Raksha Bandhan Gift : గిఫ్ట్‌లు కాదు.. ఈసారి మీ సోదరిని ఈ టూరిస్ట్ ప్లేసులకు తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయండి!
Raksha Bandhan Gift : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీక రాఖీ పండుగ. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగ రోజున సోదరి ప్రేమతో తన సోదరుడికి రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకుంటుంది. సోదరుడు తన సోదరికి రక్షణగా ఉంటానని మాట ఇచ్చి, ఏదైనా గిఫ్ట్ ఇస్తాడు. అయితే, ఎప్పుడూ ఒకే రకమైన గిఫ్ట్‌లు ఇవ్వకుండా ఈసారి మీ సోదరిని ఒక ట్రిప్‌కు తీసుకెళ్లి సర్ప్రైజ్ చేస్తే ఎలా ఉంటుంది? గిఫ్ట్‌లు కొంత కాలం తర్వాత పాతబడొచ్చు కానీ, కలిసి ప్రయాణించిన జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ రాఖీ పండుగను మర్చిపోలేని అనుభూతిగా మార్చడానికి మీరు మీ సోదరిని తీసుకెళ్లగల కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.
మున్నార్
నగర జీవితపు హడావిడి, కాలుష్యానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునేవారికి కేరళలోని మున్నార్ ఒక అద్భుతమైన ప్రదేశం. చుట్టూ పచ్చని తేయాకు తోటలు, కాఫీ తోటలు, పైనుంచి జాలువారే జలపాతాలు, చల్లని వాతావరణం మున్నార్‌లోని ప్రత్యేకత. శ్రావణ మాసంలో ఇక్కడి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ సోదరితో కలిసి టీ తోటల్లో నడుస్తూ, అట్టకడ్ లేదా లక్కం జలపాతాల దగ్గర గడిపిన క్షణాలు మధురానుభూతిని ఇస్తాయి. ఒకవేళ మీ సోదరికి ఫోటోలు తీసుకునే అలవాటు ఉంటే ఈ ప్రదేశం ఆమెకు స్వర్గంలా అనిపిస్తుంది.

రిషికేష్
మీ సోదరి సాహసాలను ఇష్టపడితే, ఉత్తరాఖండ్‌లోని రిషికేష్ సరైన ఎంపిక. ఇక్కడ ఒకవైపు ఆధ్యాత్మిక ప్రశాంతత, మరోవైపు అద్భుతమైన అడ్వెంచర్స్ రెండూ ఉంటాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో శివ భక్తులతో ఈ ప్రదేశం మరింత కళకళలాడుతుంది. మీరు మీ సోదరితో కలిసి గంగా నదిలో రాఫ్టింగ్ చేసి, సస్పెన్షన్ బ్రిడ్జ్లైన లక్ష్మణ్ ఝూలా, రామ్ ఝూలా మీదుగా నడవొచ్చు. ఇక సాయంత్రం వేళ త్రివేణి ఘాట్‌లో జరిగే గంగా హారతిని చూడటం ఒక మర్చిపోలేని అనుభవం. సాహసం, ఆధ్యాత్మికత రెండూ కలగలిపిన ఈ ప్రదేశం మీ బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
ఉదయపూర్
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ను సరస్సుల నగరం అంటారు. ఇక్కడి అందమైన సరస్సులు, రాజభవనాలు, కోటలు మనల్ని ఒక పాతకాలపు రాజుల యుగంలోకి తీసుకెళ్తాయి. ప్రశాంతమైన సరస్సుల మధ్య, పచ్చని చెట్ల మధ్య సమయం గడపాలని కోరుకునే వారికి ఇది ఉత్తమమైన ప్రదేశం. లేక్ పిచోలాలో బోట్లో ప్రయాణించడం, సిటీ ప్యాలెస్, సలహేలియోంకి బారి వింటేజ్ కార్ మ్యూజియం వంటి ప్రదేశాలను చూడటం నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అందమైన ఫోటోలు, వీడియోలు తీసుకునే అవకాశం కూడా ఇక్కడ పుష్కలంగా ఉంటుంది. రక్షాబంధన్‌ను ఒక రాయల్ ట్రిప్‌తో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది సరైన ఛాయిస్.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
గోవా
సముద్రపు అలల మధ్య ఆనందంగా గడపాలని అనుకుంటే, గోవా ఒక అద్భుతమైన ప్రదేశం. గోవా అంటే కేవలం పార్టీలు, రాత్రుళ్లు మాత్రమే కాదు, అక్కడ ప్రశాంతంగా గడపడానికి కూడా చాలా బీచ్‌లు ఉన్నాయి. బాగా బీచ్, కలాంగుట్ బీచ్‌లలో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక ప్రశాంతంగా సూర్యాస్తమయాన్ని చూడాలనుకుంటే పలోలెం బీచ్‌కు వెళ్లొచ్చు. అంతేకాకుండా, పాత గోవాలోని చారిత్రక చర్చిలను సందర్శించడం, అక్కడి స్థానిక గోవా వంటకాలను రుచి చూడటం కూడా మంచి అనుభవాన్ని ఇస్తుంది. మీ సోదరితో కలిసి సముద్రపు ఒడ్డున కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకోవడానికి, గతాన్ని నెమరువేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం.
ఈ రాఖీ పండుగను గిఫ్ట్‌లతో కాకుండా, ఇలాంటి ట్రిప్లతో జీవితాంతం గుర్తుండిపోయేలా మార్చుకోండి. మీ సోదరి మొహంలో సంతోషం చూసి ఆనందించండి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.