Dasara 2026 : మైసూరు నుంచి బస్తర్ దాకా ఒకే పండుగ, ఐదు అద్భుతాలు!
Dasara 2026 : దసరా వెలుగులో భారతం ఎలా ఉంటుందో తెలుసా? మైసూరు ప్యాలెస్ లైటింగ్, కోల్‌కతా దుర్గా పూజ చక్షుదానం, వారణాసి రామ్ లీలా, కులూ దేవతల ఊరేగింపు, 75 రోజుల బస్తర్ దసరా – హైదరాబాద్ నుంచి బడ్జెట్, రూట్, స్టే, ఫుడ్ గైడ్ తో పూర్తి యాత్ర కథ.
దసరా అంటే కేవలం పండుగ మాత్రమే కాదు. అది ఒక ఎమోషన్.
చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా సెలబ్రేట్ చేసుకునే విజయదశమిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయులు సెలబ్రేట్ చేసుకుంటారు.
కొత్త బట్టలు, వాడవాడలా వెలసిన అమ్మవారి ప్రతిమలు, ప్రతి ఇంటి ముందు సందడి చేసే బతుకమ్మ పువ్వులు, విజయదశమి సందర్భంగా దాండియా ఆడే యువతీ యువకులు… ఒక్కసారిగా దేశం మొత్తం సెలబ్రేషన్స్లోకి వెళ్లిపోతుంది.
భారత దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా విజయదశమిని సెలబ్రేట్ చేస్తారు. అందులో కొన్ని వినూత్నమైన ప్రదేశాలు మీకోసం…
ముఖ్యాంశాలు
పశ్చిమ బెంగాల్ | Dasara in West Bengal
విజయదశమి అంటే ముందుగా పశ్చిమ బెంగాల్ గుర్తొస్తుంది. కోల్ కతాలో దసరా అంటే దుర్గా పూజ. ఈ సమయంలో బెంగాల్ లోని ప్రతి వీధి జాతరను తలపిస్తుంది. మట్టితో చేసిన దుర్గా విగ్రహాలను దర్శించుకుని భక్తులు తరిస్తారు.
డోలు శబ్దం వింటుంటే, తెలియకుండానే భక్తులు ఉద్వేగానికి గురవుతారు. కుమార్టులీ అనే వీధిలో ఏడాది పొడవునా అమ్మవారి విగ్రహాలే తయారు చేస్తారు. అయితే పండగకు రెండు రోజుల ముందు వెళ్తే అమ్మవారి ముఖానికి కళ్లు అతికించే చక్షుదానం అనే కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. అలాగే ఇదే సమయంలో జరిగే సింధూర్ ఖేలాలో ఆడవాళ్లు ఒకరికొకరు బొట్టు పెట్టుకుని అమ్మవారిని నిమజ్జనం చేసే ఆచారాన్ని వీక్షించవచ్చు.
- ఇది కూడా చదవండి : Gulmarg: భారత్‌లో వెలిసిన మంచు స్వర్గం గుల్మార్గ్ పూర్తి ట్రావెల్ గైడ్ | Gulmarg Complete Travel Guide
వారణాసి, యూపి | Dasara in Varanasi
వారణాసిలో దసరా అంటే రామ్ లీలా. ఉత్తర్ ప్రదేశ్ లోని ఈ ప్రాచీన నగరంలో రామ్ లీలా ఒక నెలపాటు జరుగుతుంది. గంగా తీరాన రామాయణం ప్రతి రోజు ప్రత్యక్షమవుతుంది. రావణ దహనం చేసే రోజు మణికర్ణిక ఘాట్ దగ్గర జనాలు కిక్కిరిసిపోతారు.
మైసూరు, కర్నాటక | Dasara in Mysore
దసరా సందర్భంగా చాలా మంది మైసూరు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. కర్ణాటకలోని ఈ నగరం ఈ సమయంలో కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబవుతుంది. మైసూరు ప్యాలెస్ రాత్రి సమయంలో దీపాలమయం అవుతుంది. ఒక లక్ష బల్బులు ఒకేసారి వెలిగితే, అది చూడటానికి రెండు కళ్లు చాలవు అనిపిస్తుంది.
కులూ, హిమాచల్ ప్రదేశ్ | Kullu Dasara
హిమాచల్ ప్రదేశ్ కు గుండెకాయ లాంటి కులూలో జరిగే దసరా వేడుకలు చాలా ప్రత్యేకం. చల్లని గాలిలో దేవతల ఊరేగింపును తీసుకెళ్లడం అక్కడి ఆచారాల్లో ఒకటి. కులూలో మొత్తం 365 దేవతలు ఉండగా… ఆ దేవతలను కులూ మైదానానికి తీసుకొస్తారు.
డోలు, నగారా మ్రోగుతుంటే, పహాడాల మధ్య డ్యాన్స్ చేస్తూ ఈ దేవతలను రఘునాథ్ జీని ( శ్రీరాముడు) రథంపై కూర్చోబెట్టి భక్తులు లాగుతారు. ఇలా రథం లాగిన తర్వాత 7 రోజుల పాటు కులూ మొత్తం ఫెస్టివల్ మోడ్ లోకి వెళ్లిపోతుంది.
