థం టీటీడీ అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
అన్నప్రసాదం: ఈ ఏడాది భక్తులకు ప్రత్యేకంగా 16 రకాల వంటకాలను అందించనున్నారు. అలాగే, వేంకటేశ్వర అన్నప్రసాదం కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం పంపిణీ చేస్తారు.
లడ్డూలు: బ్రహ్మోత్సవాల కోసం 8 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. భక్తులందరికీ లడ్డూలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
దర్శనం: మాడ వీధుల్లో భక్తులు సులువుగా స్వామివారి వాహన సేవలు చూసేందుకు వీలుగా ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సుమారు 35,000 మంది భక్తులను దర్శనానికి పంపేలా ఏర్పాట్లు చేశారు. మాడ వీధుల బయట 36 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు, తద్వారా బయట ఉన్న భక్తులు కూడా వాహన సేవలను వీక్షించవచ్చు.
ప్రత్యేక దర్శనాలు రద్దు: సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో ప్రివిలేజ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
భద్రత, రవాణా, పారిశుధ్యం
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.
భద్రత: తిరుమల గిరిపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3,000 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. అంతేకాకుండా 2,000 మంది భద్రతా సిబ్బంది, 4,700 మంది పోలీసు సిబ్బంది, 450 మంది ఉన్నతాధికారులతో భద్రత కల్పిస్తున్నారు.
రవాణా: భక్తులు తిరుమల కొండపై ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులువుగా ప్రయాణించడానికి ప్రతి 4 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు.
పారిశుధ్యం: తిరుపతిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, శానిటేషన్ మేనేజ్మెంట్ కోసం ఒక ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తారు. భక్తులు తమ పాదరక్షలను భద్రంగా ఉంచుకోవడానికి ఆలయంలో కౌంటర్లను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలతో పాటు, 29 రాష్ట్రాల నుంచి 229 కళా బృందాలు తిరుమలకు చేరుకుంటున్నాయి. ఈ బృందాలు వివిధ సమయాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తాయి, ఇవి భక్తులకు ఒక గొప్ప అనుభూతినిస్తాయి. అలాగే, 3,500 శ్రీవారి సేవకులు తొమ్మిది రోజుల పాటు భక్తులకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆలయ అలంకరణ కోసం 3.5 కోట్ల విలువైన 60 టన్నుల పువ్వులను వినియోగిస్తున్నారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.