Budget Travel : చలికాలం టూర్ ప్లాన్ చేస్తున్నారా? ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఈ పర్యాటక ప్రాంతం ఇదే
Budget Travel : డిసెంబర్ వచ్చిందంటే చాలు చలికాలపు సెలవులకు ఎక్కడికి వెళ్లాలా అని ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వెతుకుతూ ఉంటారు. అయితే, బాలీ, ఫుకెట్ వంటి ఖరీదైన హాలిడే స్పాట్లకు షాక్ ఇస్తూ, ఈ ఏడాది వియత్నాంలోని అద్భుతమైన హోయ్ ఆన్ నగరం ప్రపంచంలోనే అత్యంత చౌకైన హాలిడే డెష్టినేషన్ గా నిలిచింది. యూకే పోస్ట్ ఆఫీస్ ట్రావెల్ మనీ లాంగ్ హాల్ హాలిడే నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఆహారం, పానీయాలు, సన్‌స్క్రీన్, కాక్టెయిల్స్ వంటి నిత్యావసర వస్తువుల ధరలను పోల్చి, ఈ ర్యాంకింగ్‌ను ఇచ్చారు.
హోయ్ ఆన్: రోజువారీ ఖర్చు రూ.6,971 మాత్రమే
వియత్నాంలోని హోయ్ ఆన్ నగరం పర్యాటకులకు బడ్జెట్ ఫ్రెండ్లీ గెట్అవేను అందిస్తోంది. ప్రపంచంలోని 30 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చి చూసిన తర్వాత, హోయ్ ఆన్ నగరమే అత్యంత చౌకైన ప్రాంతంగా స్పష్టం అయింది. ఈ నివేదిక ప్రకారం, హోయ్ ఆన్‌లో ఆహారం, పానీయాలు, ఇతర పర్యాటక అవసరాలతో కూడిన బాస్కెట్ ఆఫ్ ఐటమ్స్ ధర కేవలం రూ.6,971 మాత్రమే. అంటే, రోజువారీ అవసరాలకు రూ. 7 వేల లోపే ఖర్చు అవుతుంది.

తక్కువ ఖర్చుతో విలాసవంతమైన డిన్నర్
హోయ్ ఆన్‌లో ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా, ఇద్దరు వ్యక్తులకు వైన్‌తో కూడిన త్రీ-కోర్స్ డిన్నర్ ఖర్చు రూ.4,741 మాత్రమే. స్థానిక లాగర్ బీర్ ధర కేవలం రూ.146 గా ఉంది. కొబ్లెస్టోన్ వీధులు, లాంతర్లతో వెలిగే నది, అందమైన బీచ్‌లకు ఈ ప్రాచీన నగరం ప్రసిద్ధి చెందింది. బాలీ, ఫుకెట్ వంటి ఖరీదైన ప్రాంతాలకు బదులు, హోయ్ ఆన్ ఇప్పుడు పర్యాటకులకు కొత్త స్వర్గధామంగా మారింది.
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
టాప్-5లో కేప్‌టౌన్, బాలీ, టోక్యో
హోయ్ ఆన్ తర్వాత స్థానాల్లో ఉన్న ప్రాంతాలు కూడా ఆకర్షణీయమైన ధరలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. గతంలో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ ఈసారి రెండో స్థానానికి పడిపోయింది. ఇక్కడ ప్రాథమిక సెలవుల ఖర్చు రూ.7,619గా ఉంది. అత్యధిక పర్యాటకులు సందర్శించే ఇండోనేషియాలోని బాలీ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ ఖర్చు రూ.8,035. ఆసక్తికరంగా, బాలీలో ఇద్దరికి త్రీ-కోర్స్ డిన్నర్ ఖర్చు కేవలం రూ.4,206 మాత్రమే కావడం ఈ జాబితాలోనే అత్యంత చౌకైన డిన్నర్గా నిలిచింది. కెన్యాలోని మొంబాసా (రూ.8,099), జపాన్‌లోని టోక్యో (రూ.8,132) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
టాప్-10లో మన ఢిల్లీ సహా ఏడు ఆసియా ప్రాంతాలు
చౌకైన పర్యాటక ప్రాంతాల టాప్ 10 జాబితాలో ఆసియా ఖండం నుంచి మొత్తం ఏడు ప్రాంతాలు చోటు దక్కించుకోవడం విశేషం. ఇది ఆసియా వైపు పర్యాటకుల దృష్టి మళ్లుతున్నట్లు సూచిస్తోంది. శ్రీలంకలోని కొలంబో, మలేషియాలోని పెనాంగ్, థాయిలాండ్‌లోని ఫుకెట్ ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా, మన దేశ రాజధాని న్యూ ఢిల్లీ కూడా ఈ టాప్ 10 లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.
ఇది కూడా చదవండి : Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
మారకపు రేట్లే ప్రధాన కారణం
ఈ ప్రాంతాలు చలికాలపు సెలవులకు హాట్ స్పాట్లుగా మారడానికి స్థానిక ధరల తగ్గుదల ఒక కారణం కాగా, అనుకూలమైన మారకపు రేట్లు మరొక ప్రధాన కారణమని ట్రావెల్ మనీ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, ఆగ్నేయాసియా ప్రాంతంలో ధరలు గణనీయంగా తగ్గాయి.. పెనాంగ్‌లో 18.6%, ఫుకెట్‌లో 14.1% ధరలు తగ్గాయి. పర్యాటకులు తమ డబ్బుకు ఎక్కువ విలువ పొందుతున్నందున, ఈ దేశాలకు టూరిస్ట్‌ల ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.