₹2000 UPI charges : ₹2000 దాటితే యూపీఐ కి డబ్బు కట్టాలా? ప్రయాణికులు తెలుసుకోవాల్సిన విషయాలివే!
₹2000 UPI charges : ₹2000 దాటితే యూపీఐకి డబ్బు కట్టాలా? ప్రయాణంలో UPI ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు ఛార్జీలు, పరిమితులు, ముఖ్యమైన నియమాలు తెలుసుకోండి.
పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి హోటల్ చేరే వరకు మనం ఎన్ని సార్లు UPI చేస్తాం. ఆటోకి, టీకి, బస్సు టికెట్టుకి, గుడి దర్శనానికి, హోటల్ అద్దెకి అన్నిటికీ యూపీఐ నే వినియోగిస్తాము. ఇప్పుడు కొత్తగా రెండు వేలు దాటితే యూపీఐకి రుసుము అనే మాట వినగానే చాలా మందికి భయం వచ్చింది. ప్రయాణంలో యూపీఐ వాడితే మన జేబుకే చిల్లు పడుతుందా అని.
అసలు నిజం ఏంటో ఈరోజు తేది 16 సెప్టెంబర్ 2026 నాటి అధికారిక సమాచారం ఆధారంగా చాలా సులువుగా చూద్దాం.
అసలు కొత్త నిబంధన ఏమిటి?
ప్రభుత్వం యూపీఐ విధానం మొత్తాన్నిమార్చడం లేదు. కేవలం ఒక చిన్న మార్పు మాత్రమే తెచ్చింది. అక్టోబర్ 15, 2026 నుండి, దుకాణాలకు చేసే ₹2000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపుపై 0.4 శాతం రుసుము ఉంటుంది అని తెలిపింది.
దీన్నే MDR (Merchant Discount Rate) అంటారు. 75 వేల పైన ఎంత పెద్ద మొత్తమైనా ఈ రుసుము గరిష్టంగా 300 రూపాయలు మాత్రమే.
2000 వరకు చేసే చెల్లింపులపై ఎలాంటి రుసుము ఉండదు. మనం రోజూ చేసే యూపీఐ లలో 95 శాతం ఈ పరిధిలోనే ఉంటాయి కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ప్రయాణికుడు యాంగిల్లో వివరిస్తాను.
మీరు శ్రీశైలం వెళ్తున్నారనుకోండి.
ఉదయం పూట ఇంటి నుండి బస్టాండ్ కి ఆటో 150, దారిలో చాయ్ 40, బస్ టికెట్ 800. ఇవన్నీ రెండు వేల లోపే. కాబట్టి ఎలాంటి రుసుము లేదు. ఎప్పటిలాగే జరుగుతుంది.
మధ్యాహ్నం పూట గుడి దగ్గర దర్శనం టికెట్ 300, ప్రసాదం 250, పార్కింగ్ 50. ఇవీ రెండు వేల లోపే. ఇక్కడా ఎలాంటి ఇబ్బంది లేదు.
సాయంత్రం పూట అసలు విషయం ఇక్కడే. మీరు హోటల్ కి వెళ్లి రెండు రోజులకు రూ.8000 యూపీఐ చేశారనుకోండి. ఇది రెండు వేలు దాటింది కాబట్టి ఇక్కడే కొత్త నిబంధన వర్తిస్తుంది. రూ 8000 కి 0.4 శాతం అంటే 32 రూపాయలు ఎండిఆర్ ఉంటుంది. మరి ఆ 32 రూపాయలు మనం కట్టాలా? లేదు.
ఇదే అందరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం.
ఈ 32 రూపాయలు అనేది మీరు కట్టే అదనపు రుసుము కాదు. ఇది దుకాణదారుడు బ్యాంకుకు కట్టే రుసుము. కొనేవారు యూపీఐ ని ఎప్పటిలాగే ఉచితంగానే వాడుకోవచ్చని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.
అయితే హోటల్ వాళ్ళు యూపీఐ కి 2 శాతం ఎక్కువ అని మీ బిల్లులో కలిపి వసూలు చేయకూడదు. ఒకవేళ ఎవరైనా అలా అడిగితే, ఇది దుకాణదారుల రుసుము కదా, నేను ఎందుకు కట్టాలి అని సున్నితంగా అడగవచ్చు.
సొంత వాళ్ళకి డబ్బు పంపితే?
మీరు ప్రయాణాలు చేస్తున్న సమయంలో దారిలో స్నేహితుడికి 5000, ఇంటికి 10000 పంపినా దానికి ఈ నిబంధన వర్తించదు. వ్యక్తి నుండి వ్యక్తికి పంపే చెల్లింపులపై ఎంత మొత్తమైనా ఎలాంటి రుసుము లేదు. అది ఎప్పటిలాగే ఉచితమే.
ప్రయాణికుడిగా మీరు ఏం గుర్తుంచుకోవాలి?
1.రెండు వేలు అనేది హద్దు కాదు. రెండు వేలు దాటితే యూపీఐ ఆగిపోదు. చెల్లింపు జరుగుతుంది.
2.పెద్ద బిల్లుల దగ్గర ఒకసారి చూడండి. హోటల్, క్యాబ్ అద్దె లాంటి పెద్ద మొత్తం చెల్లించేటప్పుడు బిల్లులో యూపీఐ రుసుము అని ఏదైనా రాసి ఉందా అని చూడండి.
3. ప్రయాణంలో నెట్వర్క్ సమస్య రావచ్చు. అందుకే యూపీఐ తో పాటు ఒక కార్డు, కొంచెం నగదు దగ్గర ఉంచుకోవడం ఎప్పుడూ మంచిది.
రోజువారీ ప్రయాణంలో 40 రూపాయల టీ, 150 రూపాయల ఆటో, 800 రూపాయల టికెట్ లాంటి 95 శాతం చెల్లింపులపై ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది ప్రభుత్వం. అయితే మారేది ఏంటంటే రెండు వేలు దాటిన పెద్ద మర్చెంట్ అంటే షాపుల్లో, వ్యాపారాల్లో చెల్లింపుల విధానం మాత్రమే. అది కూడా కొనుగోలుదారులు కాకుండా సెల్లర్సే వాటిని కట్టాల్సి ఉంటుంది అని తెలిపింది ప్రభుత్వం.
నియమం తెలిస్తే, ప్రయాణంలో చిన్న చెల్లింపు కూడా పెద్ద గందరగోళంగా మారదు.ఇది ప్రయాణికుడు – మీ ప్రయాణం ఎక్కడా ఆగకూడదనే మా ప్రయత్నం.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
