హుండీ లేని గుడి, కోరికలు తీర్చే తల్లి – చార్మినార్ భాగ్యలక్ష్మీ రహస్యం! – bhagyalakshmi Temple
bhagyalakshmi Temple : హైదరాబాద్ నడిబొడ్డున, చార్మినార్ పక్కనే కొలువై ఉన్న శక్తివంతమైన దేవాలయం శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం. చార్మినార్ ఆగ్నేయ స్తంభాన్ని ఆనుకుని ఉన్న ఈ మహిమాన్విత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు దూరదూరం నుంచి తరలివస్తుంటారు.
చాలా మంది రీల్స్ చేశారు కానీ అసలు ప్రాక్టికల్ ఇన్ఫో ఎవరూ చెప్పలేదు. అందుకే నేను డైరెక్ట్ గా వెళ్లి తెలుసుకొచ్చిన పూర్తి వివరాలు ఇవి.
ఇది హైదరాబాద్ టెంపుల్ రష్ సిరీస్ లో రెండో ఆలయం. హైదరాబాద్ లోని 50 ముఖ్యమైన గుడులను ఇలాగే ప్రాక్టికల్ గా కవర్ చేస్తాను.
ఆలయ చరిత్ర – రెండు కథలు | History Of Bhagya Lakhsmi Mata Temple
చార్మినార్ ను 1591 లో మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించాడు అని అందరికీ తెలుసు. అయితే భాగ్యలక్ష్మీ ఆలయం ఎప్పుడు వచ్చిందనే దానిపై రెండు వర్షన్స్ ఉన్నాయి. మొదటి కథనం ప్రకారం చార్మినార్ కట్టినప్పటి నుండే అమ్మవారు ఇక్కడ నగర రక్షణ కోసం వెలసిందని అంటారు. హైదరాబాద్ ను లక్ష్మీ దేవి దీవిస్తుంది కాబట్టే చార్మినార్ ఇప్పటికీ నిలబడి ఉందని భక్తుల నమ్మకం.
రెండో కథనం ప్రకారం ఇది 1960 లో చిన్న గుడిగా మొదలై తర్వాత క్రమంగా ఆలయంగా విస్తరించింది అని చెబుతారు.
ఏది ఏమైనా గత 60 ఏళ్లుగా ఈ గుడి చార్మినార్ లో ఒక భాగం అయిపోయింది. చార్మినార్ అంటేనే భాగ్యలక్ష్మీ గుడి అయిపోయింది.
- ఇది కూడా చదవండి : సింహాచలం ఆలయం చరిత్ర, ట్రావెల్ గైడ్
అమ్మవారి ప్రత్యేకత ఏంటి | Speciality of Bhagya Lakhsmi Mata Temple
భాగ్యలక్ష్మీ అంటే భాగ్యాన్ని ఇచ్చే లక్ష్మీ అని అర్థం. ఇక్కడ కొబ్బరికాయ కొడితే భాగ్యం కలిసి వస్తుందని, వ్యాపారం బాగుంటుందని ఓల్డ్ సిటీలోని వేల మంది వ్యాపారస్తుల గట్టి నమ్మకం. అందుకే వాళ్లు ఉదయం షాపు తెరిచే ముందు మొదట అమ్మవారిని దర్శించుకుని తర్వాతే వ్యాపారం మొదలు పెడతారు.
ఈ గుడికి హుండీ ఉండదు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు, అదే ఇక్కడి ప్రత్యేకత.
ముఖ్యంగా దీపావళి పండుగ రోజు ఇక్కడ లక్షల మంది వస్తారు, ఆ రోజు హైదరాబాద్ లోనే అతి పెద్ద జాతర ఇక్కడే జరుగుతుంది.
దర్శన వేళలు | Timings
చాలా మంది మధ్యాహ్నం గుడి క్లోజ్ చేస్తారు అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు.
- గుడి వేళలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10:30 వరకు నాన్ స్టాప్ గా తెరిచే ఉంటుంది. మధ్యాహ్నం క్లోజ్ చేయరు.
- ఎంట్రీ ఫీజు లేదు, పూర్తిగా ఉచిత దర్శనం
- స్పెషల్ దర్శనం ఫీజు లేదు
- సాధారణ రోజుల్లో దర్శనం కేవలం 5 నిమిషాల్లో అయిపోతుంది
- రద్దీ రోజులు శుక్రవారం, దీపావళి, దసరా రోజుల్లో మాత్రం గంటకు పైగా పడుతుంది
- హారతి వేళలు ఉదయం 7 గంటలకు, సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్యలో జరుగుతుంది
ఎప్పుడు వెళితే బెస్ట్ | Best Time
ఉదయం 6 – 9 గంటల మధ్య, సాయంత్రం 6 – 10 గంటల మధ్య. అప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది, దర్శనం ప్రశాంతంగా ఉంటుంది. శుక్రవారం స్పెషల్ పూజ ఉంటుంది.
