బాలీకి 5 రోజుల జర్నీ.. ఎక్కడ ఉండాలి? ఏం చూడాలి? ఎంత బడ్జెట్ కావాలి? : Bali Trip in Monsoon
Bali Trip in Monsoon : వర్షాకాలం కొన్ని ప్రదేశాలను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. అలాంటి ఒక ద్వీపాల సమూహమే ఇండోనేషియా. ఇక్కడ కురిసే వర్షానికి నేచర్ కొత్త రంగులను పులుముకుంటుంది. అందుకే నార్మల్ టైమ్‌లో బాలి వెళ్లిన వాళ్లు వర్షాకాలంలో మళ్లీ ఒకసారి వెళ్లాలి అనుకుంటారు.
ఒక చిన్నపాటి వర్షం కురిసినా అక్కడ ఆకులపై నిలిచే చినుకులు, ఆలయ సమూహంలో నిలిచే నీరు.. వర్షపు చినుకులు జారి నేలపై పడటం…. ఇవన్నీ కూడా మణిరత్నం సినిమాలో ఫ్రేమ్‌లా అనిపిస్తాయి.
నిజానికి ఇండోనేషియా అంటే జస్ట్ ఎ కంట్రీ కాదు. ఇది ఎన్నో ద్వీపాల సమూహం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17,380కు పైగా ద్వీపాలు ఉన్న ఈ దేశానికి ఒక వైపు సముద్రం ఉంటే మరోవైపు అగ్నిపర్వతాలు ఉంటాయి.
ఇందులో బాలీ, జావా, లంబోక్ వంటి ద్వీపాలకు వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడతారు. దీనికి కారణం ఇక్కడి బ్యూటీ అనేది సీజన్‌ను బట్టి మారుతుంది. అదే అసలు బ్యూటి.
సందర్శనీయ ప్రదేశాలు | Bali Itinerary 5 Days
బాలీ అంటే వెంటనే గుర్తొచ్చేది అక్కడి బీచులు. కానీ బాలీ అసలు మజా అంతా ఉబుద్లోనే ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ వాక్కు బయల్దేరితే దారికి ఇరువైపులా చిన్న చిన్న కాలువలు, వాటి పక్కనే అరటి చెట్లు హాయ్ అని పలకరిస్తాయి.
ఇళ్ల ముందు పూజ కోసం పెట్టిన చిన్న బుట్టలు, అందులో మల్లెపూలు దర్శనం ఇస్తాయి. ఆ వాసనను ఫీల్ అవుతూ ఎదురుగా కనిపించే వ్యక్తికి గుడ్‌మార్నింగ్ చెబుతూ మన ప్రయాణం మొదలు పెట్టవచ్చు.
- ఇది కూడా చదవండి : వియత్నాం వెళ్లేందుకు భారతీయులు ఎందుకు ఇష్టపడుతున్నారు ?
ఇక్కడి తానా లాట్ (Tanah Lot) దేవాలయం సముద్రం మధ్య ఒక రాతిపై నిలబడి ఉంటుంది. ఉలున్ దాను బెరటాన్ (Ulun Danu Beratan) ఆలయాన్ని చూస్తే గుడి సగం నీటిలో, సగం మేఘాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ చూడాల్సిన ప్రదేశాలు మాత్రమే కాదు.. కాసేపు నిలబడి మనసులో నింపేసుకోవాల్సిన ప్రదేశాలు.
ఎలా వెళ్లాలి ? | How To Reach Bali
బాలి ఎలా వెళ్లాలి అని చాలా మంది ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటారు. ఈ సమాచారం వారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ముందుగా హైదరాబాద్‌లోని శంషాబాద్ నుంచి ఈ డ్రీమ్ జర్నీ మొదలవుతుంది. కౌలాలంపూర్ లేదా సింగపూర్ మీదుగా సాగే ట్రిప్ మేఘాల సముద్రంలో పడవలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది.
అలాగే బాలిలోని న్గురా రాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఒక చల్లని గాలి వచ్చి హాయ్ అని పలకరిస్తుంది. ఇదే ఇండోనేషియా వెల్కమ్ చెప్పే స్టైల్. ఈ విమానాశ్రయం డెన్పసార్ నగరానికి సమీపంలోని టుబాన్ ప్రాంతంలో ఉంది.
ఎయిర్పోర్ట్ నుంచి ఉబుద్‌కు (Ubud) వెళ్లే సమయంలో సిటీ గజిబిజి నుంచి ప్రశాంతమైన పచ్చని పొలాల మధ్య ఈ ట్రాన్సిషన్ ఎంత స్మూత్‌గా జరుగుతుందో గమనించవచ్చు.
