Handicrafts Exhibition : చేతివృత్తుల వారికి చేయూత.. ట్యాంక్ బండ్ వద్ద బీసీ కళాకారుల ఉత్పత్తుల భారీ ప్రదర్శన షురూ!
Bonalu Festival : తెలంగాణ రాష్ట్రంలో చేతివృత్తుల వారికి, కుటీర పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. ప్రజలకు ఉపాధి, ఆదాయం పెంచే ఈ పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల స్టాళ్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. చేతివృత్తులు, కళాకారుల ఉత్పత్తులు సమాజానికి చాలా ఉపయోగపడతాయని అన్నారు. ఈ చేతివృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, నిధులు కూడా కేటాయిస్తుందని తెలిపారు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ నగరం నుంచే కాకుండా , ఇతర జిల్లాల నుంచి కూడా కుటీర పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంటాయి. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ప్రదర్శనను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఇక్కడికి వచ్చి ప్రదర్శనను చూసి, మీకు నచ్చిన వస్తువులు, ముఖ్యంగా పర్యావరణహితమైన, ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులను కొనుగోలు చేసి చేతివృత్తుల వారికి చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఈ ప్రదర్శన బోనాల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ కుల సంఘాలు పెద్ద ఎత్తున ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ఈ ఎగ్జిబిషన్లో చాలా రకాల బీసీ కుల కళాకారులు చేసిన వస్తువులు ప్రదర్శించబడ్డాయి. డిప్యూటీ సీఎం స్వయంగా ఈ స్టాళ్లను సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమ్మరులు తయారు చేసిన మట్టిపాత్రలు, మేదరి వారు తయారు చేసిన వెదురు వస్తువులు, పూసల వారి సామగ్రి, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత ఉత్పత్తులు, గౌడ అన్నలు ఏర్పాటు చేసిన ‘నీరా’ , బెస్త సోదరులు ఏర్పాటు చేసిన చేపల వంటకాలు, ఇతర భోజన స్టాల్స్ ఉపయోగించుకోవాలని ప్రజలను కోరారు. ఈ స్టాళ్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి డిప్యూటీ సీఎం రుచి చూశారు. ఇవే కాకుండా, వివిధ రకాల తెలంగాణ వంటకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
బీసీ సంక్షేమ శాఖ చరిత్రలోనే మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన బీసీ చేతివృత్తుల కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనను హైదరాబాద్‌లో నిర్వహించడంపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఈ ఎగ్జిబిషన్ బీసీ చేతివృత్తుల కళాకారులకు ఒక మంచి ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తుంది. ఇది వారి ఉత్పత్తులను ప్రజలకు చేరవేయడానికి, తద్వారా వారికి ఉపాధిని, ఆదాయాన్ని పెంచడానికి దోహదపడుతుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.