బస్తర్, ఛత్తీస్ గఢ్ | Bastar Dasara
బస్తర్ లో దసరా వేడుకలు కాస్త భిన్నంగా జరుగుతాయి. ఛత్తీస్ గఢ్ అడవుల్లో గిరిజన సంస్కృతి పరిమళిస్తుంది. స్థానికుల జీవన విధానం, ఆచారాల ప్రకారం దసరా ఇక్కడ 75 రోజుల పాటు జరుగుతుంది. అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద దసరా వేడుక అని కూడా పిలుస్తారు.
- ఇది కూడా చదవండి : 3 రోజుల్లో రాజస్థాన్ రాయల్ ట్రిప్ ఎలా పూర్తి చేయాలి ? | Jaisalmer Desert Triangle Itinerary
ఎలా వెళ్లాలి? | How To Go
హైదరాబాద్ నుంచి ఈ యాత్ర మొదలు పెట్టడం బెటర్ ఉదయం ఎయిర్ పోర్ట్ కి ఛాయ్ తాగవచ్చు లేదా కాఫీ తాగుతూ ఫ్లైట్ ఎక్కొచ్చు. మైసూరుకి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోయినా, బెంగళూరు మీదుగా వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లే ప్రయాణం చాలా బాగుంటుంది. పచ్చని పొలాల మధ్య కార్ నడుస్తుంటే, దసరా సంబరాల వైబ్ ను మీరు ముందే ఫీల్ అవ్వొచ్చు.
విజయవాడ నుంచి ప్లాన్ చేసే వారు కూడా హైదరాబాద్ మీదుగా ప్లాన్ చేసుకోవచ్చు. విజయవాడలో కృష్ణా నదిని చూసి, మళ్లీ హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి కోల్ కతాకి వెళ్తే ఒక చిన్న ట్రాన్సిషన్ లా ఉంటుంది. కోల్ కతాకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి.
వారణాసికి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. కులూ కోసం చండీగఢ్ వరకు వెళ్లి, అక్కడి నుంచి పర్వతాల మధ్య జర్నీ చేయడం అద్భుతమైన అనుభవంగా మిగిలిపోతుంది.
బస్తర్ వెళ్లడానికి ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ వరకు ఫ్లైట్ లో వెళ్లి తర్వాత రోడ్డు మార్గంలో అడవిలో ప్రయాణించవచ్చు.
ఎక్కడ ఉండాలి? | Where To Stay ?
మైసూరులో ప్యాలెస్ దగ్గర ఉన్న హెరిటేజ్ బంగ్లాలో ఉంటే, మార్నింగ్ వాక్ సమయంలో ప్యాలెస్ గేట్ కనిపిస్తుంది. చెట్టు కింద టేబుల్ వేసి ఇచ్చే ఫిల్టర్ కాఫీలో కూడా పండుగ ఫ్లేవర్ ఉంటుంది. కోల్ కతాలో కుమార్టులీ దగ్గర ఉన్న బోటిక్ హోమ్ స్టేలో ఉంటే, రాత్రంతా డోలు శబ్దాన్నివింటూ నిద్రపోవచ్చు.
- ఇది కూడా చదవండి : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడ ఉండాలి, ఏం చూడాలి | Top 10 Tips To Visit Manali
వారణాసిలో గంగా తీరంలో ఉన్న ఘాట్ సైడ్ హోటల్లో ఉంటే, సుబహ్ ఎ బనారస్ హారతి చూడొచ్చు. కులూలో వుడెన్ కాటేజీలో ఉంటే, బయట చలిలో హీటర్ ముందు కూర్చుని చాయ్ తాగడం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ గా మిగిలిపోతుంది.
బస్తర్ లో చిత్రకోట్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న ఎకో రిసార్ట్ లో ఉంటే జలపాతాల సౌండ్ తో నిద్ర నుంచి మెలకువ వస్తుంది.
ఏం చూడాలి? | What To See ?
మైసూరులో సాయంత్రం సమయంలో లైటింగ్ చూడటం మాత్రమే కాదు, చాముండి హిల్స్ పై నుంచి సిటీని చూడడం అస్సలు మిస్ అవ్వకూడదు. కోల్ కతాలో పూజా పండాల్స్ లో లైట్ ఆర్ట్, థీమ్ ఆర్ట్ చూడాలి.
వారణాసిలో రామ్ లీలా జరిగే సమయంలో శ్రీరాముడు ధనస్సు ఎత్తి బాణం వదిలే సమయంలో భక్తుల హడావిడి మామూలుగా ఉండదు. కులూలో దేవతలు అంతా ఒకేచోటికి చేరుకోవడం, తర్వాత జరిగే కార్యక్రమాలు వినూత్నంగా అనిపిస్తాయి. బస్తర్ లో రథాన్ని లాగే సమయంలో గిరిజన యువతుల ఆట పాటలు ఆకట్టుకునేలా ఉంటాయి.