ఎలా వెళ్ళాలి పార్కింగ్ ఎక్కడ ? | Parking
మెట్రోలో వస్తే ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లేదా షా అలీ బండ మెట్రో స్టేషన్ లో దిగాలి. అక్కడి నుండి చార్మినార్ కి ఆటోలో 10 నిమిషాలు పడుతుంది. ఆటో చార్జ్ రూ. 50.
బస్సులో వస్తే చార్మినార్ బస్ స్టాప్ లో దిగితే చాలు, గుడి ఎదురుగానే ఉంటుంది. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుండి చార్మినార్ కి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి.
బైక్ లేదా కారు మీద వస్తే జాగ్రత్త ఇక్కడ సందులు చాలా ఇరుకు, పార్కింగ్ ప్లేస్ అస్సలు దొరకదు, పోలీసులు ఫైన్ వేస్తారు.
నా సలహా ఇక్కడికి కారులో రాకండి. వీలైతే మెట్రో లేదా క్యాబ్ లేదా బైక్ సర్వీస్ వాడుకోండి.
మరి పార్కింగ్ ఎక్కడ ?
చార్మినార్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ లో పెట్టాలి. చార్జ్ రూ. 30 నుండి రూ. 50. అక్కడి నుండి గుడికి 3 నిమిషాలు నడిచి రావచ్చు.
పూజ సామాన్లు ఎంత ?
గుడి ముందే పూలు, కొబ్బరికాయ, కుంకుమ అమ్ముతారు. ఒక సెట్ రూ. 20 నుండి రూ. 50 ఉంటుంది. ఆదివారం, పండుగ రోజుల్లో కాస్త ఎక్కువ చెబుతారు.
చార్మినార్ దగ్గర చూడాల్సినవి – వన్ డే ప్లాన్ | Charminar One Day Plan
భాగ్యలక్ష్మీ గుడి దర్శనం 5 నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి ఒకే రోజులో ఇవన్నీ కవర్ చేయవచ్చు.
- చార్మినార్
- చార్మినార్ పోలీస్ స్టేషన్ దగ్గర మహాదేవ్ మందిర్
- చార్కమాన్ శివాలయం
- సాలార్ జంగ్ మ్యూజియం
- బేగం బజార్ వైపు వెళ్తే భూలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోండి నేను ఈ ఆలయంపై వీడియో కూడా చేశాను. చూడండి
బడ్జెట్, ఫుడ్, స్టే | Food and Stay
దర్శనం ఉచితం. రవాణా, ఫుడ్ తో కలిపి రూ. 500 లో పూర్తి చార్మినార్ యాత్ర అయిపోతుంది.
ఫుడ్ నిమ్రా కేఫ్ లో ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ తప్పకుండా ట్రై చేయండి. అమ్మవారి దర్శనానికి ముందు తరువాత బిర్యానీ, హలీమ్ వంటి నాన్ వెజ్ ఫుడ్ ఎవాయిడ్ చేయండి. ఆలయ, ధర్మ పవిత్రతను కాపాడండి.
స్టే వచ్చేసి అఫ్జల్ గంజ్ దగ్గర ధర్మశాలలు రూ. 500 నుండి దొరుకుతాయి. చార్మినార్ దగ్గర హోటల్స్ రూ. 1000 నుండి రూ. 2000.
ప్రయాణికుడి చిట్కాలు | Travel Tips
1. గుడి లోపల ఫోన్ సైలెంట్ లో పెట్టండి. ఫ్లాష్ వేసి ఫోటో తీయకండి.
2. శుక్రవారం సాయంత్రం వెళ్లకండి, క్యూ చాలా పెద్దగా ఉంటుంది.
3. ఓల్డ్ సిటీలో జనం రద్దీ ఎక్కువ, మీ బ్యాగ్, మొబైల్ జాగ్రత్త.
4. ఉదయం 7 గంటల హారతి సమయానికి వెళితే దివ్యమైన దర్శనం దొరుకుతుంది.
పూర్తి వీడియో ఇక్కడ చూడండి పూజారి గారు చెప్పిన చరిత్ర, భక్తుల మాటలు, పార్కింగ్ ఇష్యూ మొత్తం వీడియోలో ఉంది –
చూశారు కదా, గుడి చిన్నదే కానీ అమ్మవారి మహిమ గలది. ఓల్డ్ సిటీకి వస్తే ఈ అమ్మవారిని దర్శించుకోకుండా ఎవరూ వెళ్లరు. ఇది మన హైదరాబాద్ చరిత్రలో, భక్తి, విశ్వాసాల్లో ఒక భాగం అయిపోయింది.
నేను మీ ప్రయాణికుడు, MG KISHORE. మళ్ళీ హైదరాబాద్ టెంపుల్ రష్ సిరీస్ లో 3వ ఎపిసోడ్ లో కలుద్దాం.
అలాగే బేగంబజార్ భూ లక్ష్మీ అమ్మవారి ఆలయం విశేషాలు కూడా చూడండి