ఇక విజయవాడలో ఉన్న వారు మార్నింగ్ కల్లా హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి జర్నీని ప్రారంభించవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రయాణం అంటే గమ్యస్థానానికి చేరుకోవడమే కాదు.. ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడమే.
ఎక్కడ ఉండాలి | Bali Stay Options
ఇండోనేషియా వెళ్తే బాలిని చూడాలి.. ఉబుద్‌లో ఉండాలి అనే సింపుల్ థియరీ గుర్తుంచుకోవాలి. ఉబుద్‌లో ఉండటానికి కారణం అక్కడి ప్రకృతి. ఇక్కడ చెట్ల మధ్య ఉండే జోగ్లో హౌస్‌లు. ఈ జోగ్లో హౌజులు అనేవి కలపతో చేసిన ఇల్లు.
వాటి ముందు చిన్న కొలను, చుట్టూ వరి చేలు… మార్నింగ్ లేవగానే బాల్కనీలో కూర్చుని.. ఆల్రెడీ తడిసిన పొలాలపై పడే వర్షాన్ని చూస్తూ… కాఫీ లేదా చాయ్ సిప్ చేస్తుంటే వచ్చే ఫీలింగ్‌కు ఏం పేరు పెట్టగలమో చెప్పండి.
- ఇది కూడా చదవండి : Rovaniemi : ఇక్కడ క్రిస్మస్ తాతతో ఫోటో దిగవచ్చు
ఒకవేళ మీరు సముద్రానికి దగ్గరగా ఉండాలి అనుకుంటే సనూర్, సెమిన్యాక్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడి విల్లాల్లో ఉంటే ఒకవైపు సముద్రం హోరు, మరోవైపు వర్షపు జోరు రెండూ కలిస్తే వచ్చే మ్యూజిక్ ఒక మ్యాజిక్‌లా ఉంటుంది.
యోగ్యకర్త అనే ప్రదేశంలో అయితే పాతకాలపు హోటళ్లు ఉంటాయి, గోడల మీద బటిక్ పెయింటింగ్స్, మూలల్లో చెక్క బొమ్మలు కనిపిస్తాయి. ఒక్కసారిగా రాజుల కాలంలోకి వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది.
ఏం చూడాలి | What To See in Bali
ఇండోనేషియాను కళ్లతో కాకుండా మనసుతో చూడాలి. కెమెరా కన్నులకు కాస్త విశ్రాంతిని ఇచ్చి అక్కడి లైఫ్‌ను ఎంజాయ్ చేయాలి. స్థానికంగా ఉండే సందర్శనీయ ప్రదేశాల్లో చాలా మంది తెలియకుండానే అక్కడి జటిలువిహ్ వరి పొలాలను (Jatiluwih Rice Field) కూడా యాడ్ చేసుకుంటారు. సూర్యుడి వెలుగును బట్టి అక్కడి పొలాల అందం మారిపోతుంది.
జటిలువిహ్ ప్రాంతం బాలీ ప్రావిన్స్‌లోని UNESCO గుర్తించిన Cultural Landscape of Bali Province: the Subak Systemలో భాగం. ఈ వారసత్వ ప్రాంతంలో వరి పొలాలు, నీటి కాలువలు, నీటి ఆలయాలతో కూడిన సంప్రదాయ సుబక్ వ్యవస్థ ముఖ్యమైన భాగం. (UNESCO World Heritage Centre)
అలాగే ఉబుద్‌లో కెచక్ డ్యాన్స్ చూడటం, ప్రాంబనన్ దేవాలయ దర్శనం, లంబోక్ తీరంలో కూర్చొని ఇండోనేషియాను కొత్త కోణంలో చూడటం ఇలా ఎన్నో ప్లాన్ చేసుకోవచ్చు.
ఏం తినాలి | Indonesia Food
చాలా మంది ఫుడ్ లవర్స్ ఇండోనేషియా వెళ్లే ముందు అక్కడ మంచి ఫుడ్ లభిస్తుందా లేదా అని ఆలోచిస్తారు. వారిని ఇండోనేషియా అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే భోజనం కూడా ప్రయాణంలో ఒక భాగమే.
నాసి గోరెంగ్ అనే వేయించిన అన్నం, నంచుకోవడానికి ఫ్రైడ్ ఎగ్స్, ఫ్లేవర్ కోసం కొద్దిగా మిరపకాయ, వెల్లుల్లి, టమోటోలను దంచి చేసిన రోటి పచ్చడి లాంటి సాంబల్ ఇవన్నీ మన తెలుగు రుచులను గుర్తుచేస్తాయి. ముందు కాస్త కారంగా అనిపించినా, అరే టేస్ట్ బాగుంది అనిపిస్తుంది. రెండు రోజుల్లో అలవాటైపోతుంది.
