Haridwar Travel Guide – ఎలా వెళ్లాలి, ఎక్కడ ఉండాలి, బడ్జెట్, ఫుడ్, 1 , 2 రోజుల ప్లాన్ |
Haridwar Travel Guide : హరిద్వార్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి, హర్ కీ పౌరీ గంగా హారతి, మానసా దేవి, చండీ దేవి, కంఖల్, ఫుడ్, బడ్జెట్, లోకల్ ట్రాన్స్పోర్ట్ పూర్తి వివరాలు.
హరిద్వార్ పూర్తి ట్రావెల్ గైడ్ – హైదరాబాద్ నుండి హరిద్వార్ ఎలా వెళ్లాలి? | Hyderabad To Haridwar
హరిద్వార్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే అక్కడికి ఎలా వెళ్లాలి? ఎక్కడ ఉండాలి? హర్ కీ పౌరీతో పాటు ఏ గుడులు చూడాలి? మానసా దేవి, చండీ దేవి ఎలా వెళ్లాలి? ఏం తినాలి? లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది? ఒక రోజులో హరిద్వార్ మొత్తం కవర్ చేయగలమా?
హరిద్వార్ ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన ప్రతి విషయం ఈ ఒక్క బ్లాగ్ లో.
హరిద్వార్ ఎందుకు ప్రత్యేకం? | why Haridwar is Special ?
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ అనేది గంగానది పర్వత ప్రాంతాన్ని దాటి మైదానాల్లోకి ప్రవేశించే మొదటి పవిత్ర నగరం. అందుకే ఇది కేవలం ఒక గుడుల నగరం మాత్రమే కాదు, ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రకు గేట్ వే కూడా.
గంగా ఘాట్లు, పురాతన దేవాలయాలు, ఆశ్రమాలు, ఆధ్యాత్మిక వాతావరణం – ఇవన్నీ కలిసిన ప్రదేశమే హరిద్వార్.
హైదరాబాద్ నుండి హరిద్వార్ ఎలా వెళ్లాలి? | How To Reach Haridwar From Hyderabad
1. రైలు మార్గం – అత్యంత ప్రాక్టికల్
హైదరాబాద్ నుండి హరిద్వార్ వెళ్లడానికి రైలు ఒక మంచి ఆప్షన్. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి హరిద్వార్ కు రైళ్లు నడుస్తాయి. హరిద్వార్ రైల్వే స్టేషన్ నగరం మధ్యలోనే ఉంటుంది.
2. విమాన మార్గం
హరిద్వార్ కు దగ్గరలో ఉన్న డెహ్రాడూన్ లో జాలీ గ్రాంట్ విమానాశ్రయం ఉంది. మీరు ఢిల్లీ వరకు విమానంలో వెళ్లినా, అక్కడి నుండి రైలులో, బస్సులో, క్యాబ్ లో హరిద్వార్ చేరుకోవచ్చు.
ఢిల్లీ నుండి హరిద్వార్: బస్సు / రైలు / క్యాబ్ లో 5-6 గంటల ప్రయాణం.
హరిద్వార్ లో ఎక్కడ ఉండాలి? | Where To Stay
హరిద్వార్ లో ఎక్కడ ఉండాలి అనేది మీ ప్లాన్ ని బట్టి డిసైడ్ అవ్వాలి.
హర్ కీ పౌరీ ఏరియా: గంగా హారతికి దగ్గరగా, నడిచి వెళ్లే దూరంలో అన్నీ ఉంటాయి. ఫస్ట్ టైం వెళ్లేవారికి ఇదే బెస్ట్.
కంఖల్ ఏరియా: కొంచెం ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం కావాలనుకుంటే ఇక్కడ ఉండవచ్చు.
రిషికేశ్ రోడ్: రిషికేశ్ కూడా కవర్ చేయాలి అనుకుంటే ఈ ఏరియాలో ఉండటం మంచిది.