ఏం తినాలి? | What To Eat ?
మైసూరులో మైసూర్ పాక్, మసాలా దోసె, అక్కి రొట్టి ఎంజాయ్ చేయవచ్చు. కోల్ కతాలో భోగ్ ప్రసాదం, ఖిచురి, లాబ్రా, మిష్టి దోయ్ ట్రై చేయవచ్చు. వారణాసిలో కచోరీ సబ్జీ, మలైయ్యో, లస్సీ, సమోసా ట్రై చేయవచ్చు. కులూలో సిద్దు, ట్రౌట్ ఫిష్, యాపిల్ తో చేసే స్వీట్స్ ట్రై చేయవచ్చు. బస్తర్ లో చప్డా చట్నీ, బాంబూ చికెన్, మహువాతో చేసిన లోకల్ స్నాక్స్ ట్రై చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? భారత దేశ సంస్కృతిలో ప్రాధాన్యత ఏంటి ? | Jammu and Kashmir
ఇవి మిస్ అవ్వకండి
ఎక్కడికి వెళ్లినా మనం చెక్ లిస్ట్ ప్రకారం ఒక్కో టాస్క్ ఫినిష్ చేస్తూ ముందుకు వెళ్లిపోతాం. కానీ లిస్ట్ లో లేని చిన్న చిన్న ఆనందాలను మిస్ అవ్వకూడదు. మైసూరులో అంబారీ వెనుక నడవడం ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలిగిస్తుంది.
కోల్ కతాలో పూజా పండాల్స్ లో కాసేపు కూర్చుని అమ్మవారి వైభవాన్ని కీర్తించడం మిస్ అవ్వకూడదు. వారణాసిలో గంగా హారతిలో ఒక చిన్న దీపం వదిలి మనసులో ఉన్న కోరిక చెప్పడం మర్చిపోకండి.
కులూలో కొండల మధ్య సాగే ఊరేగింపులో డోలు వాయిద్యాల చప్పుళ్లకు అనుగుణంగా నడవడం మిస్ అవ్వకూడదు. బస్తర్ లో దంతేశ్వరీ మాత రథాన్ని టచ్ చేసే ఛాన్స్ వస్తే అస్సలు మిస్ అవ్వకూడదు. ఇవి చెక్ లిస్ట్ కావు, ఇవే ప్రయాణాన్ని గుర్తుండిపోయేలా చేసే క్షణాలు.
యాత్ర, బడ్జెట్ వివరాలు | Budget
హైదరాబాద్ నుంచి ఐదు రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తే సరిపోతుంది. అన్ని ప్రదేశాలు వరుసగా కవర్ చేయడం కాస్త కష్టమే. కానీ అన్నీ కవర్ చేయాలనుకోకుండా ఒక ప్రదేశం సెలెక్ట్ చేసుకుని అక్కడే ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి.
ఏ ప్రదేశానికి వెళ్లినా బడ్జెట్ ట్రావెల్ కోసం మీరు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ బడ్జెట్ రూ.60 వేల నుంచి 75 వేలకు పెరుగుతుంది. ప్రీమియం ట్రిప్ ప్లాన్ చేస్తే మీ బడ్జెట్ లక్ష కూడా దాటుతుంది.
విజయదశమి సమయంలో ఎక్కడికి వెళ్లాలనుకున్నా ట్రైన్, ఫ్లైట్ టికెట్లు దొరకడం కష్టం. రైలు టికెట్లు బుక్ అవ్వవు, ఫ్లైట్ టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి.
స్టే విషయానికి వస్తే బడ్జెట్ రూమ్స్ రూ.900 నుంచి రూ.2500 వరకు, స్టాండర్డ్ రూమ్స్ రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు, ప్రీమియం రూమ్స్ రూ.8 వేల నుంచి 25 వేల మధ్యలో ఉంటాయి.
ఫుడ్ విషయానికి వస్తే ఒక్క వ్యక్తికి రోజూ రూ.500 నుంచి 3000 వరకు లేదా అంతకు మించి ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
ఆసక్తికరమైన విషయాలు | Interesting Facts
- మైసూరు దసరాకి 400 సంవత్సరాల చరిత్ర ఉంది, వడియార్ రాజుల కాలం నుంచి కొనసాగుతోంది.
- కోల్ కతా దుర్గా పూజ UNESCO ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గా గుర్తింపు పొందింది.
- వారణాసి రామ్ లీలా సుమారు నెలపాటు జరిగే పెద్ద నాటకం.
- కులూ దసరా విజయదశమి రోజు మొదలవుతుంది, అంటే మిగిలిన చోట్ల అయిపోయాక.
- బస్తర్ దసరా దేశంలో 75 రోజులు జరుగుతుంది, ప్రపంచంలోనే అతిపెద్దది.
ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు
▶️ వీడియో చూడండి : హరిద్వార్ కంప్లీట్ గైడ్
