శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు Tirumala 121 Kg Gold Donation
Tirumala 121 Kg Gold Donation : 121 కిలోల బంగారు, వజ్రాభరణాల కానుక. చెన్నై జైన్ దంపతులు శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన ఆభరణాలు సమర్పించారు. సీఎం చంద్రబాబు పాల్గొని దాతృత్వాన్ని ప్రశంసించారు.
తిరుమల శ్రీవారి భక్తి పరంపరలో మరో విశేష ఘట్టం చోటుచేసుకుంది. చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్, ఆయన భార్య రాధికా జైన్ గురువారం నవంబర్ 26న శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సుమారు 121 కిలోల బంగారు, వజ్రాభరణాలను సమర్పించారు. ఈ కానుక విలువ దాదాపు రూ.206 కోట్లుగా అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సమర్పణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. టీటీడీ అర్చకులు, అధికారులు దాతల నుంచి ఆభరణాలను స్వీకరించారు. ఈ భారీ దాతృత్వాన్ని ముఖ్యమంత్రి ప్రశంసిస్తూ, సంపద కంటే ధర్మం, ఆధ్యాత్మికత, సేవాభావం మనిషికి నిజమైన ఆనందాన్ని ఇస్తాయని పేర్కొన్నారు.
- ఇది కూడా చదవండి : Arunachalam: అరుణాచల పర్వతంపైకి వెళ్లొచ్చా? గిరి ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి? పూర్తి గైడ్
శ్రీవారికి సమర్పించిన ఆభరణాల్లో బంగారు కిరీటం, పాదాలకు అలంకరించే ఆభరణాలు, ఇతర విలువైన నగలు ఉన్నాయి. ఈ కానుక ద్వారా భక్తి, దాతృత్వం రెండింటినీ చాటిన జైన్ దంపతులను సీఎం అభినందించారు.
విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు కూడా తిరుమల శ్రీవారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. రాజుల కాలం నుంచి నేటి వరకు స్వామివారిపై భక్తి, కానుకల సంప్రదాయం కొనసాగుతోందని అన్నారు.
“మానవ సేవే మాధవ సేవ” అనే భావనను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సీఎం పిలుపునిచ్చారు. పేదల సంక్షేమం, విద్య, వైద్యం, ఆధ్యాత్మిక సేవలకు సంపన్నులు ముందుకు రావాలని సూచించారు.భక్తి అనేది కేవలం ప్రార్థనలోనే కాదు.. సమాజానికి ఉపయోగపడే సేవలోనూ కనిపిస్తుందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
▶️ వీడియో చూడండి : పండరిపురం ట్రావెల్ గైడ్