అలాగే చాలా మంది ఇండోనేషియాలో ఎంజాయ్ చేసే ఫస్ట్ డిష్ వచ్చేసి గడో గడో (Gado Gado) అనే లోకల్ రెసిపీ. దీనిని ఒక రెసిపీ అనడం కన్నా సలాడ్ అనడం బాగుంటుంది. ఇండోనేషియాలోని చాలా ప్రాంతాల్లో ఈ రెసిపీ లభిస్తుంది.
యాత్ర, బడ్జెట్ వివరాలు
హైదరాబాద్ నుంచి ఐదు రోజుల బాలి ప్రయాణానికి బడ్జెట్ ట్రిప్‌లో సుమారు రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు కావచ్చు. ఇందులో ఫుడ్, ఫ్లైట్, స్టే వంటి ప్రధాన ఖర్చులు ఉంటాయి.
కాస్త లగ్జరీ ట్రిప్ కోసం రూ.90 వేల నుంచి రూ.1 లక్షా 20 వేల వరకు, అల్ట్రా లగ్జరీ ట్రిప్ కావాలంటే రూ.1 లక్షా 50 వేల వరకు లేదా అంతకంటే ఎక్కువ బడ్జెట్ అవసరం కావచ్చు.
హైదరాబాద్ నుంచి బాలి రిటర్న్ విమానం సీజన్, బుకింగ్ సమయం, ఎయిర్‌లైన్‌ను బట్టి ధర మారుతుంది. విజయవాడ నుంచి అయితే హైదరాబాద్ వరకు అదనపు ప్రయాణ ఖర్చు ఉంటుంది. స్టే విషయానికి వస్తే హోమ్‌స్టేలు, హోటల్స్ బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు వివిధ ధరల్లో లభిస్తాయి.
ఇక అతి ముఖ్యమైన విషయం వీసా. భారతీయ ప్రయాణికులు Visa on Arrival (VoA) కోసం Rp 500,000 ఇండోనేషియా రుపియాలు చెల్లించాలి. ఈ వీసాతో 30 రోజుల వరకు ఇండోనేషియాలో ఉండవచ్చు. ఒకసారి మరో 30 రోజులు పొడిగించుకునే అవకాశం ఉంది. భారతీయులు VoAకి అర్హులైన దేశాల జాబితాలో ఉన్నారు.
ఆసక్తికరమైన విషయాలు | Interesting Facts
- ఇండోనేషియాలో 17,380 ద్వీపాలు ఉన్నాయి. ఇది 2024లో ఇండోనేషియా Geospatial Information Agency (BIG) వెల్లడించిన అధికారిక లెక్క.
- బాలీ రాజధాని డెన్పసార్. బాలీకి వచ్చే అంతర్జాతీయ పర్యాటకులకు న్గురా రాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన ప్రవేశ ద్వారం.
- ఉబుద్ బాలీ కళలు, సంప్రదాయాలు, సంస్కృతికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం.
- జటిలువిహ్ వరి పొలాలు బాలీ UNESCO గుర్తించిన Cultural Landscapeలో భాగం. ఈ ప్రాంతానికి సంప్రదాయ Subak నీటిపారుదల వ్యవస్థ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. (UNESCO World Heritage Centre)
- కొమోడో డ్రాగన్ ప్రపంచంలోనే అతిపెద్ద జీవించి ఉన్న బల్లి జాతి. ఇది ఇండోనేషియాలోని కొమోడో ప్రాంతంలో కనిపిస్తుంది. (UNESCO World Heritage Centre)
ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు
గమనిక : ఇక్కడ ఇచ్చిన ప్రయాణ, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. విమాన టికెట్లు, హోటల్ ధరలు, వీసా రూల్స్ వంటి వివరాలు మారే అవకాశం ఉంటాయి. ప్రయాణానికి ముందు తాజా సమాచారాన్ని వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోండి.
- ఈ కథనం సాక్షి దినపత్రిక ఈ-పేపర్ లో కూడా ప్రచురితమైంది. కంటెంట్ రచయిత: ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు పాఠకుల కోసం పునఃప్రచురణ చేశారు.
- ఈపేపర్ స్క్రీన్ షాట్ చూడండి.
- మరిన్ని మీడియా పబ్లిషింగ్ రికార్డుల కోసం క్లిక్ చేయండి.

ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