బడ్జెట్ హోటల్స్ నుండి ప్రీమియం హోటల్స్ వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి.
హరిద్వార్ లో తప్పక చూడాల్సిన ప్రదేశాలు | Places to Visit
1. హర్ కీ పౌరీ – గంగా ఘాట్ | Ganga Ghat at Haridwar
హరిద్వార్ లో మీ యాత్రను మొదలుపెట్టాల్సిన ప్రదేశం హర్ కీ పౌరీ. గంగానది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర ఘాట్ లో ఉదయం నుండి భక్తుల సందడి కనిపిస్తుంది. కానీ సాయంత్రం అయ్యేసరికి ఈ ప్రదేశం పూర్తిగా మరో ప్రపంచంలా మారిపోతుంది.
ముఖ్య సూచన: మీ ప్లాన్ లో హర్ కీ పౌరీకి ఒకసారి పగలు, ఒకసారి సాయంత్రం గంగా హారతి సమయంలో వెళ్లడానికి టైం కేటాయించండి. హారతిని చూడటానికే చాలా మంది హరిద్వార్ వస్తారు.
2. మానసా దేవి ఆలయం | Mansa Devi Temple
బిల్వ తీర్థంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం హరిద్వార్ లోని అత్యంత ప్రధానమైన ఆలయాలలో ఒకటి. కొండపై ఉన్న ఈ ఆలయానికి మీరు నడిచి (చిన్న ట్రెక్కింగ్) వెళ్లవచ్చు లేదా రోప్ వే (కేబుల్ కార్) లో వెళ్లవచ్చు.
పైన నుండి హరిద్వార్ నగరం చాలా అందంగా కనిపిస్తుంది. గుడి దర్శనంతో పాటు సిటీ వ్యూ కోసం కూడా ఇది మంచి ప్రదేశం.
3. చండీ దేవి ఆలయం | Chandi Devi Temple
నీల్ పర్వతంపై ఉన్న ఈ ఆలయానికి కేబుల్ కార్ లో వెళ్లడం ఒక థ్రిల్లింగ్ అనుభవం. పైన నుండి హరిద్వార్ అందాలను చూడవచ్చు.
జాగ్రత్త: గుడికి వెళ్లే దారిలో కొబ్బరికాయలు కొనమని చాలా మంది ఇబ్బంది పెడతారు. అవసరం ఉంటేనే కొనండి. మానసా దేవి, చండీ దేవి రెండింటినీ ఒకే రోజులో కవర్ చేయవచ్చు. లోకల్ కాంబో ప్యాకేజీలు కూడా ఉంటాయి.
4. కంఖల్ – దక్ష ప్రజాపతి ఆలయం | Daksha Prajapati Temple, Kankhal
మీ హరిద్వార్ ట్రిప్ ని కేవలం హర్ కీ పౌరీ వరకే పరిమితం చేయకండి. కంఖల్ వైపు వెళ్తే దక్ష ప్రజాపతి ఆలయం చూడొచ్చు. దీనిని పరమశివుడి అత్తారిల్లు అని, సతీ దేవి అగ్నిలోకి ప్రవేశించిన ప్రదేశం అని నమ్ముతారు.
ఇక్కడ సతీదేవి అగ్నిలోకి ప్రవేశించినట్లు చెప్పే సతీ కుండ్ ను కూడా చూడవచ్చు. ఆలయం పక్కనే ఉన్న గంగానది పాయలో పితృ కార్యాలు, గంగా పూజలు చేయవచ్చు.
హరిద్వార్ లో ఏం తినాలి? | Food
హరిద్వార్ ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ శాఖాహారానికే ప్రాధాన్యత.
- ఆలూ పూరీ
- కచోరి
- చోలే భటూరే
- లస్సీ
- జిలేబి
- కుల్చా, పరోటా
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి వేడి వేడి ఆలూ పూరీ లేదా కచోరి, తర్వాత ఒక ఫ్రెష్ లస్సీ, సాయంత్రం జిలేబి ట్రై చేయండి. సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఈజీగా దొరుకుతుంది.
లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా? | Local Transport
- నడక: హర్ కీ పౌరీ చుట్టుపక్కల ప్రదేశాలు నడిచి వెళ్లే దూరంలోనే ఉంటాయి.
- ఆటో / ఈ-రిక్షా: అత్యంత ప్రాక్టికల్. నేను మొత్తం రిక్షాలోనే తిరిగాను.
- క్యాబ్: ఫ్యామిలీతో అయితే కంఫర్టబుల్.
- షేరింగ్ ఆటో: హరిద్వార్ నుండి రిషికేశ్ వరకు కూడా వెళ్లవచ్చు.
హరిద్వార్ ట్రిప్ బడ్జెట్ ఎంత అవుతుంది? | Haridwar Budget
మీ బడ్జెట్ 3 విషయాలపై ఆధారపడుతుంది: ఎలా వెళ్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా?
రైలులో బడ్జెట్ ట్రావెల్ చేస్తే ఖర్చు తక్కువ, విమానంలో అయితే ఎక్కువ. సోలో అయితే బడ్జెట్ హోటల్ లో అడ్జస్ట్ అవ్వచ్చు, ఫ్యామిలీతో అయితే మిడ్ రేంజ్ రూమ్ తీసుకుంటే బెటర్.
నా అనుభవం: నేను రైలు, బస్సు, రిక్షా, యావరేజ్ రూమ్ లో ప్లాన్ చేసి టూర్ పూర్తి చేశాను. ఇంటికి వచ్చాక లెక్కేస్తే రోజుకు సుమారు రూ.4,000 వరకు ఖర్చు అయింది. మీ ట్రావెల్ స్టైల్ ను బట్టి ఇది మారుతుంది.
1 రోజులో హరిద్వార్ ప్లాన్ | 1 Day Haridwar Plan
ఒక్క రోజులో హరిద్వార్ ప్లాన్ చేస్తే ఇలా చేసుకోండి:
ఉదయం: మానసా దేవి / చండీ దేవి ఆలయం
మధ్యాహ్నం: కంఖల్ + దక్ష ప్రజాపతి ఆలయం + లంచ్, రెస్ట్
సాయంత్రం 5 గంటల నుండి: హర్ కీ పౌరీలో టైం స్పెండ్ చేసి, చివరగా గంగా హారతితో రోజును ముగించండి.
2 రోజుల హరిద్వార్ ప్లాన్ | 2 Days Haridwar Plan
రెండు రోజులు ఉంటే మరింత ప్రశాంతంగా చూడవచ్చు.
మొదటి రోజు: హర్ కీ పౌరీ, లోకల్ మార్కెట్స్, గంగా హారతి
రెండవ రోజు: మానసా దేవి, చండీ దేవి, కంఖల్, దక్ష ప్రజాపతి ఆలయం
ఇలా చేస్తే హరిద్వార్ ను పూర్తిగా ఎక్స్ ప్లోర్ చేయడంతో పాటు అక్కడి ఆధ్యాత్మికతను కూడా ఫీల్ అవ్వవచ్చు.
హరిద్వార్ కి షార్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తే – హర్ కీ పౌరీ తప్పక చూడాలి, మానసా దేవి, చండీ దేవి గుడులకు టైం కేటాయించాలి, కంఖల్ ను కూడా ప్లాన్ లో పెట్టుకోవచ్చు. స్టే, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ ముందే ప్లాన్ చేసుకుంటే ట్రిప్ ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది.
ఇలాంటి పూర్తి ట్రావెల్ గైడ్స్ కోసం ప్రయాణికుడుని ఫాలో అవ్వండి.
అలాగే హరిద్వార్పై నేను సిద్ధం చేసిన ఈ వీడియో చూడండి…నా 5 నాలుగు రోజుల హరిద్వార్ ఎక్స్పీరియెన్స్ కేవలం 9 నిమషాల్లో మీ కోసం
